దైవదర్శనానికి వెళ్లొస్తూ.. అనంతలోకాలకు

ABN , First Publish Date - 2022-12-08T08:16:03+05:30 IST

తిరువణ్ణామలై కార్తీక మహదీపోత్సవ వేడుకలకు హాజరై, పర్వాత శిఖరాగ్రంపై జ్యోతి దర్శనం చేసుకుని ఆనందంతో తిరిగివస్తున్న

దైవదర్శనానికి వెళ్లొస్తూ.. అనంతలోకాలకు

- తిరువణ్ణామలై నుంచి వస్తుండగా ప్రమాదం

- ఆరుగురి దుర్మరణం

- మధురాంతకం వద్ద దుర్ఘటన

- మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున సాయం

చెన్నై, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తిరువణ్ణామలై కార్తీక మహదీపోత్సవ వేడుకలకు హాజరై, పర్వాత శిఖరాగ్రంపై జ్యోతి దర్శనం చేసుకుని ఆనందంతో తిరిగివస్తున్న ఆరుగురు భక్తులను మృత్యువు కబళించింది. మధురాంతకం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం(Road accident)లో వీరు విగతజీవులయ్యారు. వీరితోపాటు వ్యాన్‌లో ప్రయాణించిన మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా నగరశివారు ప్రాంతమైన పోయిచ్చలూరులో కూలీలు. ఈ విషయం తెలిసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర దిగ్ర్భాంతిని సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తలా రూ.లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. వివరాలిలా... స్థానిక పల్లావరం సమీపం పోయిచ్చలూరు ప్రాంతంలో కూలీకార్మికులు, పెయింటర్లు, తాపీ మేస్త్రీలుగా ఉన్న చంద్రశేఖర్‌ (70), శశికుమార్‌ (35), దామోదరన్‌ (28), ఏళుమలై (65), గోకుల్‌ (33), శేఖర్‌ (55) సహా 12 మంది మంగళవారం ఉదయం సరుకులు రవాణా చేసే మినీవ్యాన్‌లో టార్ఫాలిన్‌ కట్టుకుని తిరువణ్ణామలై కార్తీక మహాదీపోత్సవానికి వెళ్ళారు. మంగళవారం సాయంత్రం వరకు వీరంతా అరుణాచలేశ్వరుడి దర్శనానంతరం భరణిదీపం, మహాదీపం వేడుకలను తిలకించారు. రాత్రి అక్కడే భోజనాలు ముగించుకుని అందరూ మినీ వ్యాన్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం వేకువజాము 4.30 గంటల ప్రాంతంలో ఆ మినీ వ్యాన్‌ మధురాంతకం సమీపం జానకిపురం వద్ద అదుపు తప్పి ముందు వెల్తుతున్న కంటైనర్‌ లారీని వెనుకనుంచి ఢీకొంది. అదే సమయంలో వ్యాన్‌ వెనుక వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్యలో ఆ మినీ వ్యాన్‌ చిక్కుకుని నుజునుజ్జయ్యింది. వ్యాన్‌ ముందుభాగం పూర్తిగా కంటైనర్‌ లారీ కిందికి చొచ్చుకుపోయింది. ఈ ధుర్ఘటనలో వ్యాన్‌లో ప్రయాణించిన చంద్రశేఖర్‌, శశికుమార్‌, దామోదరన్‌, ఏళుమలై, గోకుల్‌, శేఖర్‌ అనే వారు ఆ స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వీరితోపాటు ప్రయాణించిన టి.నగర్‌ కన్నమ్మాపేట ప్రాంతానికి చెందిన బాలమురుగన్‌ (22), తంజావూరు జిల్లా పేరావుర్నికి చెందిన రామమూర్తి (35), పోయిచ్చలూరుకు చెందిన సతీష్‌ (27), శేఖర్‌ (37), అయ్యనార్‌ (35), రవి (26) అనేవారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతులను, గాయపడినవారిని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. కంటైనర్‌ లారీ వెనుకన కూరుకుపోయిన వ్యాన్‌ శిథిలాల నుండి మృతదేహాలను తీయలేక భారీ క్రేన్‌లను తెప్పించి, వాటి సహాయంతో వ్యాన్‌ శిథిలాలలో చిక్కుకున్న మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీసారు. మృతదేహాలను పోస్టుమార్టంకు, గాయపడిన వారిని చికిత్సకు చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని డీఎస్పీ మణిమేఖలై సందర్శించి ఆరా తసారు. ప్రాథమిక విచారణలో మినీవ్యాన్‌లో పరిమితికి మించి 12 మంది ప్రయాణించడం, అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా తిరుచ్చి - చెన్నై జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలకు గంటకు పైగా తీవ్ర అంతరాయం ఏర్పడింది.

స్టాలిన్‌ సంతాపం...

మధురాంతకం వద్ద మినీవ్యాన్‌ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందటం పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే సంఘటన స్థలానికి వెళ్ళి బాధితులకు సహాయక చర్యలు చేపట్టమంటూ మంత్రి దామో అన్బరసన్‌ను పురమాయించినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు తలా రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2022-12-08T08:16:07+05:30 IST