డాక్టర్‌పై రోగి కుటుంబీకుల దాడి.. హాస్పిటల్ వార్డు ధ్వంసం.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-11-26T17:38:13+05:30 IST

రాజస్థాన్‌లోని కోట డివిజన్‌లోని అతిపెద్ద ఆస్పత్రి MBS హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో గందరగోళం చెలరేగింది. చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో డాక్టర్‌ను రోగి బంధువులు కొట్టారు. అనంతరం ఎమర్జెన్సీ వార్డులో సామాగ్రిని పాడు చేశారు.

డాక్టర్‌పై రోగి కుటుంబీకుల దాడి.. హాస్పిటల్ వార్డు ధ్వంసం.. అసలేం జరిగిందంటే..

రాజస్థాన్‌లోని కోట డివిజన్‌లోని అతిపెద్ద ఆస్పత్రి MBS హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో గందరగోళం చెలరేగింది. చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో డాక్టర్‌ను రోగి బంధువులు కొట్టారు. అనంతరం ఎమర్జెన్సీ వార్డులో సామాగ్రిని పాడు చేశారు. అనంతరం హాస్పిటల్ సిబ్బంది అంతా కలిసి రోగి బంధువులను తరిమికొట్టారు. చివరకు ఇరు వర్గాలు హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగాయి. చికిత్సలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు, తమపై దాడికి దిగిన వారిని శిక్షించాలని వైద్యులు హాస్పిటల్ ఎదుట మొహరించారు.

బుధవారం అర్ధరాత్రి 1 గంటకు కోటలోని MBS ఆసుపత్రిలో 26 ఏళ్ల మహిళ షాహిస్టా కడుపు నొప్పితో బాధపడుతూ మరణించింది. డాక్టర్ యశ్ వర్ధన్ నిర్లక్ష్యం వల్లే షాహిస్ట మరణించిందని ఆమె సోదరి డాక్టర్‌పై దాడికి దిగింది. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న డాక్టర్ యశ్ వర్ధన్‌పై కుర్చీ విసిరి దాడి చేసింది. అనంతరం మరికొందరు కూడా యశ్ వర్ధన్‌పై, అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడికి దిగారు. ఎమర్జెన్సీ వార్డులోని ఖరీదైన సామాగ్రిని పగలగొట్టారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న షాహిష్టను హాస్పిటల్‌కు తీసుకొచ్చామని, అయితే తమను ఎవరూ పట్టించుకోలేదని ఆమె భర్త జుబేర్ చెప్పాడు. పలు వార్డులకు తిప్పుతూ, వైద్య పరీక్షలు చేయిస్తూ కాలయాపన చేశారని, సరైన సమయంలో చికిత్స అందించి ఉంటే షాహిస్టా బతికేదని ఆమె భర్త చెబుతున్నాడు. తాము వైద్యుడిని నిలదీశాం తప్ప, హాస్పిటల్ సామాగ్రికి ఎలాంటి నష్టమూ కలిగించలేదని అతను చెబుతున్నాడు.

ఎంబీఎస్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దినేష్‌ వర్మ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో చేరే సమయానికి ఆమె పరిస్థితి విషమంగా ఉందని, డ్యూటీలో ఉన్న సీనియర్ వైద్యుడు ఆమెను చెక్ చేసి మధ్యాహ్నం 12 గంటలకు మహిళ పరిస్థితిని భర్తకు తెలియజేశారని తెలిపారు. అనస్థీషియాలజిస్టులు ఆమెకు ట్యూబులు పెట్టారని, సాయంత్రానికి పరిస్థితి విషమించడంతో ఎమర్జెన్సీకి తరలించి వెంటిలేటర్‌ అమర్చారని చెప్పారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది తప్పుడు ఆరోపణ అని, రోగికి ఇచ్చిన చికిత్స మొత్తం ప్రిస్క్రిప్షన్‌పై రాసి ఉందని తెలిపారు. తమ హాస్పిటల్ సిబ్బందిపై దాడి చేసి, ఎమర్జెన్సీ వార్డును ధ్వంసం చేసిన రోగి బంధువులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2022-11-26T17:38:34+05:30 IST