Shocking: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యాయత్నం.. 2 ఏళ్ల కూతురితో సహా సరస్సులోకి దూకి..

ABN , First Publish Date - 2022-11-27T23:04:35+05:30 IST

తన రెండేళ్ల కూతురితో సహా సరస్సులోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను బెంగళూరు పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

Shocking: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యాయత్నం.. 2 ఏళ్ల కూతురితో సహా సరస్సులోకి దూకి..

బెంగళూరు: తన రెండేళ్ల కూతురితో సహా సరస్సులోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను(Software Engineer) బెంగళూరు పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. దురదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఆ చిన్నారి మరణించింది. శనివారం కోలార్ తాలుకాలోని ఓ గ్రామానికి సమీపంలోని సరస్సులో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. బాలికకు తిండి పెట్టించగలిగేంత డబ్బులు కూడా తన వద్ద లేకపోవడంతో ఆత్మహత్యకు యత్నించినట్టు నిందితుడు రాహుల్ పర్మార్(Rahul Parmar) చెప్పాడు.

పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌కు(Gujarat) చెందిన రాహుల్ పర్మార్ రెండేళ్ల నుంచీ తన భార్యాబిడ్డలతో కలిసి బెంగళూరులో(Bengaluru) నివసిస్తున్నారు. అయితే..ఆరు నెలల నుంచి రాహుల్ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నారు. నవంబర్ 15న రాహుల్, ఆయన కూతురు కనిపించకుండా పోవడంతో ఆయన భార్య భవ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. శనివారం నాడు ఆ సరస్సు వద్ద ఓ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. అయితే..బిట్‌కాయిన్‌లో(Bitcoin) పెట్టుబడులు పెట్టిన రాహుల్‌కు నష్టాలు వచ్చినట్టు కూడా పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. కొంత కాలం క్రితం రాహుల్ తన ఇంట్లో బంగారం చోరీ జరిగిందంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ తరువాత..పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కేసు పురోగతి గురించి వాకబు చేసి వేళ్లారు. కానీ.. ఆయనే ఆ నగలను కుదువపెట్టి..పోలీసులను తప్పుదారి పట్టించేలా ఫిర్యాదు చేసినట్టు దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. దీంతో.. స్టేషన్‌కు రావాలని రాహుల్‌ను పోలీసులు ఆదేశించారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయోననే భయంతోనే అతడు ఆత్మహత్యకు యత్నించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానిజాలు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2022-11-27T23:51:51+05:30 IST