Arrest: పేరుమోసిన రౌడీల అరెస్టు

ABN , First Publish Date - 2022-12-04T08:07:35+05:30 IST

నగరంలో పెరుమోసిన రౌడీ ప్రకాష్‏(Prakash)తో పాటు మరో రౌడీని పోలీసులు అరెస్టు చేశారు.

Arrest: పేరుమోసిన రౌడీల అరెస్టు

- బాంబులు, కత్తులు స్వాధీనం

అడయార్‌(చెన్నై), డిసెంబరు 3: నగరంలో పెరుమోసిన రౌడీ ప్రకాష్‏(Prakash)తో పాటు మరో రౌడీని పోలీసులు అరెస్టు చేశారు. వారు ప్రయాణించిన కారు నుంచి 40 బాంబులతో పాటు 40 రకాల కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... కొడుంగయూరు ఇన్‌స్పెక్టర్‌ శరవణన్‌ సారథ్యంలో పోలీసులు శుక్రవారం రాత్రి తండయార్‌పేట హైరోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో కొరుక్కుపేట నుంచి కొడుంగయూరు వైపు వెళ్తున్న కారును ఆపారు. వారిని చూడగానే కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులపై దాడి చేసి, పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి వెంటపడ్డారు. ఈ క్రమంలో ఓ భవనంపై నుంచి దూకడంతో ఆ ఇద్దరు రౌడీలు గాయపడ్డారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని, చికిత్స కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కారులో తనిఖీ చేయగా, అందులో వివిధ రకాల కత్తులతో పాటు అనేక మారణాయుధాలు, నాటు బాంబులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, అదుపులోకి తీసుకున్న వారిద్దరు వెల్లై ప్రకాష్‌ (31), రెడ్‌హిల్స్‌ వడకరై అన్నా వీధికి చెందిన అప్పు అలియాస్‌ విక్రమాదిత్య (37)గా గుర్తించారు.

వెల్లై ప్రకాష్‏పై మూడు కేసులు

అరెస్టు చేసిన వారిలో వెల్లై ప్రకాష్‌ పేరుమోసిన రౌడీగా గుర్తించారు. అతడిపై మూడు మర్డర్‌ కేసులతో పాటు పదికి పైగా వివిధ క్రిమినల్‌ కేసులున్నట్టు తేలింది. నగరంలో పేరు మోసిన రౌడీ ప్రకాష్‌ పట్టుబడిన వార్త తెలుసుకున్న చెన్నై నార్త్‌ జోన్‌ జాయింట్‌ కమిషనర్‌ రమ్య భారతి, డిప్యూటీ కమిషనర్‌ ఈశ్వరన్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ తమిళ్‌వానన్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

తెన్నరసు రౌడీ హత్య కేసు సూత్రధారి

2015లో వెంగల్‌ - తామరైపాక్కం రహదారి కూడలిలో తెన్నరసు అనే రౌడీ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసు సూత్రధారి ప్రకా్‌షగా గుర్తించారు. అప్పటి నుంచి తెన్నరసు తమ్ముడు పులియంతోపుకు చెందిన పి.శరవరణన్‌కు, ప్రకాష్‌ రౌడీ ముఠాలకు మధ్య శత్రుత్వం కొనసాగుతోంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో శరవణన్‌, ఆయన ముఠా సభ్యులు తనను కూడా హత్య చేస్తారని ప్రకాష్‌ భావించాడు. దీంతో పాం శరవణన్‌ను హత్య చేసి, అతని కోసం రెక్కీ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత బుధవారం చెంగల్పట్టు కోర్టులో పాం శరవణన్‌, ఆయన ముఠా సభ్యులు హాజరుకాగా, అక్కడ తమ పథకాన్ని అమలు చేసేందుకు ప్లాన్‌ చేశారు. కోర్టులో తన మనుషులను కాపలాగా పెట్టి తాను మాత్రం కొడుంగయూరు వచ్చి స్నేహితులను కలుసుకుని తిరిగి వెళుతూ పోలీసులకు పట్టుబడ్డాడు.

జైలులో నాటుబాంబు తయారీ శిక్షణ

ఒక హత్య కేసులో అరెస్టయిన వెల్లై ప్రకా్‌షను వేలూరు కేంద్ర కారాగారంలో బంధించగా, అక్కడ నాటు బాంబుల తయారీ కేసులో శేఖర్‌ అనే రౌడీ పరిచయమయ్యాడు. అతడి ద్వారా నాటు బాంబుల తయారీలో వాడే ముడిపదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రకాష్‌ నాటు బాంబులు తయారు చేయడం ప్రారంభించాడు. తాజాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న నాటు బాంబులను కూడా ఆయనే తయారు చేసినట్టు సమాచారం.

లగ్జరీ కార్లలో ప్రయాణం

తనకు ప్రాణహాని ఉండటంతో చెన్నై నగర శివారుల్లో నివసించేందుకు భయపడిన ప్రకాష్‌.. సెంజి సమీపంలో రూ.50 లక్షలతో ఒక ఇల్లు కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నాడు. బెంజ్‌, ఆడి వంటి లగ్జరీ కార్లను కలిగిన ప్రకాష్‌.. వాటిలో తిరుగుతూ, సెటిల్‌మెంట్లు చేస్తూ జీవితాన్ని అనుభవిస్తూ వచ్చాడు.

Updated Date - 2022-12-04T08:10:17+05:30 IST