9 thousand crores: అధిక వడ్డీ పేరిట మోసం

ABN , First Publish Date - 2022-11-26T09:03:10+05:30 IST

అధిక వడ్డీ పేరుతో లక్షలాదిమంది నుంచి రూ.9 వేల కోట్ల(9 thousand crores) మేర మోసం చేసిన ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా ఏకంగా 2.13 లక్షల మందికి మోసగించినట్లు

9 thousand crores: అధిక వడ్డీ పేరిట మోసం

- రూ.9 వేల కోట్ల వసూలు !

- ముఠా కోసం పోలీసుల గాలింపు

అడయార్‌(చెన్నై), నవంబరు 25: అధిక వడ్డీ పేరుతో లక్షలాదిమంది నుంచి రూ.9 వేల కోట్ల(9 thousand crores) మేర మోసం చేసిన ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠా ఏకంగా 2.13 లక్షల మందికి మోసగించినట్లు స్పష్టమవుతుండడంతో పోలీసువర్గాలే దిగ్ర్భాంతి చెందుతున్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోన్న సాక్షాత్తు డీజీపీ కార్యాలయం ఈ ముఠా ఆట కట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వివరాలిలా...

చెన్నై కేంద్రంగా ఓ గోల్డ్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌ సంస్థలు తమ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవారికి 10 నుంచి 25 శాతం మేరకు వడ్డీ ఇస్తామని ఆశ చూపాయి. దీంతో 2.13 లక్షల మంది ఈ కంపెనీల్లో తమ స్థాయికి తగినట్టుగా డిపాజిట్లు చేశారు. అయితే గోల్డ్‌ ట్రేడింగ్‌ కంపెనీలో జరిగిన అక్రమాలపై ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ విచారణలో భాగంగా గత మే 24న చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం, వేలూరు, చెంగల్పట్టు, విరుదునగర్‌, తిరువణ్ణామలై, కడలూరు, అరియలూరుతో సహా 37 ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆధారాల మేరకు ఈ కంపెనీలో 1,09,255 మంది రూ.2,348 కోట్ల మేరకు డిపాజిట్లు చేసినట్టు వెల్లడైంది. ఈ ఆర్థిక అవకతవకలకు సంబంధించి మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి భాస్కర్‌, మోహన్‌బాబు, పట్టాభిరాం అనే ముగ్గురిని అరెస్టు చేశారు. మిగిలిన సంస్థల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి విల్లివాక్కంకు చెందిన రాజశేఖర్‌, కాంచీపురానికి చెందిన హరీష్‌, విరుదునగర్‌కు చెందిన మైఖేల్‌ రాజ్‌, చెన్నైకు చెందిన మణి అనే వారిని అరెస్టు చేశారు. అదేవిధంగా ఫైనాన్స్‌ సర్వీసెస్‏పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గత ఆగస్టు 4వ తేదీ ఆర్థిక నేర విభాగం కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ కంపెనీకి సంబంధించిన ఆర్థిక అవకతవకల్లో చెన్నైతో పాటు 21 ప్రాంతాల్లో ఆగస్టు 6న తనిఖీలు చేశారు. ఈ కంపెనీలో కూడా లక్ష మంది డిపాజిట్‌ చేశారు. వీరు సేకరించిన మొత్తం విలువ రూ.6 వేల కోట్లుగా తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన లక్ష్మి నారాయణన్‌ (36), వేద నారాయణ (38), జనార్థనన్‌ (39), మోహన్‌బాబు (34)ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదేవిధంగా వీరి అనుబంధ సంస్థలో 4500 మంది డిపాజిట్లు చేయగా, ఈ మొత్తం రూ.600 కోట్లుగా ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన నెహ్రూ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ మూడు ఫైనాన్స్‌ కంపెనీల్లో 2,13,755 మంది డిపాజిట్లు చేయగా, ఈ మొత్తం రూ.9,038 కోట్ల మేర ఉంది. దీంతో ఈ మూడు కంపెనీల మోసం కేసులో పది మంది పరారీలో ఉన్న నిందితులుగా ప్రకటించి, వారి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-11-26T09:03:12+05:30 IST