Tokenisation : RBI కొత్త రూల్ ‘టోకెనైజేషన్’ ఎందుకు?.. డెబిట్, క్రెడిట్ కార్డుదారుల అవగాహన కోసం..

ABN , First Publish Date - 2022-07-22T22:19:54+05:30 IST

డెబిట్ (Debit), క్రెడిట్ (Credit) కార్డులకు సంబంధించిన కొత్త ‘టోకెనైజేషన్’ (Tokenisation) నిబంధన అమలును కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ(RBI) ఇటివలే మరోసారి పొడిగించింది.

Tokenisation : RBI కొత్త రూల్ ‘టోకెనైజేషన్’ ఎందుకు?.. డెబిట్, క్రెడిట్ కార్డుదారుల అవగాహన కోసం..

న్యూఢిల్లీ : డెబిట్ (Debit), క్రెడిట్ (Credit) కార్డులకు సంబంధించిన కొత్త ‘టోకెనైజేషన్’ (Tokenisation) నిబంధన అమలును కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ(RBI) ఇటివలే మరోసారి పొడిగించింది. జులై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా సెప్టెంబర్ 30 దాకా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. వేర్వేరు పారిశ్రామిక సమాఖ్యల ప్రతినిధుల నుంచి అందిన విన్నపాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. టోకెనైజేషన్ విధానంలో లావాదేవీల పరిశీలనలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ అన్నివర్గాల వర్తకుల నుంచి సూచనలు వచ్చాయని తెలిపింది. ఈ నేపథ్యంలో అసలు టోకెనైజేషన్ అంటే ఏంటి?.  డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లావాదేవీలకు ఈ విధానం ఎందుకు? అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం..


కార్డు చెల్లింపులు మరింత సురక్షితం

కార్డు వివరాలతో ప్రత్యమ్నాయంగా రూపొందించే కోడ్‌నే ‘టోకెన్’ అంటారు. కార్డు, టోకెన్ జారీ చేసే సంస్థ(టోకెన్ రిక్వెస్టర్), డివైజ్‌లకు ఉమ్మడిగా ఒకే టోకెన్ ఉంటుంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో ఆన్‌లైన్‌ లావాదేవీలు మరింత భద్రంగా నిర్వహించడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ నిబంధనను ప్రవేశపెట్టింది. కొత్త నిబంధన అమలుతో మర్చంట్లు కస్టమర్ల కార్డు వివరాలను తమ సర్వర్ల నుంచి తొలిగించాల్సి ఉంటుంది. వాటి స్థానంలో ఎన్‌క్రిప్టెడ్‌ టోకెన్‌ రూపంలో మాత్రమే ఆ వివరాలు భద్రపరుచుకునే వీలుంటుంది. ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపే వినియోగదారులు తరచుగా ఉపయోగించే ఈ-కామర్స్‌ సైట్లు, ఫుడ్‌ డెలివరీ యాప్‌లలో తమ కార్డు వివరాలు స్టోర్‌ చేస్తుంటారు. తద్వారా ఆ వైబ్‌సైట్‌ లేదా కంపెనీ సర్వర్‌లో కస్టమర్‌ కార్డు వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఒకవేళ ఆ సర్వర్‌ హ్యాకింగ్‌కు గురైతే ఆ కార్డు వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం పొంచివుంది. టోకనైజ్డ్‌ సర్వీసుల ద్వారా ఈ తరహా ముప్పును తప్పించుకునే వీలుంటుంది. ఎందుకంటే, కార్డు జారీ చేసిన కంపెనీ మాత్రమే టోకెన్‌ను డీక్రిప్ట్‌ చేయగలదు. ఈ విధానంలో ముందుగా కస్టమరు కార్డు వివరాల టోకెన్‌ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుడి కార్డు, టోకెన్‌ కోసం అభ్యర్థించిన సంస్థ, డివైజ్‌(కార్డు ఉపయోగించిన డివైజ్) ఆధారంగా కార్డు కంపెనీ కొత్త టోకెన్‌ను జారీ చేస్తుంది. ఈ టోకెన్‌లోనే కార్డు వివరాలు ఎన్‌క్రిప్ట్‌ చేసి ఉంటాయి. కాబట్టి కస్టమర్లు ఒక టోకెన్‌తో ఈ-కామర్స్‌ సైట్‌, ఫుడ్‌ డెలివరీ యాప్‌ లాంటి ఒక ప్లాట్‌ఫామ్స్‌పై పలుమార్లు చెల్లింపులు జరిపే వీలుంటుంది. 


టోకెనైజేషన్‌కు ఫీజులు చెల్లించక్కర్లేదు..

కార్డు వివరాలతో ప్రత్యమ్నాయ రూపొందించే కోడ్‌నే ‘టోకెన్’ అంటారు. కార్డు, టోకెన్ జారీ చేసే సంస్థ(టోకెన్ రిక్వెస్టర్), డివైజ్‌లకు ఉమ్మడిగా ఒకే టోకెన్ ఉంటుంది. టోకెన్ రిక్వెస్టర్ అందుబాటులోకి తీసుకొచ్చే యాప్ ద్వారా టోకెనైజేషన్ కోసం కస్టమర్లు దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్బీఐ ఇదివరకే స్పష్టం చేసింది. ఈ రిక్వెస్ట్‌ని కార్డ్ నెట్‌వర్క్‌కు పంపిస్తారు. ఇందుకుగానూ కార్డ్‌హోల్డర్ ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తద్వారా వేర్వేరు కంపెనీల ప్లాట్‌ఫామ్స్‌పై ఇప్పటివరకు కార్డ్ వివరాలు మాత్రమే సేవ్ అవ్వగా.. ఇకపై టోకెన్ వివరాలు మాత్రమే సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. టోకెనైజేషన్ విధానంలో ఒక కస్టమర్ ఒక చెల్లింపునకు సంబంధించి తన కార్డులను రిజిస్టర్ లేదా డీరిజిస్టర్ చేసుకోవడం అతడి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.


టోకెనైజేషన్ తప్పనిసరి కాదు..

కార్డు టోకెనైజేషన్‌ తప్పనిసరేం కాదు. కస్టమర్‌ సమ్మతితోనే మర్చంట్‌ తన సర్వర్లో ఎన్‌క్రిప్టెడ్‌ టోకెన్‌ను నిక్షిప్తం చేసుకునేందుకు వీలుంటుంది. కార్డు వివరాల టోకనైజేషన్‌ వద్దనుకున్న పక్షంలో కస్టమరు ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపే ప్రతిసారి తన కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు (పేరు, కార్డు నంబరు, వాలిడిటీ, సీవీవీ) ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2022-07-22T22:19:54+05:30 IST