No poaching Agreement: అంబానీ, అదానీ అగ్రిమెంట్.. రెండు సంస్థల ఉద్యోగులకు కొత్త కష్టం షురూ..?

ABN , First Publish Date - 2022-09-24T21:58:37+05:30 IST

ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీల నేతృత్వంలోని సంస్థల మధ్య.. ఉద్యోగులకు సంబంధించి ఓ ఒప్పందం కుదిరిందన్న వార్త ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఒకరి సంస్థలోని ఉద్యోగులను మరొక సంస్థలో చేరే విషయంలో ఆంక్షలు విధిస్తూ రిలయన్స్(Reliance), అదానీ(Adani) గ్రూప్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయట.

No poaching Agreement: అంబానీ, అదానీ అగ్రిమెంట్.. రెండు సంస్థల ఉద్యోగులకు కొత్త కష్టం షురూ..?

ఇంటర్నెట్ డెస్క్: ఆర్థికంగా, వృత్తిపరంగా ఎదగాలనుకునే ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడం సహజమే. అలా కుదరదనడం ఉద్యోగుల హక్కులకు భంగం కలిగించడమే! ఈ నేపథ్యంలో ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీల నేతృత్వంలోని సంస్థల మధ్య.. ఉద్యోగులకు సంబంధించి ఓ ఒప్పందం కుదిరిందన్న వార్త ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఒకరి సంస్థలోని ఉద్యోగులను మరొక సంస్థలో చేరే విషయంలో కఠిన ఆంక్షలు విధిస్తూ రిలయన్స్(Reliance), అదానీ(Adani) గ్రూప్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయట. ఈ ఏడాది మే నెలలోనే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది.  ఈ తరహా ఒప్పందాలను న్యాయపరిభాషలో నో పోచింగ్ అగ్రిమెంట్(No Poaching Agreement) అని అంటారు. ఈ విషయమై రెండు సంస్థలు ఎటువంటి ప్రకటనా విడుదల చేయనప్పటికీ.. ‘నో పోచింగ్ అగ్రిమెంట్’ అంశం దేశంలో పెద్ద చర్చకే తెరలేపింది. 


నో పోచింగ్ అగ్రిమెంట్ అంటే..

వ్యాపారాభివృద్ధికి నిపుణులైన ఉద్యోగులు ఎంతో కీలకం. వారి శ్రమ, సృజనాత్మకత కారణంగానే సంస్థలు ప్రగతి పథంలో దూసుకుపోతాయి. ఇక నిపుణుల కొరత అధికంగా ఉన్న రంగాల్లోని కంపెనీలు.. ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకునేందుకు నానా అవస్థలు పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థి సంస్థల ఉద్యోగులను తమ సంస్థల్లో నియమించుకునే ప్రయత్నం చేస్తాయి.  భారీ శాలరీలు, ఇతర వసతుల ఆశ చూపి వారిని ఆకర్షించేందుకు యత్నిస్తాయి.ఇలా ఉద్యోగుల కోసం సంస్థల మధ్య పోటీ వాటికి ఆర్థికంగా భారంగా మారుతుంటుంది. ఈ పరిణామాలను నిరోధించేందుకే సంస్థల మధ్య నో పోచింగ్ అగ్రిమెంట్ తెరపైకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా మన దేశంలో ఈ అగ్రిమెంట్లు అమలులో ఉన్నప్పటికీ.. రిలయన్స్, అదానీ గ్రూప్ సంస్థలకు ఉన్న ప్రాముఖ్యత రీత్యా ఈ అంశం ప్రస్తుతం వార్తల్లో నానుతోంది. రిలయన్స్ సంస్థల ఆధిపత్యం ఉన్న టెలీ కమ్యునికేషన్స్, పెట్రోకెమికల్స్ రంగాల్లోకి అదానీ గ్రూప్ సంస్థలు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలోనే ఈ ఒప్పందం తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. 


ఈ ఒప్పందంలో పలు రకాల నిబంధనలు ఉంటాయని నిపుణులు చెబుతారు. ఫలితంగా ఓ సంస్థలోని ఉద్యోగి ప్రత్యర్థి కంపెనీలోకి చేరడం దాదాపుగా అసాధ్యమైపోతుందని అంటారు. కొత్త కంపెనీలో చేరాలనుకున్న వారు.. ఇప్పుడున్న సంస్థ అనుమతి పొందాలా వద్దా..? ప్రస్తుత సంస్థలో చేరినప్పుడు తీసుకున్న సైన్-ఇన్ బోనస్‌ను తిరిగిచ్చేయాలా..? తదితర కీలక ప్రశ్నలకు సంబంధించి సవివరమైన విధివిధానాలు అగ్రిమెంట్‌లో ఉంటాయి. ఈ ఒప్పందాల ఫలితంగా.. ఉద్యోగులు ప్రత్యర్థి సంస్థలోకి మారినా కూడా.. మునుపటి జీతంతో, మునుపటి పదవిలోనే కొనసాగేలా పరిస్థితులు కూడా ఉండొచ్చు. అయితే.. చాలా సంస్థల సీఈఓలు మౌఖికంగా, అనధికారికంగా ఇటువంటి ఒప్పందాలు చేసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిభగల ఉద్యోగులకు భారీ డిమాండ్ ఉన్న టెక్నాలజీ, ఎయిరోస్పేస్, సాఫ్ట్‌వేర్ తదితర రంగాల్లోని సంస్థల మధ్య.. ఇలాంటి ఒప్పందాలు సాధారణమేనని సమాచారం.


అమెరికాలో(USA) నో పోచింగ్ అగ్రిమెంట్‌లపై వివాదాలు..

గూగుల్(Google, మైక్రోసాఫ్ట్(Microsoft), ఇతర టెక్ కంపెనీలు.. పరస్పరం నో పోచింగ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవడం పట్ల అభ్యంతరం చెబుతూ అమెరికా న్యాయశాఖ(Department of Justice) 2010లో న్యాయస్థానంలో కేసు ధాఖలు చేసింది. అయితే.. కొన్ని నెలల తరువాత..టెక్ కంపెనీలు న్యాయశాఖతో కోర్టు బయటే రాజీ కుదుర్చుకున్నాయి. ఉద్యోగుల విషయంలో ఇటువంటి ఒప్పందాలు ఏవీ కుదుర్చుకోబోమని పేర్కొన్నాయి. ఈ సెటిల్మెంట్ ఆధారంగా 2011లో.. టెక్ కంపెనీలకు చెందిన సుమారు 65 వేల మంది ఉద్యోగులు ఉమ్మడిగా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కూడా ఇరువర్గాలు కోర్టు బయటే రాజీ కుదుర్చుకున్నాయి. దీంతో.. ఆ ఒప్పందంలో ఏ నిబంధనలు ఉన్నాయనే అంశంపై పూర్తి స్పష్టత లేకుండా పోయింది. 


ప్రస్తుతం రిలయన్స్‌లో 3.80 లక్షల పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదానీ సంస్థల్లోని ఉద్యోగుల సంఖ్య 28 వేలకు పైనే అని తెలుస్తోంది. ఇక నో పోచింగ్ ఒప్పందం ఫలితంగా ఆయా సంస్థల్లోని ఉద్యోగులు రెండో కంపెనీలోకి మారడం కష్టంగా మారొచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కంపెనీ మారాల్సి వచ్చినా.. ఎటువంటి ప్రమోషన్ లేకుండా, మునుపటి వేతనంతోనే కొత్త సంస్థలో చేరాల్సి రావచ్చని చెబుతున్నారు.  


Updated Date - 2022-09-24T21:58:37+05:30 IST