ఎలక్ర్టానిక్‌ చిప్‌ ఉత్పత్తిలోకి వేదాంత

ABN , First Publish Date - 2022-02-19T08:36:58+05:30 IST

భారత పారిశ్రామిక దిగ్గజం వేదాంత ఎలక్ర్టానిక్‌.. చిప్‌, డిస్‌ప్లే తయారీ రంగంలోకి ప్రవేశిస్తోది. ఇందుకోసం 1,500 కోట్ల డాలర్లు (రూ.1.13 లక్షల కోట్లు) కేటాయించింది.

ఎలక్ర్టానిక్‌ చిప్‌ ఉత్పత్తిలోకి వేదాంత

రూ.లక్ష కోట్ల పెట్టుబడి


న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక దిగ్గజం వేదాంత ఎలక్ర్టానిక్‌.. చిప్‌, డిస్‌ప్లే తయారీ రంగంలోకి ప్రవేశిస్తోది. ఇందుకోసం 1,500 కోట్ల డాలర్లు (రూ.1.13 లక్షల కోట్లు) కేటాయించింది. రాబో యే కాలంలో ఈ పెట్టుబడిని 2,000 కోట్ల డాలర్లకు (రూ.1.5 లక్షల కోట్లు) పెంచాలనుకుంటున్నట్టు వేదాంత గ్రూప్‌నకు చెందిన డిస్‌ప్లే, సెమీ కండక్టర్‌ విభాగం గ్లోబల్‌ ఎండీ ఆకర్ష్‌ హెబ్బార్‌ తెలిపారు. మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్స్‌ డివై్‌సలలో ఉపయోగించే డిస్‌ప్లే యూనిట్లను 2024 నాటికి వాణిజ్యపరంగా మార్కెట్లో విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.


అలాగే 2025 నాటికి 28 నానోమీటర్‌ పరిమాణం గల ఎలక్ర్టానిక్‌ చిప్‌లు కూడా విడుదల చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. సెమీ కండక్టర్లు దీర్ఘకాలిక వ్యాపారమని, తొలుత వెయ్యి కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నామని ఆయన అన్నారు. అందులో కూడా 700 కోట్ల డాలర్లు తక్షణం ఇన్వెస్ట్‌ చేసి మిగతా 300 కోట్ల డాలర్లు తదుపరి దశలో పెడతామని చెబుతూ.. రాబోయే 10  ఏళ్లలో ఈ పెట్టుబడిని 1,500 కోట్ల డాలర్లకు పెంచాలన్నది తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల పథకం కింద సెమీ కండక్టర్‌ ప్లాంట్‌, డిస్‌ప్లే తయారీ యూనిట్‌ ఏర్పాటుకు దరఖాస్తు చేశామని హెబ్బార్‌ అన్నారు. స్థానిక డిమాండ్‌కే తాము ప్రాధాన్యం ఇవ్వదలిచామని, కేవలం 25-30 శాతం ఎగుమతులకు కేటాయించనున్నట్లు ఆయన  వివరించారు. 


కాగా సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించి  జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసేందుకు ఫాక్స్‌కాన్‌తో  వేదాంత గ్రూప్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే తుది ఒప్పందం కూడా కుదరనున్నట్టు హెబ్బార్‌ చెప్పారు. కాగా వేదాంత గ్రూప్‌ అనుబంధ సంస్థ అవాంస్ట్రేట్‌ డిస్‌ప్లే వ్యాపారాలను నిర్వహిస్తుంది. దేశంలో సెమీ కండక్టర్ల తయారీని ప్రోత్సమించేందుకు రూ.76,000 కోట్ల పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆ రంగంలోకి ప్రవేశించేందుకు సంసిద్ధత ప్రకటించిన తొలి కంపెనీ వేదాంత. 

Read more