మార్కెట్లోకి టియాగో ఈవీ

ABN , First Publish Date - 2022-09-29T09:26:57+05:30 IST

టాటా మోటార్స్‌ ప్రజాదరణ పొందిన మోడల్‌ టియాగోలో విద్యుత్‌ కారును బుధవారం మార్కెట్లోకి తెచ్చింది.

మార్కెట్లోకి టియాగో ఈవీ

ప్రారంభ ధర రూ.8.49 లక్షలు

ముంబై : టాటా మోటార్స్‌ ప్రజాదరణ పొందిన మోడల్‌ టియాగోలో విద్యుత్‌ కారును బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.8.49 లక్షలు-రూ.11.79 లక్షలు. తొలి 10 వేల మంది కస్టమర్లకే ఈ ధరకు కారు అందిస్తామని ప్రకటించింది. మార్కెట్లో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉన్న విద్యుత్‌ కారు ఇదే. అలాగే టాటా మోటార్స్‌ ఇతర విద్యుత్‌ కార్ల కన్నా కూడా అతి తక్కువ ధరలోనే ఈ కారు లభిస్తుంది. కంపెనీ ఇప్పటికే దేశీయ మార్కెట్లో టిగొర్‌, నెక్సన్‌ విద్యుత్‌ కార్లను విక్రయిస్తోంది. అలాగే టియాగోతో దేశంలో విద్యుత్‌ కార్లు అందుబాటులో ఉండే టాటా మోటార్స్‌ షోరూమ్‌ల సంఖ్య కూడా 90 నుంచి 165కి పెరుగుతుంది. వచ్చే నెల 10వ తేదీ నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల డెలివరీ ప్రారంభించనున్నట్టు తెలిపింది.   


కారు ప్రత్యేకతలు...

రెండు బ్యాటరీ వేరియెంట్లలో ఈ కారు అందుబాటులోకి వస్తుంది. 25 కిలోవాట్‌ బ్యాటరీతో వచ్చే కారు ఒక సారి చార్జి చేస్తే 315 కిలోమీటర్లు నడుస్తుంది. అలాగే 19.2 కిలోవాట్‌ బ్యాటరీతో వచ్చే కారు ఒక సారి చార్జి చేస్తే 250 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ కార్లు కేవలం 5.7 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగం అందుకుంటాయి. రిమోట్‌ ఎసి కంట్రోల్‌, వెహికల్‌ ట్రాకింగ్‌ వంటి కనెక్టెడ్‌ సౌకర్యాలతో పాటు టచ్‌ స్ర్కీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, ఆన్‌ ఆఫ్‌ పుష్‌ బటన్‌ వంటి ఆధునిక ఫీచర్లన్నీ ఈ కారులో ఉన్నాయి.

Read more