money habits: మీ జీవితాన్నే మార్చివేసే 5 ‘డబ్బు అలవాట్లు’ ఇవీ.. పాటించినవారికి తిరుగుండదు

ABN , First Publish Date - 2022-09-19T20:16:15+05:30 IST

ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా గడపబోతున్నాడనేది అతడి ఆర్థిక క్రమశిక్షణ నిర్దేశిస్తుంది. డబ్బు సంపాదన, వ్యయం, కొనుగోళ్ల విషయంలో వ్యక్తుల నడవడిక వారి ఆర్థిక భవిష్యత్‌కు ప్రతిబింబమవుతుంది.

money habits: మీ జీవితాన్నే మార్చివేసే 5 ‘డబ్బు అలవాట్లు’ ఇవీ.. పాటించినవారికి తిరుగుండదు

క వ్యక్తి తన జీవితాన్ని ఎంత మెరుగ్గా గడపబోతున్నాడనేది అతడి ఆర్థిక క్రమశిక్షణ(financial discipline) నిర్దేశిస్తుంది. డబ్బు సంపాదన(Income), వ్యయం, కొనుగోళ్ల విషయంలో వ్యక్తుల నడవడిక వారి ఆర్థిక భవిష్యత్‌కు కొలమానం లాంటిది. డబ్బు(money) విషయంలో అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అయితే సరైన అవగాహన, ముందుచూపుతో వ్యవహరిస్తే ఆర్థిక పరిపుష్టిని(financial strongness) సాధించవచ్చు. ఎవరి దగ్గర చేయి చాచకుండా సొంతకాళ్లపై నిలబడవచ్చు. అందుకు అవసరమైన, జీవితాన్నే మార్చివేసే 5 డబ్బు అలవాట్ల(Money habits)ను టెక్-ఫిన్ సంస్థ డెసిమల్(Deciml) వ్యవస్థాపకుడు, సీఈవో సత్యజీత్ కున్‌జీర్ వెల్లడించారు. ముఖ్యంగా 20 -25 ఏళ్ల వయసు నుంచే ఈ అలవాట్లను అలవరచుకుంటే ఆర్థికంగా మెరుగైన జీవితం ఉంటుందని ఆయన సూచించారు. ఆ అలవాట్లు ఏవో మీరూ ఓ లుక్కేయండి..


ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

జీవితంలో ఆర్థికంగా ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారో లక్ష్యాలను ముందస్తుగానే నిర్ణయించుకోవాలి. వాటికి కాలపరిమితులను నిర్దేశించుకోవాలి. లక్ష్యాలు చిన్నవైనా పెద్దవైనా ఎప్పటిలోగా అధిరోహించాలనేదానిపై చక్కటి ప్లానింగ్ చేసుకోవాలి. సకాలంలో వాటిని చేరుకునేలా అడుగులు వేయాలి. లక్ష్యాలను గడువులోగానే సాధించాలి. ఆలస్యమయ్యేందుకు తావివ్వకుండా ముందుకుసాగాలి. యాక్షన్ ప్లాన్‌కు తగ్గట్టు ముందుకు వెళ్తే సులభంగానే మీరు అనుకున్నది సాధించవచ్చు. 20 - 25 ఏళ్లలోపు వారే కాదు.. పెద్ద వయస్కులైనా తమ పరిస్థితులకు తగ్గట్టు మున్ముందైనా లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగవచ్చు.


నెలవారీ ఖర్చులకు బడ్జెట్ వేయండి

పెరుగుతున్న ఖర్చులు ఒకవైపు.. ఆకర్షించే వస్తువులు, గాడ్జెట్లు మరోవైపు.. ఇలాంటి పరిస్థితుల మధ్య సేవింగ్స్ చేయడం అంటే కాస్త కష్టంగానే అనిపిస్తుంది. కానీ నెలవారీ వ్యయాలపై పరిమితులు విధించుకుంటే సేవింగ్స్‌ సాధ్యమవుతాయి. ఆర్థిక లక్ష్యాల ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేసేందుకు క్రమశిక్షణగా వ్యవహరించడం చాలా చాలా కీలకం. అందుకే నెలవారీ ఖర్చులపై ముందుగానే బడ్జెట్‌ను రూపొందించుకోవాలి. కొంత కష్టంగా అనిపించినా మీ బడ్జెట్ పరిధి దాటకుండా ముందుకు వెళ్తే మీ లక్ష్యాలను సాధించుకోవచ్చు.


సకాలంలో బిల్లులు చెల్లించండి

ఆర్థిక పరిపుష్టిని సాధించడంలో సకాలంలో బిల్లులు చెల్లింపు అంశం చాలా ముఖ్యనది. గడువులోగా బిల్లులు చెల్లిస్తే ఒత్తిడి తగ్గిపోతుంది. ఆ తర్వాత మిగిలిన డబ్బును ఎంతవరకు సేవింగ్ చేయగలమనే అంశంపై దృష్టిసారించవచ్చు. అంతేకాకుండా ఉన్న డబ్బును ఏవిధంగా ఖర్చు చేయాలనేదానిపై కూడా స్పష్టత వస్తుంది.

శోధించండి.. తెలుసుకోండి..

ఆర్థిక ప్రణాళికలు, పెట్టుబడులపై అవగాహన లేనివారికి ఇంటర్నెట్ చక్కటి వేదిక. బ్లాగ్స్, వ్లోగ్స్‌‌పై ఆర్థికపరమైన సమాచారం పుష్కలంగా లభిస్తోంది. సోషల్ మీడియా, టెలిగ్రామ్ వంటి ఫ్లాట్‌ఫామ్స్‌పై కూడా చక్కటి కంటెంట్ అందుబాటులో ఉంది. ఆ సమాచారాన్ని శోధించి అనుగుణమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చు. సమాచారం వరకే కాదు.. ఇన్వెస్టింగ్‌కు సంబంధించి కొన్ని యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు.


పెట్టుబడి ఎలా ఉండాలో నేర్చుకోండి

అవగాహనలేని పెట్టుబడి అనర్థాలను తెచ్చిపెట్టగలదు. కాబట్టి పెట్టుబడి పెట్టేముందు స్పష్టమైన అవగాహన ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పెట్టుబడి కూడా పెరగాలి. కానీ అందుకు విరుద్ధంగా మన పెట్టుబడి విలువ తగ్గితే నిష్ప్రయోజనం.  అందుకే పెట్టుబడిపై సంపూర్ణ అవగాహన ఉండాలి. పెట్టుబడి చిన్నదైనా పెద్దదైనా అవగాహన లేకుండా గుడ్డిగా వ్యవహరిస్తే ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు. కాబట్టి ఏమైనా పెట్టుబడులు ఉంటే వాటిని సమీక్షించుకుని, సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అనేది విశ్లేషించుకోవడం చాలా చాలా ముఖ్యం. 


కెరీర్ ఆరంభం నుంచే చక్కటి ఆర్థిక ప్రణాళికలు ఉండడం యువతకు ఎంతో ముఖ్యం. భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా పటిష్టమైన బాటలు ఏర్పాటు చేసుకుంటే చిన్న వయసులోనే ఆర్థిక స్వతంత్రత సాధించవచ్చు.

Read more