payment frauds: డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా?.. ఈ విషయాలు తెలియనివారు మోసపోయే ఛాన్స్.. మీకు తెలుసా లేదా..

ABN , First Publish Date - 2022-10-07T03:17:05+05:30 IST

డిజిటల్ యుగం ఇది. దరఖాస్తుల నుంచి చెల్లింపుల వరకు అన్ని డిజిటల్‌గానే జరిగిపోతున్న రోజులివీ. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులు అనూహ్య స్థాయికి పెరిగిపోయాయి.

payment frauds: డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా?.. ఈ విషయాలు తెలియనివారు మోసపోయే ఛాన్స్.. మీకు తెలుసా లేదా..

డిజిటల్ యుగం ఇది. దరఖాస్తుల నుంచి చెల్లింపుల వరకు అన్నీ ఆన్‌లైన్ రూపంలోనే జరిగిపోతున్న రోజులివీ. ముఖ్యంగా కరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులు అనూహ్యంగా పెరిగిపోయాయి. క్రెడిట్ కార్డుల నుంచి మొబైల్ వాలెట్స్ వరకు అన్ని లావాదేవీలు డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి. టెక్నాలజీ పుణ్యమాని కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లపై ఈ లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే డిజిటల్ చెల్లింపులు పెరుగుదలతోపాటు సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా  సైబర్ మోసాల్లో బాధితులుగా మిగిలిపోవడం ఖాయం. మరి ఇలాంటి మోసాల బారిన పడకుండా యూజర్లు అవగాహన కలిగివుండాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి.


ఫేక్ లోన్ ఆఫర్లు..

నకిలీ లోన్ల పేరిట జరుగుతున్న మోసాల సంఖ్య ఎక్కువగానే ఉంది. నమ్మలేనంత తక్కువ రేటుకే రుణం ఇస్తామని మోసగాళ్లు నమ్మబలుకుతారు. పరిమితకాలపు ఆఫర్ అని, వ్యాలిడిటీ ముగిసిపోతుందని కంగారుపెడతారు. లోన్ జారీ చేయాలంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. కస్టమర్లను బురిడి కొట్టించేందుకు బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలను పోలివుండేలా ఈ-మెయిల్స్ పంపిస్తుంటారు. వీటిని నమ్మి డబ్బులు చెల్లిస్తే మోసపోయినట్టే. ఇలాంటివి బోగస్ లోన్ ఆఫర్లు అని గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించడం ఉత్తమం. ఇలా తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు ఇప్పిస్తామంటూ అస్సలు నమ్మొద్దు.


కేవైసీ అప్‌డేట్ స్కామ్..

ఆన్‌లైన్ వాలెట్లకు కేవైసీ అవసరం కావడంతో మోసగాళ్లు దీన్నొక అవకాశంగా మలుచుకుంటున్నారు. కేవైసీ అప్‌డేట్‌ను సూచిస్తూ ఏదైనా లింక్ డైరెక్టింగ్ టెక్స్ట్ మెసేజ్ వస్తే దానిని నమ్మొద్దు. అకౌంట్ నంబర్ వివరాలు లేదా క్రెడిట్ కార్డు వివరాలు లేదా ఓటీపీ ఇవ్వాలని లింక్‌లో కోరతారు. వివరాలన్నీ సమర్పిస్తే ఖాతాలోని డబ్బంతా ఖాళ్లీ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి మెసేజుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.


ఇన్సూరెన్స్ మోసాలు..

ఈ తరహా మోసాల్లో ఇన్సూరెన్స్ నియంత్రణ సంస్థల వెబ్‌సైట్ల గుర్తింపుపై అవగాహనలేని వినియోగదార్లే టార్గెట్‌గా ఉంటారు. అప్పటికే ఇన్సూరెన్స్ కలిగివున్న వ్యక్తులను సంప్రదించి లోన్లు ఇస్తామని నమ్మబలుకుతారు. ఫైనాన్సియల్ సంస్థల ప్రతినిధులమంటూ  నమ్మించే ప్రయత్నం చేస్తారు. వారు పంపించే లింక్స్‌పై క్లిక్ చేస్తే మోసపోవడం ఖాయం. వాళ్లు పంపించిన వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచే ముందు అది నిజమైన పోర్టలో కాదో గుర్తించాలి. అందుకోసం వెబ్‌సైట్ HTTPS తో మొదలైతే అది సేఫ్.. దానికి బదులు  HTTP మాత్రమే ఉంటే అది ఫేక్ వెబ్‌సైట్ అని నిర్ధారించుకోవచ్చు. మరోవైపు వెబ్‌సైట్ ఫిజికల్ అడ్రస్, ఈ-మెయిల్ అడ్రస్‌ని నిర్ధారించుకోవాలి.


ఫిషింగ్..

ఈ తరహా మోసాల్లో గుర్తింపు కలిగిన కంపెనీల మాదిరిగా కేటుగాళ్లు ఈ-మెయిల్స్ పంపిస్తారు. అందులో లింక్స్‌ లేదా డౌన్‌లోడింగ్ అటాచ్‌మెంట్స్ ఉంటాయి. ఆ లింక్స్‌పై క్లిక్ చేసినా లేదా ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నా వ్యక్తిగత డేటా మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. మీ ఫోన్‌లోకి కూడా చొరబడే అవకాశం ఉంటుంది. ఇలాంటి మోసాల బారినపడకూడదంటే ఈ-మెయిల్స్‌లో వచ్చిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కాల్, మెయిల్, టెక్స్ట్ లేదా వాట్సప్ రూపంలో వచ్చే అలాంటి సందేశాలకు రిప్లై ఇవ్వకపోవడం మంచిది.


కాగా ఎవరైనా ఆన్‌లైన్ మోసాల బారినపడితే పోలీస్, సైబర్ క్రైమ్ సెల్ లేదా టెలికం రెగ్యులేటర్లకు తక్షణమే ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్‌కి సంబంధించిన మోసాలను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా 1930 నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.

Read more