October rules: అక్టోబర్ 1 నుంచి ఆర్థికంగా ప్రభావితం చేసే 6 కొత్త రూల్స్ అమల్లోకి.. మీపై ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా..

ABN , First Publish Date - 2022-10-01T00:33:25+05:30 IST

ఆర్థిక సంబంధ విషయాలను అవసరాన్ని మార్పులు చేసుకుంటుంటాయి. ఆర్బీఐ(RBI) లేదా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తుంటాయి.

October rules: అక్టోబర్ 1 నుంచి ఆర్థికంగా ప్రభావితం చేసే 6 కొత్త రూల్స్ అమల్లోకి.. మీపై ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసా..

ర్థిక సంబంధ విషయాలు అవసరాన్ని బట్టి మార్పులు చేసుకుంటుంటాయి. ఆర్బీఐ(RBI) లేదా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తుంటాయి. ఈ కారణంగానే మార్పులు అనివార్యమవుతుంటాయి. ఇదే తరహాలో అక్టోబర్ 1, 2022 నుంచి కూడా కొన్ని ఆర్థిక సంబంధ వ్యవహారాల నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి..


1. క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీలు మరింత సురక్షితం..

క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులకు మరింత రక్షణ కల్పించేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన టోకెనైజేషన్‌ ప్రక్రియ శనివారం (అక్టోబర్ 1) నుంచి ప్రారంభం కానుంది. టోకెనైజేషన్‌ వల్ల స్వల్పకాలంలో కార్డు లావాదేవీలు తగ్గడంతో పాటు కంపెనీలకు ఆదాయ నష్టం కూడా ఏర్పడవచ్చవంటూ ఆ ప్రక్రియ అమలుపరిచేందుకు మరింత గడువు ఇవ్వాలని బ్యాంకర్లు, వ్యాపారులు కూడా కోరుతున్నారు. అయినప్పటికీ ఆర్‌బీఐ ఇంతవరకు సానుకూలంగా స్పందించలేదు. పెద్ద వ్యాపారులు కొంతమేరకు కొత్త విధానానికి కట్టుబడడానికి సిద్ధమైనప్పటికీ చిన్న వ్యాపార సంస్థలు మరింత గడువు కోరుతున్నాయి. మూడేళ్ల క్రితం కార్డు డేటాకు రక్షణ కల్పించే దిశగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకర్లు, వ్యాపారుల అభ్యర్థనల మేరకు పలు విడతలుగా వాయిదా వేసిన అనంతరం ఈ ఏడాది అక్టోబరు 1వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. ఆర్‌బీఐ నిర్ణయం ప్రకారం సెప్టెంబరు 30వ తేదీ నాటికే కార్డులను టోకెనైజ్‌ చేయాలి. టోకెనైజేషన్‌ ప్రక్రియలో ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో కస్టమర్‌ కార్డు వివరాలను వ్యాపారులు భద్రపరచడానికి వీలు లేదు.


2). 30 రోజులపాటు క్రెడిట్ కార్డు వాడుకుంటే..

క్రెడిట్ కార్డు జారీ అయ్యాక యూజర్ 30 రోజుల వరకు దానిని ఉపయోగించని పక్షంలో.. మళ్లీ ఆ వ్యక్తి తిరిగి ఉపయోగించాలనుకుంటే సంబంధిత బ్యాంకు లేదా సంస్థ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కార్డ్ ఇష్యూయర్ సంస్థలు కస్టమర్ నుంచి ఓటీపీ (వన్‌టైమ్ పాస్‌వర్డ్) కోరతాయి. క్రెడిట్ కార్డుకి మరింత భద్రత, దుర్వినియోగం ముప్పు నుంచి తప్పించడానికి ఏప్రిల్ 2022లో ఆర్బీఐ (RBI) ఈ నిబంధన  ప్రవేశపెట్టింది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతోంది. మరోవైపు క్రెడిట్ కార్డుని క్లోజ్ చేయాల్సి వస్తే ఎలాంటి ఛార్జ్ లేకుండా బ్యాంకులు క్లోజ్ చేయాల్సి ఉంటుంది.


3. ఎన్‌పీఎస్ ఈ-నామినేషన్ సులభతరం..

ఎన్‌పీఎస్(నేషనల్ పెన్షన్ స్కీమ్) గవర్నమెంట్, కార్పొరేటు సెక్టార్ల సబ్‌స్ర్కైబర్లు ఇకపై సులభంగా ఈ-నామినేషన్ అప్‌డేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నామినేషన్ అప్‌డేషన్ కోసం ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ పెడితే  నోడల్ ఆఫీసులు లేదా కార్పొరేట్లు గుర్తించాల్సి వచ్చేది. అయితే జాప్యం కారణంగా దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్‌ఏ) కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. ఇకపై ఉద్యోగి ఒక్కసారి అప్‌డేషన్ రిక్వెస్ట్ పెడితే నోడల్ ఆఫీస్‌కి యాక్సెప్ట్ చేయడం లేదా తిరస్కరించడం ఆప్షన్లు ఉంటాయి. అయితే 30 రోజుల్లోపు స్పందించకుంటే సంబంధించి అప్‌డేషన్ ఆటోమేటిక్‌గా యాక్సెప్ట్ అయిపోతుంది.


4. అటల్ పెన్షన్‌ యోజనలో చెల్లింపుదార్లకు నో ఛాన్స్

కేంద్రప్రభుత్వ సామాజిక భద్రత పథకం అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) అర్హతకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఆదాయ పన్ను చెల్లింపుదార్లను అనర్హులుగా పేర్కొంటూ కేంద్రం ప్రకటించింది. అయితే అక్టోబర్ 1 కంటే ముందే ఈ స్కీమ్‌లో చేరినవారు కొనసాగుతారని స్పష్టం చేసింది. ఒకవేళ అక్టోబర్ 1 తర్వాత చెల్లింపుదారులు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరితో వారి ఖాతాను మూసివేస్తామని ఆర్థికశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.


5. మ్యూచువల్ ఫండ్ సబ్‌స్ర్కైబర్లకు నామినేషన్

ఎలాంటి పెట్టుబడుల్లోనైనా నామినేషన్ చాలా ముఖ్యం. ఈ నామినేషన్‌ను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్లలో కూడా తీసుకొస్తూ ఫైనాన్షియల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్ సంస్థలన్నింటికీ ఇప్పటికే ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పటికే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉన్నవారు అక్టోబర్ 1, 2022 నామినేషన్ కోసం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇన్వెస్టర్లు సంబంధిత ఫామ్ నింపి మ్యూచువల్ ఫండ్ సంస్థలకు సమర్పించాలి.


6. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి అద్దె చెల్లిస్తే ఛార్జీలు పడతాయ్..

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఇంటి అద్దె చెల్లించే కస్టమర్లు ఇకపై 1 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన అక్టోబర్ 20, 2022 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే ఇప్పటివరకు ఇలాంటి ఫీజులేవనే విషయం తెలిసిందే. 

Read more