తగ్గనున్న పామాయిల్‌ ధర

ABN , First Publish Date - 2022-07-18T06:44:04+05:30 IST

దేశంలో పామాయిల్‌ ధర మరింత తగ్గనుంది.

తగ్గనున్న పామాయిల్‌ ధర

లీటర్‌పై రూ.23 వరకు ఊరట!  జూ సుంకం ఎత్తివేసిన ఇండోనేషియా

న్యూఢిల్లీ: దేశంలో పామాయిల్‌ ధర మరింత తగ్గనుంది. ఈ నెల 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు టన్ను పామాయిల్‌పై 200 నుంచి 288 డాలర్ల వరకు ఉన్న ఎగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ఇండోనేషియా ప్రకటించించింది. దీంతో భారత కంపెనీలు దిగుమతి చేసుకునే టన్ను పామాయిల్‌ ధర రూ.16,000 నుంచి రూ.23,000 వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లీటర్‌ పామాయిల్‌ బ్రాండ్‌ను బట్టి లీటర్‌ రూ.130 నుంచి రూ.135 వరకు పలుకుతోంది. ఇండోనేషియా నిర్ణయంతో ఈ ధర లీటర్‌కు రూ.16 నుంచి రూ.23 వరకు తగ్గే అవకాశం ఉంది. 

ఎందుకంటే: ఇండోనేషియాలో వంట నూనెల ధరలు అదుపులోకి వచ్చి నిల్వలు పేరుకుపోవడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. ఆగస్టు నెలాఖరు వరకే ఈ ఎగుమతి సుంకం మినహాయింపు ఉంటుందని ప్రకటించటంతో భారత కంపెనీలు పెద్దఎత్తున దిగుమతులు ప్రారంభిస్తాయని అంచనా. దీంతో దేశీయంగా ధరలు తగ్గుతాయని మార్కెట్‌  వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఇండోనేషియా ఎగుమతి సుంకాలను ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయం  మలేషియా పామాయిల్‌ ఎగుమతులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. 

Read more