రానున్నది.. మహా మాంద్యం

ABN , First Publish Date - 2022-09-25T07:12:13+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆర్థిక మాంద్యా న్ని చవిచూడనుందా

రానున్నది.. మహా మాంద్యం

మరో ఆర్థిక ప్రళయం అంచున ప్రపంచం

కుప్పకూలనున్న స్టాక్‌ మార్కెట్లు.. ఆర్థికవేత్త నోరియల్‌ రోబిని


వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆర్థిక మాంద్యా న్ని చవిచూడనుందా? అది 2008 ఆర్థిక సంక్షోభం కంటే తీవ్రంగా ఉంటుందా? అవుననే అంటున్నారు ప్రముఖ ఆర్థికవేత్త, రోబిని మాక్రో అసోసియేట్స్‌ చైర్మన్‌, సీఈఓ నోరియల్‌ రోబిని. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. అమెరికాతో సహా అనేక దేశాలను 2008లో కుదిపేసిన ఆర్థిక సంక్షోభాన్నీ రోబిని ముందే చెప్పారు. అమెరికాలో ఈ ఏడాది చివరికల్లా ప్రారంభమయ్యే ఈ ఆర్థిక ఉత్పాతం వచ్చే ఏడాదంతా ప్రపంచ దేశాలను తీవ్రంగా కుదిపేస్తుందని రోబిని హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ సమయంలో రోబిని చేసిన ఈ హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


అప్పుల కుప్ప 

ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం అప్పుల కుప్పగా మారాయి. అప్పుల భారంతో శ్రీలంక ఇప్పటికే కుప్పకూలింది. పాకిస్థాన్‌దీ దాదాపు ఇదే పరిస్థితి. 2008 నాటి పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. అప్పట్లో కార్పొరేట్‌ సంస్థలు, వ్యక్తులు, బ్యాంకులు మాత్రమే అప్పుల కుప్పలుగా ఉండేవి. ఆ గండం నుంచి గట్టెక్కేందుకు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు దిగజారాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ ట్టు కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. ఈ గండం నుంచి తప్పించుకునేందుకు కూడా పెద్దఎత్తున ప్యాకేజీలు ప్రకటించాయి. అంతా గాడిన పడుతుందనుకుంటున్న సమయంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం భగ్గుమనటంతో పాటు ప్రజల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు ధరలను కట్టడి చేసేందుకు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వరుస పెట్టి వడ్డీ రేట్లు పెంచటంతో ఆయా దేశాల అప్పుల చెల్లింపుల భారాన్ని మరింత పెంచాయి. 


దీంతో ఈసారి వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాల వద్ద చిల్లిగవ్వ లేదు. దీంతో వచ్చే ఆర్థిక మాంద్యం లో అప్పులకుప్పలా మారిన కంపెనీలు, దేశాలు, వ్యక్తులు నిండా మునగడం తప్ప మరో మార్గం లేదని రోబిని స్పష్టం చేశారు. 


స్టాక్‌ మార్కెట్‌ కుదేలే 

ఈ ఆర్థిక మాంద్యం ప్రభావం స్టాక్‌ మార్కెట్లపైనా తప్పదని రోబిని హెచ్చరించారు. దీంతో అమెరికా ఎస్‌ అండ్‌ పీ-500 సూచీ 30 నుంచి 40 శాతం వరకు నష్టపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. అదే జరిగితే ఆ ప్రభావం అమెరికా, జపాన్‌, యూరప్‌, చైనాతో సహా ప్రధాన స్టాక్‌ మార్కెట్లపైనా తప్పదన్నారు. అమెరికా మాంద్యంలోకి వెళితే సెన్సెక్స్‌ కూడా 35 నుంచి 40 శాతం మేర నష్టపోయే ప్రమాదం ఉందని ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. గత మూడు రోజులుగా భారత స్టాక్‌ మార్కెట్‌ పతనానికి ఈ వార్తలు కూడా కారణమని భావిస్తున్నారు. 

‘వడ్డింపు’లు తప్పవు

ధరల సెగ తగ్గించేందుకు వడ్డీ రేట్లు పెంచడం తప్ప అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌కు మారో మార్గం లేదని రోబిని స్పష్టం చేశారు. వడ్డీ రేట్లు పెంచకుండా అమెరికాలో రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని రెండు శాతానికి కుదించడం జరిగే పని కాదని కూడా స్పష్టం చేశారు. గత బుధవారం ముప్పావు శాతం వడ్డీ రేట్లు పెంచిన ఫెడ్‌ రిజర్వ్‌ వచ్చే నవంబరు, డిసెంబరుల్లో మరింత వడ్డిస్తుందన్నారు. మొత్తం మీద వచ్చే ఏడాదికల్లా అమెరికాలో కనీస వడ్డీ రేట్లు 5 శాతానికి చేరే అవకాశం ఉందన్నారు. వీటికి తోడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంకా ఇబ్బందులు ఉన్నట్టు రోబిని అంచనా వేస్తున్నారు. అవేమిటంటే..


రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం

కొనసాగుతున్న సరఫరా అవాంతరాలు

కొవిడ్‌ ఆంక్షలతో నీరసిస్తున్న చైనా ఆర్థిక వ్యవస్థ

ద్రవ్యోల్బణంతో పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు

వస్తు సేవలకు తగ్గుతున్న డిమాండ్‌

వివిధ దేశాలు అనుసరిస్తున్న వాణిజ్య రక్షణ విధానాలు

ధనిక దేశాల్లో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య

చైనా నుంచి అమెరికా, ఈయూ దేశాలకు మారుతున్న కంపెనీలు

చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం

వాతావరణ మార్పులు

పెరుగుతున్న కొవిడ్‌ వంటి వ్యాధుల ముప్పు

Updated Date - 2022-09-25T07:12:13+05:30 IST