Bengaluru: 22 ఏళ్ల వయసులో రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.30 లక్షలొచ్చాయ్.. కానీ.. ఆ వ్యాపారం వల్లే..

ABN , First Publish Date - 2022-09-29T23:32:55+05:30 IST

జీవితంలో కొన్నికొన్ని సార్లు కాస్త ధైర్యం చేసి ముందడుగు వేయడానికి తటపటాయిస్తుంటాం. కానీ.. ఆత్మ విశ్వాసంతో ఆ అడుగు వేయగలిగితే ‘సక్సెస్ స్టోరీ’ల జాబితాలో..

Bengaluru: 22 ఏళ్ల వయసులో రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.30 లక్షలొచ్చాయ్.. కానీ.. ఆ వ్యాపారం వల్లే..

జీవితంలో కొన్నికొన్ని సార్లు కాస్త ధైర్యం చేసి ముందడుగు వేయడానికి తటపటాయిస్తుంటాం. కానీ.. ఆత్మ విశ్వాసంతో ఆ అడుగు వేయగలిగితే ‘సక్సెస్ స్టోరీ’ల జాబితాలో మనకూ చోటు దక్కడం ఖాయం. అందుకు కావాల్సిందల్లా తెలివితో కూడిన తెగువ. సృజనాత్మకంగా ఆలోచించగలిగే బుర్ర. ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడు కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే. కానీ.. ఇతని జీవితంలో మరో ఆసక్తికర మలుపు కూడా ఉంది. ఈ కుర్రాడి పేరు శుభమ్ సైనీ. వయసు 22 సంవత్సరాలు. హర్యానాలోని రెవారిలో ఉన్న ఇందిరా గాంధీ యూనివర్సిటీలో చదువుకున్న సైనీ మధ్యలోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ బెంగళూరు నగరానికి చేరుకున్నాడు. ఆ క్రమంలోనే క్రిప్టో మార్కెట్ ట్రేడింగ్‌ చేశాడు.


2020లో బిట్‌కాయిన్ విలువ 60 శాతం క్షీణించడంతో అందులో పెట్టుబడి పెట్టేందుకు సైనీ ఆసక్తి చూపాడు. తన పాకెట్ మనీతో పాటు అప్పటి వరకూ తాను సంపాదించుకున్న మొత్తాన్ని కూడా లక్ష పెట్టుబడి పెట్టి క్రిప్టోను కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన కొన్ని నెలలకే క్రిప్టో కరెన్సీ విలువ ఏకంగా 1000 శాతం పెరిగింది. దాంతో.. సైనీ క్రిప్టో వాలెట్ రూ.30 లక్షలకు పెరిగింది. తన పెట్టుబడి విలువ ఆ స్థాయిలో పెంచేసిన క్రిప్టో రేంజ్ ఏంటో అప్పుడు సైనీకి అర్థమైంది. అప్పటి నుంచి ఖర్చులకు తల్లిదండ్రులను డబ్బులు అడగటం మానేశాడు. విలాసవంతమైన జీవితం అతని సొంతమైంది. అప్పటి నుంచి క్రిప్టో ట్రేడింగ్‌లో అతను ఫుల్ టైం దిగాలనుకున్నాడు.బీసీఏ ఫైనల్ సెమిస్టర్‌ను కూడా లైట్ తీసుకున్నాడు. మార్కెట్‌లో తానే కాబోయే ‘రాకేష్ ఝున్‌ఝున్‌వాలా’ అని ఎన్నో కలలు కన్నాడు. క్రిప్టో వరల్డ్‌లో కింగ్ కావాలనుకుంటున్నాడు. కానీ.. తానొకటి తలిస్తే.. దేవుడొకటి తలిచాడు. 2021 ఏప్రిల్‌లో ఊహించని పరిణామం జరిగింది. క్రిప్టో మార్కెట్ తీవ్ర పతనాన్ని చవిచూసింది. సైనీ కూడా నిండా మునిగిపోయాడు. జీవితం చాలా చిత్రమైంది. శుభమ్ సైనీ ఎక్కడ మొదలయ్యాడో.. రూ.30 లక్షల నుంచి అదే లక్ష రూపాయల దగ్గర నిలబడాల్సొచ్చింది. డిజిటల్ కరెన్సీలో అనిశ్చితి ఏ స్థాయిలో ఉంటుందో సైనీకి తెలిసొచ్చింది. ఒక్క రాత్రిలో జీవితం తలకిందులవుతుందని తాను అస్సలు ఊహించలేకపోయాడు. చివరకు తాను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బ్రాండ్-న్యూ ఐఫోన్ కూడా సైనీ అమ్ముకోవాల్సి వచ్చింది. చివరకు రూ.30 వేల పెట్టుబడితో ‘The Frustrated Drop Out’ అనే పేరుతో టీ స్టాల్ ఒకటి పెట్టాడు.బెంగళూరులోని మారతహళ్లి ప్రాంతంలో రోడ్డు పక్కన టీ స్టాల్ పెట్టిన అతనికి కస్టమర్లలో చాలామంది ఛాయ్ తాగాక బిట్‌కాయిన్‌తో పేమెంట్ చేసేందుకు ప్రయత్నించడం చూసి అవాక్కయ్యాడు. అప్పటి నుంచి తన టీ స్టాల్‌లో క్రిప్టో పేమెంట్స్ చేసే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాడు. వారానికి 20 మందికి పైగా కస్టమర్లు టీ తాగి క్రిప్టో కరెన్సీతో పేమెంట్ చేస్తున్నారని సైనీ చెప్పుకొచ్చాడు. కస్టమర్లు క్రిప్టో పేమెంట్స్ చేయడం కోసం Paxful Crypto ను వినియోగించుకున్నాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. బయట టీ స్టాల్స్ దగ్గర ఫోన్‌పే, గూగుల్‌పే QR Code ఎలా కనిపిస్తున్నాయో ‘క్రిప్టో పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాం’ అన్నట్టుగా సైనీ తన టీ స్టాల్ ముందు డాలర్ సింబల్ వేసి ఒక్కో టీ $ 0.25 అని ప్లకార్డ్ కూడా పెట్టాడు. స్కాన్ చేయడం.. పేమెంట్ చేసేయడమే. ప్రస్తుతానికి శుభమ్ సైనీ వ్యాపారం మూడు క్రిప్టో పేమెంట్లు.. ఆరు జీపే, ఫోన్‌పే పేమెంట్లతో సాఫీగా సాగుతోంది.

Read more