సెన్సెక్స్‌ సరికొత్త రికార్డు

ABN , First Publish Date - 2022-11-12T02:23:05+05:30 IST

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

సెన్సెక్స్‌ సరికొత్త రికార్డు

  • 1,181 పాయింట్లు పెరిగి 61,795 వద్ద ముగింపు

  • నిఫ్టీ 322 పాయింట్లు అప్‌

  • గ్లోబల్‌ మార్కెట్ల ర్యాలీతో రత సూచీలూ రయ్‌రయ్‌..

  • రూ.2.97 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వారాంతం ట్రేడింగ్‌లో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 1,181.34 పాయింట్లు (1.95 శాతం) బలపడి 61,795.04 వద్ద సరికొత్త ఆల్‌టైం గరిష్ఠ ముగింపు స్థాయిని నమోదు చేసుకుంది. దీంతో 2021 అక్టోబరు 18న 61,765 వద్ద నమోదైన గత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ కూడా 321.50 పాయింట్లు (1.78 శాతం) ఎగబాకి 18,349.70 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 22 లాభపడగా.. నిఫ్టీ 50లో 37 కంపెనీల షేర్లు పెరిగాయి. బుల్‌ ర్యాలీలో స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద రూ.2.97 లక్షల కోట్లకు పైగా పెరిగింది. దాంతో, బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.284.56 లక్షల కోట్లకు చేరుకుంది.

ఐటీ షేర్లు జిగేల్‌

బ్లూచిప్‌ కంపెనీల్లో ఐటీ, టెక్నాలజీ షేర్లు జిగేల్‌మన్నాయి. సెన్సెక్స్‌లోని ఐదు ప్రధాన ఐటీ కంపెనీల స్టాక్స్‌ 2.80 శాతం నుంచి 4.50 శాతం వరకు పెరిగాయి. మెటల్‌, ఆర్థిక సేవల కంపెనీల్లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు పెంచారు. వాహనం, విద్యుత్‌, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు మాత్రం నష్టాల్లో ముగిశాయి. ప్రధాన కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు కొనుగోళ్ల ఆదరణ అంతగా లభించలేదు. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 0.33 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.15 శాతం పెరుగుదలతో సరిపెట్టుకున్నాయి.

డీసీఎక్స్‌ లిస్టింగ్‌ హిట్‌

ఈ మధ్యనే ఐపీఓకు వచ్చిన డీసీఎక్స్‌ సిస్టమ్స్‌.. శుక్రవారం కంపెనీ షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.207తో పోలిస్తే, కంపెనీ షేరు బీఎ్‌సఈలో 38.29 శాతం ప్రీమియంతో రూ.286.25 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో మరింత పుంజుకుని, చివరికి 49.18 శాతం లాభంతో రూ.308.80 వద్ద ముగిసింది.

బుల్‌ జోష్‌కు కారణమిదే..

అక్టోబరు నెలకు గాను అమెరికా మార్కెట్‌ ధరల సూచీ అంచనాల కంటే తగ్గి 7.4 శాతానికి దిగిరావడంతో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు నెమ్మదించవచ్చన్న ఆశలు ప్రపంచ మార్కెట్‌ వర్గాలకు భారీ ఊరట కలిగించాయి. దాంతో గ్లోబల్‌ మార్కెట్లతో పాటు మన దలాల్‌ స్ట్రీట్‌లోనూ బుల్‌ హుషారుగా పరుగులు తీసింది. రూపాయి బలోపేతం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడం మన మార్కెట్లో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ను మరింత మెరుగుపర్చింది.

రూపాయి జూమ్‌

రూపాయి విలువ భారీగా పుంజుకుంది. యూఎస్‌ డాలర్‌తో మారకం రేటు ఏకంగా 62 పైసలు బలపడి రూ.80.78 వద్ద ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్లో శుక్రవారం రూ.80.76 వద్ద ప్రారంభమైన డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు ఒక దశలో 80.58 స్థాయికి తగ్గింది. మళ్లీ 80.99 శాతానికి ఎగబాకినప్పటికీ, చివరికి 80.78 వద్ద స్థిరపడింది. ఈ వారంలో 2 శాతం పుంజుకున్న రూపాయి.. నాలుగేళ్లలో (2018 డిసెంబరు తర్వాత) అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చింది.

Updated Date - 2022-11-12T02:23:09+05:30 IST