గ్లాండ్‌ ఫార్మా చేతికి సెనెక్సీ

ABN , First Publish Date - 2022-11-30T01:19:52+05:30 IST

యూరప్‌ కేంద్రంగా ఉన్న సెనెక్సీ గ్రూప్‌ను చేజిక్కించుకున్నట్లు హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్‌ ఫార్మా ప్రకటించింది. పుట్‌ ఆప్షన్‌ విధానంలో...

గ్లాండ్‌ ఫార్మా చేతికి సెనెక్సీ

డీల్‌ విలువ రూ.1,015 కోట్లు

న్యూఢిల్లీ: యూరప్‌ కేంద్రంగా ఉన్న సెనెక్సీ గ్రూప్‌ను చేజిక్కించుకున్నట్లు హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్‌ ఫార్మా ప్రకటించింది. పుట్‌ ఆప్షన్‌ విధానంలో సింగపూర్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అనుబంధ సంస్థ గ్లాండ్‌ ఫార్మా ఇంటర్నేషనల్‌ పీటీఈ సుమారు రూ.1,015 కోట్ల (12 కోట్ల యూరోలు)తో సెనెక్సీ గ్రూప్‌లో 100 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ కొనుగోలుతో అంతర్జాతీయ మార్కెట్లోకి అవకాశం లభిస్తుందని పేర్కొంది. 2004లో కార్యకలాపాలు ప్రారంభించిన సెనెక్సీ.. అంకాలజీ, కాంప్లెక్స్‌ ఉత్పత్తులతో పాటు స్టెరిలైట్‌ లిక్విడ్‌, లైఫోలైజ్డ్‌ ఫిల్‌-ఫినిష్డ్‌ ఔషధాల కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎంఓ)లో సేవలందిస్తోంది. సెనెక్సీకి యూరప్‌లోని ఫ్రాన్స్‌లో మూడు, బెల్జియంలోని ఒక తయారీ యూనిట్‌ ఉంది. కంపెనీలో మొత్తం 1,372 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గ్లాండ్‌ ఫార్మాకు ఇది తొలి విదేశీ కొనుగోలు కావటమే కాకుండా యూరోపియన్‌ మార్కెట్లోకి నేరుగా ప్రవేశించే అవకాశం లభించిందని సంస్థ ఎండీ, సీఈఓ సాధు శ్రీనివాస్‌ తెలిపారు. కాగా కంపెనీ ప్రమోటర్‌ అయిన చైనా ఫార్మా సంస్థ ఫోసన్‌ ఫార్మా.. గ్లాండ్‌ ఫార్మాలో వాటాలను విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చింది.

Updated Date - 2022-11-30T01:19:55+05:30 IST