రూ.65.60 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-11-29T03:16:55+05:30 IST

భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లతో పాటు రూపాయి గణనీయంగా క్షీణించింది. అయినప్పటికీ, ధనవంతులు మరింత శ్రీమంతులయ్యారని ఫోర్బ్స్‌ ఇండియా తాజా నివేదిక పేర్కొంది...

రూ.65.60 లక్షల కోట్లు

  • దేశంలోని టాప్‌-100 బిలియనీర్ల మొత్తం ఆస్తి విలువ ఇది..

  • అందులో 30% అదానీ, అంబానీలదే..

  • రూపాయి 10% పతనమైనా ధనవంతుల సంపద మరింత పైకి

  • ఫోర్బ్స్‌ ఇండియా నివేదిక విడుదల

భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లతో పాటు రూపాయి గణనీయంగా క్షీణించింది. అయినప్పటికీ, ధనవంతులు మరింత శ్రీమంతులయ్యారని ఫోర్బ్స్‌ ఇండియా తాజా నివేదిక పేర్కొంది. ఈ ఏడాదిలో రూపా యి 10 శాతం క్షీణించిందని, అదే కాలంలో దేశంలోని టాప్‌-100 బిలియనీర్ల మొత్తం సంపద మరో 2,500 కోట్ల డాలర్లు (రూ.2.05 లక్షల కోట్లు) పెరిగి 80,000 కోట్ల డాలర్లకు (సుమా రు రూ.65.60 లక్షల కోట్లు) చేరుకుందని తెలిపింది. ఇందులో టాప్‌-10 కుబేరుల సంపదే 38,500 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.31.57 లక్షల కోట్లు. వంద మంది మొత్తం సంపదలో 30 శాతం వాటా కేవలం ఇద్దరు వ్యక్తుల (గౌతమ్‌ అదానీ, ముకేశ్‌ అంబానీ)దే కావడం గమనార్హం. ఈ ఏడాది సెప్టెంబరు 23 నాటికి దేశంలోని అత్యంత ధనిక కుటుంబాలు, వ్యక్తులతో పాటు నియంత్రణ మండళ్లు, స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఫోర్బ్స్‌ ఇండియా టాప్‌-100 కుబేరుల జాబితాను రూపొందించింది. కనీసం 190 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌ కలిగిన వారికి లిస్ట్‌లో స్థానం కల్పించింది.

ధనాధన్‌ అదానీ.. వెనకబడిన అంబానీ

జాబితాలోని వ్యక్తుల మొత్తం సంపద పెరుగుదలకు ప్రధాన కారణం ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీయే. గత ఏడాదిలో మూడింతలైన అదానీ గ్రూప్‌ అధిపతి సంపద.. ఈ ఏడాదిలోనూ రెట్టింపై 15,000 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతేకాదు, 2008 నుంచి దేశంలో నం.1 ధనవంతుడిగా కొనసాగుతూ వచ్చిన ముకేశ్‌ అంబానీని వెనక్కి నెట్టి ఈ ఏడాది అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నారు. అలాగే, కొద్ది రోజుల పాటు ప్రపంచంలో రెండో అతిపెద్ద ధనవంతుడిగా రికార్డులోకి ఎక్కారు. భారత్‌ కుబేరుల్లో రెండో స్థానానికి జారుకున్న రిలయన్స్‌ చైర్మన్‌ అంబానీ సంపద ఈ ఏడాదిలో 5 శాతం తగ్గి 8,800 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఇక డీమార్ట్‌ సూపర్‌ మార్కెట్ల అధిపతి రాధాకృష్ణ దమానీ ఆస్తి ఈ ఏడాదిలో 6 శాతం తగ్గి 2,760 కోట్ల డాలర్లకు పరిమితమైంది. అయినప్పటికీ, ఆయన తొలిసారిగా మూడో స్థానానికి చేరుకోవడం గమనార్హం. 2,150 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌ సైరస్‌ పూనావాలా నాలుగో స్థానానికి ఎగబాకారు. హెచ్‌సీఎల్‌ టెక్‌ గౌరవ చైర్మన్‌ శివ్‌ నాడార్‌ 2,140 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో ఐదో స్థానంలో నిలిచారు. కాగా, ఓపీ జిందాల్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ సావిత్రి జిందాల్‌ (6), సన్‌ ఫార్మా చైర్మన్‌ దిలీప్‌ సంఘ్వీ (7), హిందూజా సోదరులు (8), ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా (9), బజాజ్‌ కుటుంబం 10వ స్థానాలను దక్కించుకున్నారు.

తెలుగువారు నలుగురు

ర్యాంక్‌ పేరు ఆస్తి కంపెనీ

(కో.డాలర్లు)

25 మురళి దివి 645 దివీస్‌ ల్యాబ్స్‌

43 పీ పిచ్చి రెడ్డి 410 ఎంఈఐఎల్‌

80 రెడ్డీస్‌ కుటుంబం 235 డాక్టర్‌ రెడ్డీస్‌

86 ప్రతాప్‌ సీ రెడ్డి 226 అపోలో హాస్పిటల్స్‌

Updated Date - 2022-11-29T03:17:04+05:30 IST