మళ్లీ కష్టాల్లో రియల్టీ

ABN , First Publish Date - 2022-09-11T09:40:18+05:30 IST

స్థిరాస్తి రంగం (రియల్టీ) పరుగుకు బ్రేక్‌ పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బిల్డర్ల అత్యాశతో అమ్మకాలు మందగిస్తున్నాయి.

మళ్లీ కష్టాల్లో రియల్టీ

బ్యాంకులకు ఎన్‌పీఏల భయం

బిల్డర్లకు నిధుల కొరత.. ఆగిపోయిన రూ.4.48 లక్షల కోట్ల విలువైన 5 లక్షల ఇళ్లు


న్యూఢిల్లీ: స్థిరాస్తి రంగం (రియల్టీ) పరుగుకు బ్రేక్‌ పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బిల్డర్ల అత్యాశతో అమ్మకాలు మందగిస్తున్నాయి. దీంతో అప్పులతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన బిల్డర్లు కష్టాల్లో పడ్డారు. సమయానికి నిధులు అందుబాటులో లేక ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగడం లేదు. దీంతో ఈ సంవత్సరం మే నాటికి హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో దాదాపు ఐదు లక్షల ఇళ్లు, వాణిజ్య భవనాల నిర్మాణం ఆగిపోయాయి. ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్‌’ ఈ విషయం తెలిపింది. వీటి విలువ ఎంతలేదన్నా రూ.4.48 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచ నా. దీంతో ఈ ప్రాజెక్టులకు రుణాలు సమకూర్చిన బ్యాంకులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ) ఎక్కడ  తమ రుణాలు మొండి బకాయిలు (ఎన్‌పీఏ)గా మారతాయోనని బిక్కుబిక్కుమంటున్నాయి. కొత్త ప్రాజెక్టులకు రుణాలు మంజూ రు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.


ఢిల్లీ, ముంబైల్లోనే ఎక్కువ

ఆగిపోయిన రియల్టీ ప్రాజెక్టుల్లో 77 శాతం ఢిల్లీ, ముంబై మహా నగరాల్లోనే ఉన్నాయి. మిగతా 23 శాతం ప్రాజెక్టుల్లో పుణెలో తొమ్మిది శాతం, కోల్‌కతాలో ఐదు శాతం ప్రాజెక్టులు ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో మిగతా తొమ్మిది శాతం ప్రాజెక్టులు ఉన్నాయి. 


ఎందుకంటే ?

కొవిడ్‌ తర్వాత మెట్రో నగరాల్లో సొంతింటి అవసరంపై ఆసక్తి పెరిగింది. తక్కువ వడ్డీ రేట్లూ ఇందుకు కలిసొచ్చాయి. దీన్ని సొమ్ము చేసుకునేందుకు బిల్డర్లు ఎడాపెడా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇక్కడ ఐటీ ఉద్యోగులనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని అధిక ధరలు నిర్ణయించారు. ఇక్కడే బిల్డర్ల అంచనాలు తలకిందులయ్యాయి. ఐటీ ఉద్యోగులు కూడా డబుల్‌ లేదా ట్రిపుల్‌  బెడ్‌రూమ్‌ ఫ్లాట్లకు బదులు, విల్లాలపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అప్పు చేసి నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లు ఆశలు గల్లంతయ్యాయి. ఇటీవల వడ్డీ రేట్లు పెరగడంతో ఈ సమస్య మరింత తీవ్రమైందని భావిస్తున్నారు. 


రుణ మేళాలతో ఎన్‌పీఏల ముప్పు 

ప్రభుత్వం మళ్లీ రుణ మేళాలకు దిగడంపై ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెల్లింపు సామర్ధ్యంపై సరైన మదింపు లేకుండా ఎడాపెడా ఇస్తున్న ఈ రుణాలు మొండి బకాయిలు (ఎన్‌పీఏ)గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. గత అనుభవాలను ఉద్యోగ సంఘాలు ఈ సందర్భంగా గుర్తు చేశాయి. రుణ వసూళ్లకు ఏ మాత్రం తోడ్పడని రాజకీయ పార్టీలు, తమ రాజకీయ అవసరాల కోసం పీఎ్‌సబీల నిధులను ఇలా రుణ మేళాల పేరుతో దుర్వినియోగం చేయడాన్ని తప్పుపట్టాయి. పీఎ్‌సబీలకు నిజమైన స్వయం ప్రతిపత్తి ఇస్తే తప్ప, ఇలాంటి సమస్యలకు చెక్‌పడదని స్పష్టం చేశాయి. విధానపరమైన విషయాల్లో తప్ప, ప్రభుత్వం పీఎ్‌సబీల రోజువారీ నిర్వహణలో జోక్యం చేసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని స్పష్టం చేశాయి. 

Updated Date - 2022-09-11T09:40:18+05:30 IST