రూపాయి రక్షణకు ఆర్‌బీఐ చర్యలు

ABN , First Publish Date - 2022-07-07T08:52:05+05:30 IST

రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ చర్యలు ప్రకటించింది.

రూపాయి రక్షణకు ఆర్‌బీఐ చర్యలు

ముంబై : రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ చర్యలు ప్రకటించింది. డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.80కి చేరువ అవుతున్న నేపథ్యంలో తీసుకున్న చర్యలివే... 


ఎఫ్‌పీఐలకు మరింత వెసులుబాటు: ఎఫ్‌పీఐలు ప్రస్తుతం 5, 10, 30 ఏళ్ల కాల పరిమితి ఉన్న ప్రభుత్వ రుణ పత్రాల్లో మాత్రమే  పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉంది. కొత్తగా 7, 14 సంవత్సరాల కాలపరిమితి ఉండే రుణ పత్రాలకూ దీన్ని విస్తరించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. అలాగే స్వల్ప కాలిక ప్రభుత్వ, కార్పొరేట్‌ రుణ పత్రాల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులపై ఉన్న 30 శాతం పరిమితిని ఈ సంవత్సరం అక్టోబరు వరకు ఎత్తివేసింది. 

ఎన్‌ఆర్‌ఐలకు అధిక వడ్డీ: దేశీయ బ్యాంకుల్లో ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ), ఎన్‌ఆర్‌ఈ పేర్లతో ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) ఉండే డిపాజిట్ల వడ్డీరేటుపై బ్యాంకులకు మరింత స్వేచ్ఛ ఇచ్చింది. ప్రస్తుతం బ్యాంకులు ఈ డిపాజిట్లపై లిబర్‌ వంటి ప్రామాణిక అంతర్జాతీయ వడ్డీ రేట్ల కంటే 2.5 నుంచి మూడు శాతానికి మించి వడ్డీ చెల్లించేందుకు వీల్లేదు. ఈ వడ్డీరేట్లపైనా బ్యాంకులకు మరింత స్వేచ్చ ఇవ్వాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. దీనికి తోడు ఈ డిపాజిట్లను సీఆర్‌ఆర్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ పరిమితుల నుంచి మినహాయించాలని నిర్ణయించింది. 

ఈసీబీ పరిమితి రెట్టింపు: ప్రస్తుతం ఒక్కో దేశీయ కంపెనీ ఆటోమేటిక్‌ రూట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో విదేశీ వాణిజ్య రుణాల ద్వారా 75 కోట్ల డాలర్లకు మించి సేకరించేందుకు అవకాశం లేదు. ఈ పరిమితిని 150 కోట్ల డాలర్లకు పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. మంచి పరపతి రేటింగ్‌ ఉన్న కంపెనీలకు ఇది మేలు చేయనుంది. 

విదేశీ కరెన్సీ రుణాలపై స్వేచ: దేశంలోని బ్యాంకులు, విదేశీ బ్యాంకులు విదేశీ కరెన్సీ రూపంలో ఇచ్చే రుణాల పరిమితిని ఆర్‌బీఐ పెంచింది. ప్రస్తుతం ఈ సంస్థలు తమ ఈక్విటీకి సమాన మొత్తం లేదా కోటి డాలర్లు ఇందులో ఏది ఎక్కువైతే అది మాత్రమే, విదేశీ కరెన్సీ రూపంలో రుణాలుగా ఇవ్వాలి. అది కూడా ఎగుమతిదారులకు మాత్రమే. ఇతర రంగాలకు కూడా ఈ రుణాలను విస్తరించేందుకు ఆర్‌బీఐ బ్యాంకులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. 

Updated Date - 2022-07-07T08:52:05+05:30 IST