అమెరికాలో ధరలు భగభగ

ABN , First Publish Date - 2022-06-11T09:17:05+05:30 IST

ధరల సెగ అమెరికన్లనీ వణికిస్తోంది. మే నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేని వి ధంగా 8.6 శాతానికి చేరింది.

అమెరికాలో ధరలు భగభగ

40 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో ద్రవ్యోల్బణం

 ‘పొదుపు’ మంత్రం పాటిస్తున్న ప్రజలు

వాషింగ్టన్‌: ధరల సెగ అమెరికన్లనీ వణికిస్తోంది. మే నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేని వి ధంగా 8.6 శాతానికి చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 0.3 శాతం ఎక్కువ. దీంతో అల్పాదాయ అమెరికన్లు పొ దుపు మంత్రం పాటిస్తున్నారు. తప్పనిసరైతే తప్ప కొనుగోళ్లకు సాహసించడం లేదు. చాలామంది హెయిర్‌ కట్టింగ్‌ పక్కన పెట్టి హిప్పీల్లా జుట్టు పెంచేస్తున్నారు. ఖరీదైన వినియోగ ఎలకా్ట్రనిక్‌ వస్తువుల జోలికీ పోవడం లేదు. ఇంట్లో ఫర్నీచర్‌ పాడైపోయినా.. ఇప్పుడొద్దులే  అని వాయిదా వేస్తున్నారు. 


పెట్రో మంట:

పెట్రోల్‌, గ్యాస్‌ ధరల మంట అమెరికాలోనూ రిటైల్‌ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తోంది. గ్యాలన్‌ (3.78 లీటర్లు) పెట్రోల్‌ ధర ఇప్పటికే ఐదు డాలర్లకు (సుమారు రూ.387) చేరువైంది. దీంతో 50,000 డాలర్ల లోపు తలసరి ఆదాయం ఉండే వారి ఖర్చుల్లో పది శాతం పెట్రోల్‌, గ్యాస్‌కే పోతోంది. ఈ దెబ్బకు భయపడి చాలా మంది లోకల్‌ రైళ్లు, బస్సులు, ట్రామ్‌ వంటి ప్రజా రవాణా వ్యవస్థను ఆశ్రయిస్తున్నారు. 


సేవలకు మాత్రం డిమాండ్‌:

వస్తువుల కొనుగోలుకు గుడ్‌బై చెబుతున్న అమెరికన్లు సేవలకు మాత్రం జై కొడుతున్నారు. వారాంతాల్లో విహార యాత్రల జోరు పెంచారు. దీంతో విమాన టికెట్లు, హోటల్‌ రూమ్స్‌, హోటల్‌ భోజనాలు, చిరుతిళ్లకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత పెరిగితే ఈ సరదాలకూ ఫుల్‌స్టాప్‌ పడుతుందని అంచనా. బైడెన్‌ సర్కారు ఆర్థిక విధానాలూ ద్రవ్యోల్బణానికి సెగ పెడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2022-06-11T09:17:05+05:30 IST