అయ్యో ఎల్‌ఐసీ తుస్‌..

ABN , First Publish Date - 2022-05-18T07:04:00+05:30 IST

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ తొలిరోజే ఇన్వెస్టర్లను నిరాశపరిచింది.

అయ్యో ఎల్‌ఐసీ తుస్‌..

లిస్టింగ్‌ రోజే 8 శాతం క్షీణించిన షేరు 

ఇన్వెస్టర్లకు రూ.50,000 కోట్ల నష్టం 

ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ తొలిరోజే ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. కొనుగోళ్ల దన్నుతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రేసు గుర్రాల్లా పరిగెత్తినప్పటికీ ఎల్‌ఐసీ షేర్లు మాత్రం ఆరంభంలోనే నేలచూపులు చూశా యి. ఈ నెలలో ఐపీఓను పూర్తి చేసుకున్న కంపెనీ.. మంగళవారం షేర్లను బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈల్లో లిస్టింగ్‌  చేసింది. ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే, బీఎ్‌సఈలో ఎల్‌ఐసీ షేరు 8.62 శాతం డిస్కౌంట్‌తో రూ.867.20 వద్ద లిస్టయింది. ట్రేడింగ్‌ నిలిచేసరికి, షేరు ధర 7.75 శాతం నష్టంతో రూ.875.45 వద్ద స్థిరపడింది. కంపెనీ తన పాలసీదారులు, ఉద్యోగులతోపాటు రిటైల్‌ మదుపరులకు ఐపీఓలో ప్రత్యేక డిస్కౌంట్‌తో కేటాయించిన షేర్ల ధర కంటే దిగువ స్థాయి ఇది. బీఎ్‌సఈలో మొదటిరోజున 27.52 లక్షల ఎల్‌ఐసీ షేర్లు ట్రేడవగా.. ఎన్‌ఎ్‌సఈలో 4.87 కోట్ల షేర్లు చేతులు మారాయి. 


దేశంలో ఐదో అత్యంత విలువైన కంపెనీ: ఐపీఓలో భాగంగా నిర్ణయించిన రూ.6.01 లక్షల కోట్లతో పోలిస్తే, ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ తొలిరోజే రూ.50,000 కోట్ల మేర తగ్గి రూ.5.54 లక్షల కోట్లకు పడిపోయింది. అయినప్పటికీ, మార్కెట్లో ఐదో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. మార్కెట్‌ విలువపరంగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (రూ.17.12 లక్షల కోట్లు), టీసీఎస్‌ (రూ.12.67 లక్షల కోట్లు), హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌  (రూ.7.29 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్‌ (రూ.6.38 లక్షల కోట్లు) మాత్రమే ఎల్‌ఐసీ కంటే ముందున్నాయి. 


ఇన్వెస్టర్లలో నిరాశ: లిస్టింగ్‌ రోజే షేరు ధర ఐపీఓలో కేటాయించిన మొత్తం కన్నా తగ్గడంతో పాలసీదారులు, రిటైల్‌ మదుపర్లు కొంత నిరాశచెందారు. అయితే, మార్కెట్లో అనూహ్యంగా మారుతున్న పరిణామాల కారణంగానే ఎల్‌ఐసీ షేర్లు నష్టాలతో అరంగేట్రం చేశాయని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ  (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే అన్నారు. ఎల్‌ఐసీ ఐపీఓలో పెట్టుబడులపైౖ మెరుగైన ప్రతిఫలాల కోసం ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను దీర్ఘకాలం హోల్డ్‌ చేయాలని ఆయన సూచించారు. మున్ముందు కంపెనీ షేరు పుంజుకోగలదని ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. ఐపీఓలో షేర్లు దక్కించుకోలేకపోయిన వారు, ముఖ్యంగా పాలసీదారులు సెకండరీ మార్కెట్‌ ద్వారా షేర్లను తప్పక కొనుగోలు చేస్తారన్నారని అన్నారు. ఎల్‌ఐసీ షేర్లలో ప్రస్తుత నిరుత్సాహం ఎంతో కాలం ఉండదన్నారు. మార్కెట్‌ విశ్లేషకులు సైతం ఎల్‌ఐసీ షేర్లను దీర్ఘకాలం హోల్డ్‌ చేయడం మేలని సూచిస్తున్నారు. ఎల్‌ఐసీ షేర్లకు తటస్థ రేటింగ్‌ కేటాయించిన అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మాక్వారీ.. సమీప భవిష్యత్‌లో షేరు ధర రూ.1,000కు చేరుకోవచ్చని అంచనా వేసింది. 


బీఎ్‌సఈలో కదలికలు(రూ.లలో)

లిస్టింగ్‌      867.20

గరిష్ఠం      920.00

కనిష్ఠం      860.10

ముగింపు    875.45

Read more