‘మూన్‌లైటింగ్‌’ తప్పేంకాదు

ABN , First Publish Date - 2022-10-02T08:51:43+05:30 IST

మూన్‌లైటింగ్‌.. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో మారుమోగుతున్న మాట.

‘మూన్‌లైటింగ్‌’ తప్పేంకాదు

ఐటీ కంపెనీలు సానుకూలంగానే ఉన్నాయ్‌

8 రెండు కంపెనీలకు తెలిసి చేయాలని కోరుతున్నాయ్‌

భవిష్యత్తులోనూ కొనసాగుతుంది 8 జెన్‌క్యూ సీఈఓ మురళి బొల్లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మూన్‌లైటింగ్‌.. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలో మారుమోగుతున్న మాట. ఒకే వ్యక్తి రెండు కంపెనీలకు పని చేయడాన్నే మూన్‌లైటింగ్‌ అంటున్నారు. రెండు ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులపై ప్రముఖ ఐటీ కంపెనీలు కన్నెర చేస్తున్నాయి. ఒక ఉద్యోగి రెండు ఉద్యోగాలు చేయడంపై స్థూలంగా పరిశ్రమ సానుకూలంగానే ఉంది. అయితే.. ఒక కంపెనీలో పూర్తి స్థాయి ప్రయోజనాలు పొందుతూ.. ఉద్యోగ ఒప్పందాన్ని ఉల్లంఘించి  రెండో కంపెనీకి లేదా కంపెనీకి పోటీగా ఉన్న కంపెనీకి పని చేయడంపైనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రెండు కంపెనీలకు తెలిసి చేయాలని కంపెనీలు సూచిస్తున్నాయి. ఇటువంటి ధోరణులను కట్టడి చేయడానికి ఉద్యోగ ఒప్పందాల్లో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (డబ్ల్యూఎ్‌ఫహెచ్‌) తదుపరి దశ మూన్‌లైటింగ్‌ అని జెన్‌క్యూ సీఈఓ, హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) మాజీ ప్రెసిడెంట్‌ మురళి బొల్లు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మూన్‌లైటింగ్‌పై ఆయన ఇంకా ఏమన్నారంటే.. 


సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు రెండు ఉద్యోగాలు 

ఎందుకు చేస్తున్నారు?

గత రెండేళ్లకు పైగా ఉద్యోగులు ఇంటి వద్ద ఉండే పని చేస్తున్నారు. దీంతో ఆఫీసులకు రావడానికి ఇష్టపడడం లేదు. అవసరాలు, ఆదాయం, వెసులుబాటు కారణంగా కొంతమంది ఉద్యోగులు రెండు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు. ఇటువంటి వారిని గుర్తించడం కూడా కష్టమే. తగిన సమయానికి అటెండ్‌ కాకపోవడం.. ఇచ్చిన పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోవడం వంటి కొన్ని ఇండికేషన్లు వచ్చినప్పుడే వారిపై కంపెనీలు శ్రద్ధ పెట్టగలవు. అనుమానం వచ్చినప్పుడు కంపెనీలు పీఎఫ్‌ ఖాతాల వంటివి చెక్‌ చేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉండే కంపెనీల్లో గుర్తించడం మరీ కష్టం.


భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందా?

డబ్ల్యూఎ్‌ఫహెచ్‌ తదుపరి దశే మూన్‌లైటింగ్‌. ఉద్యోగులు కంపెనీలకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులు ఏర్పడి ఉద్యోగం ఉండదన్న పరిస్థితి వస్తే తప్ప భవిష్యత్తులో 100 శాతం ఉద్యోగులు ఆఫీసులకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికీ చాలా కంపెనీల్లో చాలా తక్కువ శాతం మంది ఆఫీసులకు వస్తున్నారు. కొన్ని కంపెనీలు 30 శాతం వస్తున్నారని చెబుతున్నాయి. 5జీ అందుబాటులోకి వస్తే దూర ప్రాంతాల వారికి కూడా నెట్‌ స్పీడ్‌ పెరుగుతుంది. ఆఫీసుతో సమానంగా ఇంటి వద్దే పని చేసుకోవచ్చు. ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు కంపెనీలు భయపడుతున్నాయి. ఉద్యోగులు రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. 

ఎవరు ఎక్కువగా రెండు ఉద్యోగాలు చేస్తున్నారు?

కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, ఐఓటీ, డ్రోన్‌ టెక్నాలజీస్‌ వంటి కొత్త తరం టెక్నాలజీల్లో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. 3-5 ఏళ్ల వరకూ అనుభవం ఉన్న వారికి రెండో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తోంది. వారిలో కొంత మెచ్యూరిటీ ఉంటుంది. కొంత అనుభవం, చేయగల సామర్థ్యం ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొత్త వారికి కూడా ఈ అవకాశం లభిస్తోంది. ఎక్కువ అనుభవం ఉన్న వారికి, మేనేజిరియల్‌ స్థాయిలో ఉన్న వారికి ఇది సాధ్యం కాదు. 

చట్టపరంగా..  నైతికంగా ఇలా చేయొచ్చా?

ఒక కంపెనీ ఇచ్చిన పనిని సమాయానికి పూర్తి చేస్తూ.. ఉద్యోగ ఒప్పందానికి అనుగుణంగా ఉంటూ రెండో ఉద్యోగం చేయడం తప్పేం లేదు. దీన్ని పరిశ్రమ కూడా ఆమోదిస్తోంది. ఒక కంపెనీ సమాచారాన్ని మరో కంపెనీకి అందిస్తే తప్పు. రెండు ఉద్యోగాలు చేయడం వల్ల ఉద్యోగుల నైపుణ్యాలు పెరుగుతాయి. కంపెనీలకు కూడా ఉపయోగమే.  ఉద్యోగుల్లో రిస్క్‌ తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఎంటర్‌ప్రెన్యూరల్‌ సామర్థ్యాలు పెరుగుతాయి. రెండు ఉద్యోగాలు చేసే ధోరణి ఇప్పుడు తక్కువగా ఉన్నా.. భవిష్యత్తులో పెరుగుతుంది. 

కంపెనీలు భవిష్యత్తులో ఎలా స్పందిస్తాయ్‌?

భవిష్యత్తులో కంపెనీలు ఉద్యోగ కాంట్రాక్టులో కొన్ని కొత్త క్లాజులు ప్రవేశపెట్టే వీలుంది. ఆఫీసులకు వచ్చే విధంగా ఉద్యోగులను ప్రోత్సహించవచ్చు. ఉద్యోగులకు కంపెనీలే కొన్ని వెసులుబాట్లు కల్పించవచ్చు. 


లాట్‌ మొబైల్స్‌లో దసరా, దీపావళి  ధమాకా ఆఫర్లు 

హైదరాబాద్‌: మల్టీ బ్రాండ్‌ మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ లాట్‌ మొబైల్స్‌.. దసరా, దీపావళి ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్‌ యం అఖిల్‌ మాట్లాడుతూ.. పండగల సందర్భంగా తమ షోరూమ్‌లన్నింటిలో అన్ని బ్రాండెడ్‌ మొబైల్స్‌, స్మార్ట్‌ టీవీలు, లాప్‌టాప్స్‌, స్మార్ట్‌ వాచీలు సహా లేటెస్ట్‌ యాక్సెసరీస్‌ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అంతేకాకుండా ఈసారి లాట్‌లో ఇన్వర్టర్లు,  ప్రింటర్లు కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అఖిల్‌ తెలిపారు. దసరా, దీపావళి పండగల సందర్భంగా దక్షిణాదిలో తొలిసారిగా కేవలం లాట్‌ మొబైల్స్‌లో ప్రతి స్మార్ట్‌ పోన్‌ కొనుగోలుపై ఫైర్‌ బోల్ట్‌ కాలింగ్‌ వాచీ, టవర్‌ ఫ్యాన్‌, టీడబ్ల్యూఎస్‌ ఎయిర్‌పోడ్స్‌, పోర్టబుల్‌ స్పీకర్‌, నెక్‌ బ్యాండ్‌, హోమ్‌ ధియేటర్‌.. కాంబో ఆఫర్స్‌తో లభిస్తాయన్నారు. స్మార్ట్‌ టీవీలు రూ.8,999, లాప్‌టాప్స్‌ 17,499కే లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌పై 7.5 శాతం వరకు ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుందని లాట్‌ మొబైల్స్‌ తెలిపింది. అంతేకాకుండా ప్రీమియం స్మార్ట్‌ ఫోన్స్‌పై రూ.8,000 వరకు ఎక్స్ఛేంజీ బోనస్‌, స్మార్ట్‌వాచెస్‌ కొనుగోలుపై 75 శాతం వరకు తగ్గింపు, ఒప్పో మొబైల్స్‌ కొనుగోలుపై జీరో డౌన్‌పేమెంట్‌తో పాటు రూ.10 లక్షల వరకు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం లాట్‌ మొబైల్స్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 150కి పైగా షోరూమ్స్‌ను నిర్వహిస్తోంది.


Read more