డాలర్‌ మిలమిల.. రూపాయి విలవిల

ABN , First Publish Date - 2022-09-29T09:24:25+05:30 IST

ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ వెలుగులు విరజిమ్ముతూ దూసుకుపోతుంటే భారత కరెన్సీ సహా వివిధ దేశాల కరెన్సీలు ఉసూరుమంటున్నాయి.

డాలర్‌ మిలమిల.. రూపాయి విలవిల

82కు చేరువైన రూపాయి మరో 40 పైసలు డౌన్‌


ముంబై: ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ వెలుగులు విరజిమ్ముతూ దూసుకుపోతుంటే భారత కరెన్సీ సహా వివిధ దేశాల కరెన్సీలు ఉసూరుమంటున్నాయి. బుధ వారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఇంట్రాడే ట్రేడ్‌లో 82 స్థాయిని తొలిసారిగా దాటింది. ఆ తర్వాత కాస్తంత నిలదొక్కుకుని మార్కెట్‌ ముగిసే సమయా నికి 40 పైసల నష్టంతో 81.93 వద్ద ముగిసింది. అంత ర్జాతీయంగా అమెరికన్‌ కరెన్సీ విలువ మరింత పుంజు కోవడంతోపాటు ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం వంటి అంశాలు రూపాయికి గండి కొట్టాయి. అంతే కాదు, విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గిన నేపథ్యం లో రూపాయికి ఆర్‌బీఐ కూడా దన్నుగా నిలవలేక పోతోందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ సుగంధ సచ్‌దేవ అన్నారు. 


పెట్టుబడులు బ్యాక్‌ టు అమెరికా 

డాలర్‌ ఇండెక్స్‌ 20 ఏళ్ల గరిష్ఠ స్థాయి 115 స్థాయికి చేరువవుతోంది. బుధవారం ఒకదశలో 114.78 స్థాయి ని తాకింది. అలాగే, అమెరికాలో బాండ్లపై రాబడి రేట్లు గణనీయంగా ఎగబాకాయి. గడిచిన 14 ఏళ్లలో తొలిసారిగా పదేళ్ల కాలపరిమితి బాండ్ల రిటర్న్‌ రేటు ఒక దశలో 4 శాతానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) భారత్‌ సహా ఇతర వర్ధమాన దేశాల ఈక్విటీ మార్కెట్లలోని పెట్టుబ డులను అమెరికన్‌ బాండ్లు, డాలర్లలోకి మళ్లిస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో ఎఫ్‌ఐఐలు మన ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.10,000 కోట్లకు పైగా  పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. 


ఫెడ్‌ రేట్ల పెంపే కారణం 

నాలుగు దశాబ్దాల గరిష్ఠ స్థాయికి చేరుకున్న ధరాఘాతాన్ని తగ్గించేందుకు అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ గతవారం కీలక వడ్డీ రేట్లను మరో 0.75 శాతం పెంచింది. ముప్పావు చొప్పున వడ్డించడం ఇది మూడోసారి. డాలర్‌ విలువ క్రమంగా పుంజుకుంటుండటంతోపాటు ఆ దేశ బాండ్ల రాబడి రేటు కూడా  పెరగడానికిదే ప్రధాన కారణం. గతవారంలో ఫెడ్‌ రేట్లు పెరిగినప్పటి నుంచి మన రూపాయి విలువ 2.25 శాతం క్షీణించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 9.70 శాతం పతనమైంది. ఇక డాలర్‌ ఇండెక్స్‌  విషయానికొస్తే, ఈ ఏడాదిలో 19.50 శాతం పుంజుకుంది. 


మరింత క్షీణత తప్పదా..? 

మున్ముందు రూపాయి మరింత బలహీనపడవచ్చని బ్రోకరేజీ సంస్థ సీఆర్‌ ఫారెక్స్‌ అభిప్రాయపడింది. స్వల్ప కాలంలో డాలర్‌తో రూపాయి మారకం రేటు 82.50-83 స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. అయితే, 81-80.50 స్థాయిల వద్ద మన కరెన్సీకి మద్దతు లభించవచ్చని అంటోంది. 


డాలర్‌ పంచ్‌కు కరెన్సీలన్నీ కుదేలు 

14 ఏళ్ల కనిష్ఠానికి యువాన్‌ 

చైనా కరెన్సీ యువాన్‌ విలువ 14 ఏళ్ల (2008 జనవరి నాటి) కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో యువాన్‌ మారకం రేటు 7.2301కి చేరుకుంది. అంటే, ఒక యువాన్‌ విలువ 13.8 సెంట్లకు తగ్గింది. ఈ ఏడాది మార్చితో పోలిస్తే 15 శాతం పడిపోయింది. భారత్‌, చైనా వంటి వర్ధమాన దేశాలతోపాటు అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలూ డాలర్‌ ధాటికి విలవిలలాడుతున్నాయి. బ్రిటన్‌ పౌండ్‌, యూరోపియన్‌ యూనియన్‌ కరెన్సీ యూరో, ఆస్ట్రేలియా డాలర్‌ విలువ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 8-20 శాతం వరకు క్షీణించింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ యూరో విలువ డాలర్‌ కంటే తగ్గింది. పౌండ్‌ కూడా దాదాపు డాలర్‌ స్థాయికి పడిపోయింది. ఇక జపాన్‌ యెన్‌  24 ఏళ్ల కనిష్ఠ స్థాయి దిశగా జారుకుంటోంది. ప్రస్తుతం ఒక డాలర్‌ కోసం జపాన్‌ వాసులు 144 యెన్‌లు వెచ్చించాల్సి వస్తోంది. 


‘ఫారెక్స్‌’ కొండ కరుగుతోంది 

ఏడాదిలో విదేశీ మారక నిల్వలు మరింత తగ్గనున్నాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈనెల 16తో ముగిసిన వారానికి ఆర్‌బీఐ వద్దనున్న ఫారెక్స్‌ నిల్వలు దాదాపు రెండేళ్ల కనిష్ఠ స్థాయి 54,565.2 కోట్ల డాలర్లకు తగ్గాయి. గత ఏడాది సెప్టెంబరులో నమోదైన ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 64,200 కోట్ల డాలర్లతో పోలిస్తే, గడిచిన ఏడాది కాలంలో దాదాపు 10,000 కోట్ల డాలర్ల మేర తగ్గాయి. రాయిటర్స్‌ తాజా పోల్‌లో పాల్గొన్న 16 మంది ఆర్థిక వేత్తల అంచనాల సగటు ప్రకారం.. ఈ ఏడాది చివరినాటికి నిల్వలు మరో 2,300 కోట్ల డాలర్లు తగ్గి 52,300 కోట్ల డాలర్లకు పడిపోవచ్చు.

Updated Date - 2022-09-29T09:24:25+05:30 IST