ఐటీ వ్యయాలపై బేఫికర్‌

ABN , First Publish Date - 2022-08-10T05:56:40+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) అంచనా వేసిన 14-16 శాతం ఆదాయ వృద్ధిని సునాయసంగా సాధించగలమని దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక టెక్నాలజీ సమకూర్చుకునేందుకు ప్రపంచ కంపెనీలు చేస్తున్న వ్యయాలు..

ఐటీ వ్యయాలపై బేఫికర్‌

పటిష్ఠంగానే అమెరికా, యూరప్‌ మార్కెట్లు 

ఈ ఏడాది 14-16ు ఆదాయ వృద్ధిపై ధీమా

 ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ 


బెంగళూరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) అంచనా వేసిన 14-16 శాతం ఆదాయ వృద్ధిని సునాయసంగా సాధించగలమని దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక టెక్నాలజీ సమకూర్చుకునేందుకు ప్రపంచ కంపెనీలు చేస్తున్న వ్యయాలు మెరుగైన స్థితిలోనే ఉన్నాయన్న పరేఖ్‌.. ఐటీకి కీలకమైన అమెరికా, యూరప్‌ మార్కెట్లు పటిష్ఠంగానే కన్పిస్తున్నాయన్నారు. అయినప్పటికీ, ప్రపంచ ఆర్థిక పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ఆయన తెలిపారు. డిజిటల్‌ టెక్నాలజీలపై క్లయింట్ల దృష్టి చాలా బలంగా ఉందన్నారు. ఇందుకు తోడు కంపెనీల వ్యయ నియంత్రణ, యాంత్రీకరణ  ప్రయత్నాలు తమ వ్యాపార వృద్ధికి చోదకాలు కానున్నాయని ఆయన పేర్కొన్నారు. మున్ముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు మరింత పెరిగితే కంపెనీలకు వ్యయ నియంత్రణ, ఆటోమేషన్‌ మరింత కీలకంగా మారనున్నాయని అన్నారు. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి 21 శాతం ఆదాయ వృద్ధి సాధించిన ఇన్ఫోసిస్‌.. 2022-23 మొత్తానికి వృద్ధి అంచనాను 14-16 శాతానికి పెంచింది. 


భారత ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్లు అయిన అమెరికా, యూర్‌పను ఆర్థిక మాంద్యం కమ్ముకుంటోంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడి కంపెనీలు ఆధునిక టెక్నాలజీ కోసం ఖర్చులను తగ్గించుకోవడం లేదా వాయిదా వేసుకోవచ్చన్న అంచనాలున్నాయి. మాంద్యం భయాలతో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజాలు సైతం నియామకాలను తగ్గించాయి. ఈ నేపథ్యంలోనూ ఇన్ఫోసిస్‌ యాజమాన్యం భవిష్యత్‌పై ఆశావహంగా ఉండటం గమనార్హం. ‘‘అధిక ద్రవ్యోల్బణంపై చాలా చర్చ జరుగుతోంది. కానీ, జూలై నెలకు అమెరికా, యూర్‌పలో వినియోగదారుల ఖర్చులు వార్షిక ప్రాతిపదికన పెరిగాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయ’’ని పరేఖ్‌ ఈ సందర్భంగా అన్నారు. మార్కెట్‌ సంకేతాలు మాంద్యం అంచనాలకు భిన్నంగా ఉన్నాయని.. వినియోగదారులు మరింతగా వెచ్చిస్తుండటం వ్యాపారాలకు సానుకూల అంశమని పరేఖ్‌ పేర్కొన్నారు.

Read more