భారత ఆర్థిక వ్యవస్థ కుదేలు!

ABN , First Publish Date - 2022-11-12T02:50:56+05:30 IST

భారత్‌కు కూడా ఆర్థిక సంక్షోభం తప్పేలా లేదు. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, పరపతి రేటింగ్‌ సంస్థలు వరుస పెట్టి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గించేస్తున్నాయి.

భారత ఆర్థిక వ్యవస్థ కుదేలు!

తలకిందులవుతున్న జీడీపీ అంచనాలు.. వెంటాడుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు..

వృద్ధి రేటును 7 శాతానికి కుదించిన మూడీస్‌

న్యూఢిల్లీ: భారత్‌కు కూడా ఆర్థిక సంక్షోభం తప్పేలా లేదు. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, పరపతి రేటింగ్‌ సంస్థలు వరుస పెట్టి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గించేస్తున్నాయి. తాజాగా మూడీస్‌ పరపతి రేటింగ్‌ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.7 శాతం నుంచి ఏడు శాతానికి కుదించింది. మూడీస్‌ భారత జీడీపీ అంచనాలను ఈ ఆర్థిక సంవత్సరం కుదించడం ఇది రెండోసారి. ఈ ఏడాది మే నెలలో ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధి రేటు 8.8 శాతం ఉంటుందన్న ఈ సంస్థ రెండు నెలల క్రితం దాన్ని 7.7 శాతానికి తగ్గించింది. తాజాగా ఇప్పుడు మళ్లీ దాన్ని ఏడు శాతానికి కుదించింది. ‘గ్లోబల్‌ మాక్రో ఔట్‌లుక్‌ 2023-24’ పేరుతో విడుదల చేసిన తన తాజా నివేదికలో మూడీస్‌ ఈ విషయం పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి అయితే ఈ అంచనాలను మరింత కుదించి 4.8 శాతం దాటకపోవచ్చని తెలిపింది.

పారిశ్రామికోత్పత్తి అంతంతే..

కాగా భారత పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) అంతంత మాత్రంగానే ఉంది. గత ఏడాది సెప్టెంబరులో 4.4 శాతంగా ఉన్న పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ సంవత్సరం సెప్టెంబరులో 3.1 శాతానికి పడిపోయింది. జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలు విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో తయారీ రంగంలో 1.8 శాతం, గనుల రంగంలో 4.6 శాతం, విద్యుదుత్పత్తి రంగంలో 11.6 శాతం వృద్ధి రేటు నమోదైంది.

Updated Date - 2022-11-12T02:57:18+05:30 IST