ఎస్‌యూవీలపై భారతీయుల మోజు

ABN , First Publish Date - 2022-07-18T06:52:18+05:30 IST

భారతీయులకు స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీ) పట్ల మోజు పెరిగిపోతోంది.

ఎస్‌యూవీలపై భారతీయుల మోజు

న్యూఢిల్లీ: భారతీయులకు స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీ) పట్ల మోజు పెరిగిపోతోంది. ఆటోమొబైల్‌ తయారీదారులు కూడా కొత్తకొత్త కార్లతో వారి మోజును మరింతగా పెంచుతున్నారు. గత ఐదేళ్లలో 36 కొత్త ఎస్‌యూవీలు విడుదల కావడమే ఇందుకు తార్కాణం. రాబోయే రెండేళ్లలో పలు ఎస్‌యూవీ మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. అలాగే ఔత్సాహిక కొనుగోలుదారుల నుంచి కొత్త ఆర్డర్లు కూడా వెల్లువలా వస్తున్నాయి. చక్కని ఫీచర్లు కలిగి ఉండి సౌకర్యవంతమైన ప్రయాణానికి ఉపయోగపడే కార్ల కొనుగోలుకు ప్రజలు అధికంగా ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడడంలేదు.


ఒకప్పుడు హాచ్‌బ్యాక్‌లు అధికంగా అమ్ముడుపోయిన మార్కెట్లో ఇప్పుడు ఎంట్రీ స్థాయి, మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీలు క్రమంగా ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయని పరిశీలకులంటున్నారు. ఎస్‌యూవీల విభాగం 2021-22లో 40 శాతం వృద్ధిని సాధించిందని మారుతి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ అన్నారు. గత ఏడాది ఎంట్రీ స్థాయి ఎస్‌యూవీ మార్కెట్‌. ప్రీమియం హాచ్‌బ్యాక్‌ల స్థానా న్ని కైవసం చేసుకుందని టాటా మోటార్స్‌ ఎండీ (ప్యాసింజర్‌ కార్స్‌) శైలేష్‌ చంద్ర అన్నారు.కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తాము పలు కొత్త మోడళ్లు, ఎస్‌యూవీలు మార్కెట్లోకి తెస్తున్నట్టు ఆయన చెప్పా రు. అందరి కన్నా ప్రత్యేకంగా కనిపించాలనే తపన, స్టైలిష్‌ వాహనాల పట్ల మోజు ఎస్‌యూవీలకు ఆదరణ పెరగడానికి కారణమని కియా ఇండియా చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ మ్యూంగ్‌ సిక్‌ సోన్‌ అన్నారు.  గత ఏడాది 30.68 లక్షల కార్లు అమ్ముడుపోగా అందులో ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీల సంఖ్య 6.52 లక్షలున్నదని తెలుస్తోంది. 

Updated Date - 2022-07-18T06:52:18+05:30 IST