హైదరాబాద్‌లో నేచురల్‌ ఏపీఐ యూనిట్‌

ABN , First Publish Date - 2022-10-14T09:08:06+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన న్యూట్రాస్యూటికల్స్‌ కంపెనీ దక్కన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ సుమారు రూ.150 కోట్లతో సహజసిద్ధ (నేచురల్‌) యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌..

హైదరాబాద్‌లో  నేచురల్‌ ఏపీఐ యూనిట్‌

రూ.150 కోట్ల పెట్టుబడి

దక్కన్‌ హెల్త్‌కేర్‌ సీఎండీ మింటో పీ గుప్తా


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన న్యూట్రాస్యూటికల్స్‌ కంపెనీ దక్కన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ సుమారు రూ.150 కోట్లతో సహజసిద్ధ (నేచురల్‌) యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్‌ నిర్మాణ పనులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతాయని దక్కన్‌ హెల్త్‌కేర్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మింటో పీ గుప్తా ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కాగా లిస్టెడ్‌ కంపెనీ  అయిన దక్కన్‌ హెల్త్‌కేర్‌ వ్యాపార కార్యకలాపాలను విదేశాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. వచ్చే దశాబ్ద కాలంలో ఫార్మాస్యూటికల్స్‌ మార్కెట్‌ను న్యూట్రాస్యూటికల్స్‌ మార్కెట్‌ అధిగమించే వీలుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డాక్టర్లు సిఫారసు చేసే న్యూట్రాస్యూటికల్స్‌ విభాగంలోకి ప్రముఖ ఫార్మా కంపెనీలు అడుగు పెడుతున్నాయి. భవిష్యత్తులో కన్స్యూమర్‌ (ఓటీసీ) న్యూట్రాస్యూటికల్స్‌లోకి విస్తరించగలవని తెలిపారు. న్యూట్రాస్యూటికల్స్‌ మార్కెట్‌ ఏడాదికి 25 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నట్లు చెప్పారు.


‘డిజిటల్‌ స్ర్కీన్‌’ సమస్యలకు ఉత్పత్తులు:

ప్రస్తుతం చాలా మంది కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్ల వంటివి చూస్తూ గడుపుతున్నారు. సగటున 7-8 గంటలు డిజిటల్‌ స్ర్కీన్‌కు అంకితం అవుతున్నారు. వీరికి కలర్‌ బ్లైండ్‌నెన్‌, డ్రై ఐస్‌, మెదడు, మానసిక, వెన్నెముక, మెడ సమస్యలు వస్తున్నాయి. వీటిని అధిగమించడానికి కంపెనీ నాలుగు కొత్త న్యూట్రాస్యూటికల్స్‌ ఉత్పత్తులను జనవరిలో విడుదల చేయనుంది. ‘డిజిటల్‌ స్ర్కీన్‌’ సమస్యలకు మొదటిగా న్యూట్రాస్యూటికల్స్‌ను విడుదల చేస్తున్న కంపెనీ తమదే అవుతుందని మింటో తెలిపారు. ముందుగా ‘డిజిటల్‌ స్ర్కీన్‌’ సమస్యలను అధిగమించే ఉత్పత్తులను హైదరాబాద్‌లో విడుదల చేస్తాం. అనంతరం ఇతర నగరాల్లో ప్రవేశపెడతాం. ప్రస్తుతం కంపెనీకి చెందిన 90 ఉత్పత్తుల విక్రయాలు బాగా ఉన్నాయి. మొత్తం ఆదాయంలో వీటి వాటా 80 శాతం ఉంది. వీటిలో 20 ఉత్పత్తులను జనవరిలో యూఏఈలో విడుదల చేయనున్నాం. ఆ తర్వాత అమెరికా మార్కెట్లోకి అడుగు పెడతామని ఆయన  అన్నారు. 


మూడేళ్లలో రూ.200 కోట్ల టర్నోవర్‌:

గత ఆర్థిక సంవత్సరంలో రూ.40 కోట్ల టర్నోవర్‌ను దక్కన్‌ హెల్త్‌కేర్‌ నమోదు చేసింది. వచ్చే మూడేళ్లలో ప్రస్తుతం విక్రయిస్తున్న ఉత్పత్తుల నుంచి రూ.100 కోట్ల టర్నోవర్‌, డిజిటల్‌ స్ర్కీన్‌ సమస్యలను అధిగమించే ఉత్పత్తుల నుంచి మరో రూ.100 కోట్ల అమ్మకాలు నమోదు కాగలవని మింటో చెప్పారు. టర్నోవర్‌లో లాభం దాదాపు 25 శాతం ఉండగలదన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్లు, ఆ తర్వాత ఏడాది రూ.50 కోట్ల నిధులను వెంచర్‌ క్యాపిటలిస్టుల నుంచి సమీకరించాలని భావిస్తున్నట్లు మింటో తెలిపారు.  

Read more