Home Loans: హోం లోన్స్‌లో ఇన్ని రకాలా? మీకేది సూటవుతుందో చూసుకోండి!

ABN , First Publish Date - 2022-09-12T20:42:20+05:30 IST

సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. ఏనాటికైనా సొంతిల్లు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అదొక్కటి

Home Loans: హోం లోన్స్‌లో ఇన్ని రకాలా? మీకేది సూటవుతుందో చూసుకోండి!

న్యూఢిల్లీ: సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. ఏనాటికైనా సొంతిల్లు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అదొక్కటి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తారు. అందుకనే అప్పోసప్పో చేసి సొంతింటి కలను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఏకమొత్తంగా ఒకేసారి లక్షలు పోసి ఇల్లు కొనుగోలు చేయలేని వారి కోసం బ్యాంకులు ఎలానూ ఉన్నాయి. ఆకర్షణీయ వడ్డీతో గృణ రుణాలు అందిస్తూ ఎంతోమంది కలలను సాకారం చేశాయి. అయితే, ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఒకటుంది. గృహరుణం అంటే ఒక్కటే కాదు. చాలా రకాల లోన్స్ అందుబాటులో ఉన్నాయి.  మార్కెట్లో అందుబాటులో ఉన్న గృహరుణాలేంటే.. అవి మీకు ఏ విధంగా సరిపోతాయో ఒక లుక్కేద్దాం. 


హోం పర్చేజ్ లోన్ (Home purchase loan): నూతన గృహం, ఇప్పటికే ఉంటున్న ఇల్లు లేదంటే ఆస్తి కొనుగోలు చేసేందుకు ఇది చక్కని ఆప్షన్. స్థిరమైన లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై వీటిని మంజూరు చేస్తారు. 30 సంవత్సరాల వరకు చెల్లించుకోవచ్చు. 


ముందస్తు అనుమతితో గృహ రుణాలు (Pre-approved home loan): క్రెడిట్ యోగ్యత, ఆదాయ అవసరాలు, ఆర్థిక స్థిరత్వం వంటి వాటి కారణంగా బ్యాంకులు ముందుస్తుగా అప్రూవ్ చేసే లోన్లు ఇవి. ఖాతాదారుల లావాదేవీలను పూర్తిగా పరిశీలించిన అనంతరం వారిపై పూర్తి విశ్వాసంతో బ్యాంకులు ఈ రుణాలను అందిస్తాయి.


ఇంటి నిర్మాణ రుణం (Home construction loan): మన ప్లాట్‌లో ఇల్లు, లేదంటే అపార్ట్‌మెంట్ లాంటివి కట్టాలనుకున్నప్పుడు బ్యాంకులు అందించే రుణాలను ఇలా పిలుస్తారు. ఇంటి నిర్మాణం చేపట్టాలనుకుంటున్న వారికి ఇది మంచి ఎంపిక. గరిష్టంగా 15 ఏళ్ల కాలపరిమితితో దీనిని తిరిగి చెల్లించుకోవచ్చు. 


ప్లాట్ లోన్(Plot loan): గృహ రుణాల్లో ఇది కూడా ఒకటి. ఇంటి నిర్మాణం కోసం ప్లాట్ కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన రుణం ఇది. దీని కింద అందించే రుణం కొనుగోలు చేయాలనుకుంటున్న ప్లాట్ విలువ, క్రెడిట్ ప్రొఫైల్ తదితర విషయాలపై ఆధారపడి ఉంటుంది. 


టాపప్ లోన్(Top-up loan): ఇప్పటికే తీసుకున్న గృహ రుణంపై మరికొంత తీసుకునేందుకు ఉద్దేశించిన లోన్ ఇది. ఇంటి ఆధునికీకరణ, వ్యాపార విస్తరణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటి వాటి కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. 


ఇంటి విస్తరణ/పునర్నిర్మాణ రుణం(Home extension/renovation loan): ఉన్న ఇంటిని విస్తరించండం లేదంటే పునరుద్ధరణ చేయాలనుకున్న వారికి ఈ లోన్ మంచి ఆప్షన్. అంటే ఇంటికి రంగులు వేయడం, ప్లంబింగ్ పనులు, శానిటరీ, ఫ్లోరింగ్, టైలింగ్, అదనపు గదుల నిర్మాణం మొదలైన వాటి కోసం ఈ లోన్ ఇస్తారు. ఇంటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం కోసం ఈ రుణాన్ని తీసుకోవచ్చు. 


హోంలోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ (Home loan balance transfer): ప్రస్తుత ఉన్న గృహ రుణంపై మరిన్ని మెరుగైన నిబంధనలను కనుక కోరుకుంటున్నట్టు అయితే హోంలోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ మంచి ఎంపిక. అంటే ప్రస్తుతం మీరు తీసుకున్న రుణానికి సంబంధించి వడ్డీ ఎక్కువగా చెల్లిస్తున్నట్టు అయితే, తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్న బ్యాంకుకు, లేదంటే చెల్లింపు గడువును పొడిగించేందుకు అవకాశం ఉన్న బ్యాంకుకు మిగిలిన మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. 


గృహ రుణాన్ని ఎంచుకోవడానికి ముందు మన అవసరాలను అంచనా వేసుకునేందుకు సమయాన్ని వెచ్చించాలని అంటారు బ్యాంక్ బజార్.కామ్(Bankbazaar.com) సీఈవో ఆదిల్ శెట్టి. ఆ తర్వాత మనకు అనుకూలంగా ఉన్న రుణాన్ని ఎంచుకోవాలని పేర్కొన్నారు. ఇతర విషయాలతోపాటు క్రెడిట్ స్కోర్, ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యం కోసం బ్యాంక్ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే రుణాన్ని తీసుకోవడం మంచిదని సూచించారు. లోన్ పేపర్స్‌పై సంతకం పెట్టడానికి ముందు వడ్డీ రేట్లను చూసుకోవాలని, లోన్ నిబంధనలను పూర్తిగా చదువు కోవాలని ఆదిల్ శెట్టి సూచించారు.  

Updated Date - 2022-09-12T20:42:20+05:30 IST