Wipro: విప్రోలో జాబ్ చేస్తున్నారా..? అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే..!

ABN , First Publish Date - 2022-10-02T02:31:19+05:30 IST

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన విప్రో(Wipro) 300 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించి ఇంటికి పంపిన విషయం..

Wipro: విప్రోలో జాబ్ చేస్తున్నారా..? అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే..!

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన విప్రో(Wipro) 300 మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించి ఇంటికి పంపిన విషయం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. ‘మూన్ లైటింగ్’ (moonlighting) విధానంలో తమ ప్రత్యర్థి కంపెనీలకు కూడా పనిచేస్తూ తమ సంస్థను మోసం చేస్తున్నారని పేర్కొన్న విప్రో 300 మంది ఉద్యోగులను ఉన్నపళంగా ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ చర్యను విప్రో సమర్థించుకున్నప్పటికీ ఈ నిర్ణయంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత కొన్ని నెలల్లో 300 మంది ఉద్యోగులు ‘మూన్ లైటింగ్’ విధానంలో మరో కంపెనీకి కూడా పనిచేస్తున్నారని గుర్తించినట్టుగా ఆ సందర్భంలో విప్రో చెప్పుకొచ్చింది.


‘విప్రో’ యాజమాన్యం రెండు ఉద్యోగాలు చేస్తున్న ఆ 300 మంది ఉద్యోగులను ఎలా గుర్తించిందనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అయితే.. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన ఐటీ నిపుణులు మాత్రం రెండు మార్గాల్లో మూన్‌లైటింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను సదరు సంస్థ గుర్తించి ఉండొచ్చని చెబుతున్నారు. 12 డిజిట్ ఉద్యోగి UAN ను ట్రాక్ చేయడం ద్వారా తెలుసుకుని ఉండొచ్చని అంటున్నారు. మరో ఐటీ సంస్థ కోసం పనిచేస్తున్నారో, లేదో UAN నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని.. అలా తెలుసుకుని ఉండొచ్చని చెప్పుకొచ్చారు. అయితే.. ఉద్యోగికి సంబంధించి అలాంటి సమాచారాన్ని ఒక ప్రముఖ ఐటీ సంస్థ ట్రాక్ చేసి ఉంటుందని కూడా కచ్చితంగా చెప్పలేమని అభిప్రాయపడ్డారు.



మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న ఉద్యోగిని గుర్తించేందుకు మరో మార్గాన్ని కూడా ‘విప్రో’ ఎంచుకుని ఉండొచ్చని ఐటీ నిపుణులు అభిప్రాయపడ్డారు. అది అందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే.. రిమోట్ విధానంలో పనిచేసే ఉద్యోగికి సదరు ఐటీ సంస్థలే ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ఫోన్లు వర్క్ నిమిత్తం ఇస్తాయి. ఒకవేళ అవే డివైజ్‌లపై వేరే కంపెనీ కోసం పనిచేస్తే మాత్రం కంపెనీ సర్వర్ డిటెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత.. ఆ వివరాలన్నీ సదరు సంస్థకు తెలిసిపోతాయి. ఈ విధానాన్ని ‘విప్రో’ ఎంచుకుని ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఉద్యోగులు కూడా అంత అమాయకంగా ఉంటారని భావించలేమనే వాదన వినిపిస్తోంది. కంపెనీ ల్యాప్‌టాప్స్‌లో ఇతరత్రా పనులు చేస్తే సదరు సంస్థకు తెలిసిపోతుందన్న విషయంపై చాలామంది ఉద్యోగులకు అవగాహన ఉంటుందన్న విషయంలో సందేహం లేదు.



‘మూన్ లైటింగ్’ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించేందుకు ఈ రెండు మార్గాల్లో ‘విప్రో’ ఏదో ఒకటి ఎంచుకుని ఉండొచ్చని ఐటీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇలా ఉద్యోగుల సమాచారాన్ని కంపెనీలు తెలుసుకోవడం నైతికంగా సరైన విధానమా.. కాదా అనే ప్రశ్న కొత్త చర్చకు తావిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘విప్రో’ 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడం మాత్రం ఐటీ ఉద్యోగుల్లో కలవరపాటుకు కారణమైంది. ‘మూన్ లైటింగ్’ విధానంపై మెజార్టీ ఐటీ సంస్థలు పెదవి విరిచిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఉద్యోగులు ‘మూన్‌లైటింగ్‌’ విధానంలో మరో సంస్థ కోసం పనిచేస్తున్నట్లు తెలిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఉద్యోగాల్లో నుంచి పీకి ఇంటికి పంపించేస్తామని ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు హెచ్చరించాయి.

Updated Date - 2022-10-02T02:31:19+05:30 IST