జీఎస్‌టీ వసూళ్లు రూ.1.47 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-10-02T08:49:13+05:30 IST

సెప్టెంబరు నెలకు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం రూ.1.47 లక్షల కోట్లుగా నమోదైంది.

జీఎస్‌టీ వసూళ్లు రూ.1.47 లక్షల కోట్లు

సెప్టెంబరు నెలకు 26 శాతం వృద్ధి నమోదు 

మున్ముందు నెలల్లో మరింత పెరిగే అవకాశం 

వరుసగా ఏడోసారీ రూ.1.40 లక్షల కోట్ల ఎగువనే..  

న్యూఢిల్లీ: సెప్టెంబరు నెలకు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం రూ.1.47 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే 26 శాతం అధికమిది. అంతేకాదు,  జీఎస్‌టీ ఆదాయం రూ.1.40 లక్షల కోట్ల ఎగువ స్థాయిలో నమోదవడం ఇది వరుసగా ఏడో నెల. పన్ను వసూళ్ల వృద్ధి, జీఎస్‌టీ పోర్టల్‌ స్థిరత్వానికిదే నిదర్శనమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. పండగల సీజన్‌ కావడంతో మున్ముందు నెలల్లో జీఎస్‌టీ ఆదాయం మరింత పెరగనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసిన డేటా ప్రకారం..  2022 సెప్టెంబరులో జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.1,47,686 కోట్లుగా ఉండగా.. అందులో సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) వాటా రూ.25,271 కోట్లు. స్టేట్‌ జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) రూ.31,813 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) రూ.80,464 కోట్లుగా ఉంది. సెస్‌ వసూళ్లు రూ.10,137 కోట్లుగా ఉన్నాయి. కాగా, ఆర్థిక శాఖ ఐజీఎస్‌టీ నుంచి రూ.31,880 కోట్లు సీజీఎస్‌టీకి, రూ.27,403 కోట్లు ఎస్‌జీఎస్‌టీకి సెటిల్‌ చేసింది. అనంతరం సీజీఎస్‌టీ ఆదాయం రూ.57,151 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ ఆదాయం రూ.59,213 కోట్లకు చేరుకున్నాయి.


 ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1.67 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ ఆగస్టులో రూ.1.43 లక్షల కోట్లు వసూలయ్యాయి. కాగా, ఆగస్టులో 7.7   కోట్ల ఈ-వే బిల్లులను జారీ చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 


తెలంగాణలో రూ.3,915 కోట్లు

 హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) భారీగా వసూలైంది. సెప్టెంబరు  నెలలో మొత్తం రూ.3,915 కోట్లు వసూలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో  వసూలైన రూ.3,494 కోట్లతో పోల్చితే ఇది 12 శాతం ఎక్కువని తెలిపింది.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జీఎస్‌టీ వసూళ్లలో ఏకంగా 21 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది సెప్టెంబరులో రూ.2,595 కోట్లుగా ఉన్న జీఎస్‌టీ వసూళ్లు  ఈ ఏడాది సెప్టెంబరు లో ఏకంగా రూ.3,132 కోట్లకు పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 

Updated Date - 2022-10-02T08:49:13+05:30 IST