టాప్‌-3లోకి అదానీ

ABN , First Publish Date - 2022-08-31T09:38:34+05:30 IST

భారత కుబేరుడు, అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకారు.

టాప్‌-3లోకి అదానీ

ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి అదానీ గ్రూప్‌ అధిపతి 

ఈ ఘనత సాధించిన తొలి ఆసియా వ్యక్తి 

రూ.11 లక్షల కోట్లకు పెరిగిన ఆయన ఆస్తి 


భారత కుబేరుడు, అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకారు. టాప్‌-3లో చోటు దక్కించుకున్న తొలి ఆసియా వ్యక్తి ఈయనే. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకులు జాక్‌ మా కూడా గతంలో ప్రపంచ రిచ్‌ లిస్ట్‌లో వేగంగా పైకి ఎగబాకినప్పటికీ, టాప్‌-3 స్థాయికి మాత్రం చేరుకోలేకపోయారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ రియల్‌ టైం ఇండెక్స్‌ ప్రకారం.. అదానీ కుటుంబ ఆస్తి సోమవారం నాటికి మరో 112 కోట్ల డాలర్లు (రూ.8,960 కోట్లు) పెరిగి మొత్తం 13,740 కోట్ల డాలర్లకు (రూ.10.99 లక్షల కోట్లు) చేరుకుంది. కాగా, వరల్డ్‌ రిచ్‌ లిస్ట్‌లో ఇప్పటివరకు మూడో స్థానంలో కొనసాగిన లూయీ విట్టోన్‌ చీఫ్‌ బెర్నార్డ్‌ ఆర్నో సంపద 137 కోట్ల డాలర్లు తగ్గి 13,600 కోట్ల డాలర్లకు పడిపోయింది.


దాంతో అదానీ నాలుగు నుంచి మూడో స్థానానికి చేరుకోగా.. ఆర్నో మూడు నుంచి నాలుగో స్థానానికి జారుకున్నారు. ప్రస్తుతం టెస్లా చీఫ్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌, అమెజాన్‌ వ్యవస్థాపకులు జెఫ్‌ బెజోస్‌ మాత్రమే అదానీ కంటే ముందున్నారు. ఏకంగా 25,100 కోట్ల డాలర్ల ఆస్తితో మస్క్‌ ప్రపంచ నం.1గా కొనసాగుతుండగా.. బెజోస్‌ 15,300 కోట్ల డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. ఆయా దేశాల స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లోని ప్రపంచ కుబేరులకు చెందిన కంపెనీల షేర్ల ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా వారి సంపద గణాంకాలను బ్లూంబర్గ్‌ రోజూవారీగా సవరిస్తుంటుంది.   


ఈ ఏడాదిలో రూ.4.87 లక్షల కోట్లు అప్‌ 

గౌతమ్‌ అదానీ సంపద ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6,090 కోట్ల డాలర్లు (రూ.4.87 లక్షల కోట్లు) పెరిగింది. ఈ ఏడాది అత్యధిక సంపద పోగేసుకున్న ప్రపంచ కుబేరుల్లో అదానీదే అగ్రస్థానం. అంతేకాదు, ఈ ఏడాది సంపద వృద్ధిలో రెండో స్థానంలో ఉన్న వ్యక్తి కంటే కూడా ఐదు రెట్లు అధికంగా ఆర్జించారు. స్టాక్‌ మార్కెట్లో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు ఈ ఏడాది భారీగా పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. ప్రస్తుతం అదానీ గ్రూప్‌నకు చెందిన 7 కంపెనీలు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాయి. అందులో అదానీ విల్మర్‌ ఈ ఏడాదిలోనే లిస్టయింది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటివరకు గ్రూప్‌లోని 5 లిస్టెడ్‌ కంపెనీల షేర్ల ధరలు కనీసం 1000 శాతం పెరిగాయి. దాంతో గ్రూప్‌ మార్కెట్‌ విలువ ఈ రెండేళ్లకు పైగా కాలంలో రూ.17.44 లక్షల కోట్లు పెరిగింది. 2020 మార్చి 31న రూ.1.31 లక్షల కోట్లుగా ఉన్న అదానీ గ్రూప్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌.. 2022 ఆగస్టు 29 నాటికి రూ.18.75 లక్షల కోట్లకు చేరుకుంది. 


ఇక బెజోస్‌ స్థానంపై గురి!

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు మున్ముందూ ఇదే జోరును కొనసాగించగలిగితే, ఈ ఏడాది చివరికల్లా ఆయన బెజోస్‌ను సైతం వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ముకేశ్‌ అంబానీని వెనక్కి నెట్టి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అదానీ ఎదిగారు. ఏప్రిల్‌లో ఆయన సంపద 10,000 కోట్ల డాలర్లు మైలురాయిని దాటింది. గత నెలలో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ను అధిగమించి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకోగలిగారు. అయితే, బిల్‌గేట్స్‌, బెర్క్‌షైర్‌ హ్యాత్‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌లు ఈ ఏడాది తమ సంపదలో మరికొంత విరాళంగా ఇవ్వడంతో రిచ్‌ లిస్ట్‌ ర్యాంకింగ్స్‌లో కిందికి జారుకున్నారు. అదానీ కూడా ఈ జూన్‌లో తన 60వ పుట్టిన రోజు సందర్భంగా సామాజిక కార్యక్రమాల కోసం రూ.60 వేల కోట్లు విరాళంగా ప్రకటించారు. కానీ, ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. 


అంబానీ@  11

భారత నం.2 కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మాత్రం ప్రపంచ శ్రీమంతుల లిస్ట్‌లో 11వ స్థానానికి పరిమితమయ్యారు. సోమవారం నాడు ముకేశ్‌ సంపద 83.6 కోట్ల డాలర్లు (రూ.6,688 కోట్లు) తగ్గి 9,190 కోట్ల డాలర్లకు (రూ.7.35 లక్షల కోట్లు) జారుకుంది.. ఈ ఏడాది సంపద వృద్ధిలో అదానీతో పోలిస్తే అంబానీ చాలా వెనకబడ్డారు. 2022లో ఇప్పటివరకు అంబానీ నికరంగా 196 కోట్ల డాలర్లు (రూ.15,680 కోట్లు) మాత్రమే ఆర్జించగలిగారు. 

Read more