Forex Reserves: వరుసగా ఏడవ వారం తగ్గిన విదేశీ మారక నిల్వలు

ABN , First Publish Date - 2022-09-26T01:39:33+05:30 IST

వరుసగా 7వ వారంలో కూడా భారత విదేశీ మారక నిల్వలు (foreign exchange reserves) పతనమయ్యాయి.

Forex Reserves: వరుసగా ఏడవ వారం తగ్గిన విదేశీ  మారక నిల్వలు

ముంబై: వరుసగా 7వ వారంలో కూడా విదేశీ మారక నిల్వలు (foreign exchange reserves) గణనీయంగా  పతనమయ్యాయి. ఆర్బీఐ(RBI) వీక్లీ స్టాటస్టికల్ సప్లిమెంటరీ డేటా ప్రకారం.. సెప్టెంబర్ 16తో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వులు(Forex reserves) 5.219 బిలియన్ డాలర్ల మేర తగ్గి 545.652 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోయాయి. అంతక్రితం వారం 550.871 బిలియన్ డాలర్ల నుంచి ఈ స్థాయికి తగ్గాయి. కాగా గత ఏడు వారాలుగా విదేశీ మారక నిల్వలు క్రమంగా పతనమవుతున్నాయి. వారం వ్యవధిలో మొత్తం 28.223 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. రూపాయి విలువ క్షీణిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ డాలర్లను విక్రయించడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. ప్రస్తుతం డాలర్ మారకంలో రూపాయి విలువ 80కి దిగువున ఉన్న విషయం తెలిసిందే. 


రూపాయి విలువ క్షీణత నేపథ్యంలో స్థిరత్వం కోసం ఆర్బీఐ రంగంలోకి దిగిందని, ఈ కారణంగానే ఫారెన్ ఎక్స్చేంజీ రిజర్వ్స్ తగ్గుతున్నాయని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. దేశీయ కరెన్సీ రూపాయి ప్రస్తుతం జీవితకాల కనిష్ఠ స్థాయిలో రూ.80 కంటే తక్కువగా ఉందని ప్రస్తావించారు.  మరోవైపు గడిచిన వారంలో విదేశీ మారక నిల్వలు 30 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. 

Updated Date - 2022-09-26T01:39:33+05:30 IST