23 నెలల కనిష్ఠానికి విదేశీ మారక నిల్వలు

ABN , First Publish Date - 2022-09-11T09:43:41+05:30 IST

భారత విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు 23 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.

23 నెలల కనిష్ఠానికి విదేశీ మారక నిల్వలు

ఈ నెల 2 నాటికి 794 కోట్ల డాలర్లు తగ్గి 55,310 కోట్ల డాలర్లకు చేరిక

న్యూఢిల్లీ: భారత విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు 23 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తాజా డేటా ప్రకారం.. ఈ నెల 2తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు మరో 794.1 కోట్ల డాలర్ల మేర తగ్గి 55,310.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.44,24,840 కోట్లు)కు పరిమితమయ్యాయి. ఫారెక్స్‌ నిల్వలు తగ్గడం వరుసగా ఇది ఐదో వారం. గతనెల 26తో ముగిసిన వారంలో నిల్వలు 300.7 కోట్ల డాలర్లు తగ్గగా.. అంతక్రితం వారంలో 668.7 కోట్ల డాలర్ల తగ్గుదల నమోదైంది. పతనమవుతున్న రూపాయి మారకం రేటును బలపర్చేందుకు ఫారెక్స్‌ మార్కెట్లోకి ఆర్‌బీఐ భారీగా డాలర్లను విడుదల చేస్తుండటమే ఇందుకు కారణం. కాగా ఈ నెల 2వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వల్లో మెజారిటీ వాటా కలిగిన విదేశీ కరెన్సీల విలువ 652.7 కోట్ల డాలర్లు తగ్గి 49,211.7 కోట్ల డాలర్లకు పడిపోయాయి. కాగా, బంగారం నిల్వ లు 133.9 కోట్ల డాలర్ల మేర తగ్గి 3,830.3 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వద్ద దేశ ప్రత్యేక డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) విలువ 5 కోట్ల డాలర్లు తగ్గి 1,778.2 కోట్ల డాలర్లకు జారుకోగా..ఐఎంఎఫ్‌ వద్ద దేశ నిల్వల స్థాయి 2.4 కోట్ల డాలర్లు క్షీణించి 490.2 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. 

Read more