aadhar safty: అవసరాన్ని బట్టి ఆధార్ కార్డు వివరాలు వెల్లడిస్తున్నారా?.. ఇలా చేస్తున్నారా లేదా..

ABN , First Publish Date - 2022-09-28T01:46:28+05:30 IST

సిమ్ కార్డు కొనుగోలు నుంచి బ్యాంక్ అకౌంట్ తెరవడం వరకు ఆధార్ కార్డు(Aadhar Card) లేనిదే పనులేమీ జరగవు.

aadhar safty: అవసరాన్ని బట్టి ఆధార్ కార్డు వివరాలు వెల్లడిస్తున్నారా?.. ఇలా చేస్తున్నారా లేదా..

సిమ్ కార్డు కొనుగోలు నుంచి బ్యాంక్ అకౌంట్ తెరవడం వరకు ఆధార్ కార్డు(Aadhar Card) లేనిదే పనులేమీ జరగవు. ఆధార్ కార్డు లేకుంటే ప్రభుత్వ ప్రయోజనాలు కూడా దరిచేరవు. స్కూల్ లేదా కాలేజీల్లో చేరడం , అధికారిక పనులేవైనా సరే ఆధార్ కార్డు ఉండి తీరాల్సిందే. భారతీయ పౌరులకు గుర్తింపునకు ఎంతో ముఖ్యమైన గుర్తింపుకార్డు ఇది. అయితే ఆధార్ వివరాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వ్యక్తిగత గోప్యత, డేటా భద్రత విషయంలో జనాల్లో సందేహాలు వీడడం లేదు. గోప్యత అంశంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. గుర్తింపు పత్రమే కాబట్టి ఆధార్ వివరాలను షేర్ చేసినా ఇబ్బందేమీ లేదని యుఐడీఏఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) 2018లో చెప్పినప్పటికీ.. వ్యక్తిగత వివరాల గోప్యత విషయంలో జనాలు సంతృప్తికరంగా లేరు. ఆధార్ వినియోగం విషయంలో అపోహలు, వేర్వేరు భావనలు జనాలను ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. అలా ఆందోళనకు గురయ్యే వ్యక్తులు ఆధార్ వివరాలు పంచుకునే సమయంలో కొన్ని పాటించాల్సిన, పాటించకూడనవి కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటో మీరు కూడా తెలుసుకోండి..


ఇవి తప్పకుండా గుర్తుపెట్టుకోండి..

- ఆధార్ నంబర్‌ని ఇవ్వడం ఇష్టంలేకపోతే వీఐడీ (Virtual Identifier)ని జనరేట్ చేసుకునే సౌలభ్యాన్ని యుఐడీఏఐ కల్పిస్తోంది.  వీఐడీని సులభంగా జనరేట్ చేయవచ్చు. ఆధార్ నంబర్‌కు బదులుగా దీనిని ఉపయోగించవచ్చు. వీఐడీ నంబర్ ఏ రోజుకి ఆ రోజు మారిపోతుంది కాబట్టి వ్యక్తిగత వివరాల గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదు.

- యుఐడీఏఐ వెబ్‌సైట్ లేదా ఎం-ఆధార్ యాప్‌పై గత ఆరు నెలల ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని చెక్ చేసుకోవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు డేటా చెక్ చేసుకుంటే ఎవరు అథెంటికేషన్ పొందారో తెలుసుకోవచ్చు.

- యుఐడీఏఐ ఈ-మెయిల్ ద్వారా ఆధార్ సమాచారాన్ని  అందిస్తుంది. కాబట్టి ఆధార్ నంబర్‌తో ఈ-మెయిల్‌ని అప్‌డేట్ చేసుకోవాలి.

- కొంతకాలంపాటు ఆధార్ వినియోగం ఉండదని భావిస్తే ఆధార్‌ని లాక్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ లాకింగ్‌కు కూడా అవకాశం ఉంది. అవసరమైనప్పుడు వెంటనే ఆధార్‌ని అన్‌లాక్ చేసి ఉపయోగించుకోవచ్చు. 

- మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, పాన్‌కార్డ్, రేషన్ కార్డ్ వివరాలు ఉపయోగించే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో ఆధార్ ఉపయోగించేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండండి.

- ఒకవేళ ఆధార్ దుర్వినియోగం జరిగిందని అనుమానం వచ్చినా.. ఏదైనా సందేహాలను నివృత్తి చేసుకునేందుకైనా టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1947కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఈ-మెయిల్ ద్వారా అయితే help@uidai.gov.in ను సంప్రదించాలి.


ఇవి చేయకండి..

- ఆధార్ కార్డు లేదా పీవీసీ కార్డు లేదా కాపీలను ఎక్కడా మర్చిపోకండి.

- పబ్లిక్‌గా ఆధార్ వివరాలను షేర్ చేయడం మానుకోండి. 

- మీ ఆధార్ ఓటీపీని అనధికారిక సంస్థలకు అస్సలు వెల్లడించొద్దు.

- మీ ఎం-ఆధార్‌ని ఎవరితోనూ పంచుకోవద్దు.

Updated Date - 2022-09-28T01:46:28+05:30 IST