‘ఆటో’కు పండగ కళ!

ABN , First Publish Date - 2022-10-02T08:53:05+05:30 IST

దేశీయ వాహన మార్కెట్లో పండగ జోష్‌ స్పష్టం గా కన్పిస్తోంది. గత నెలలో ఆటోమొబైల్‌ కంపెనీల టోకు విక్రయాలు భారీగా పెరిగాయి.

‘ఆటో’కు పండగ కళ!

 సెప్టెంబరులో భారీగా పెరిగిన  వాహన టోకు విక్రయాలు 

తొలిసారిగా 10 లక్షలు దాటిన త్రైమాసిక అమ్మకాలు 

న్యూఢిల్లీ: దేశీయ వాహన మార్కెట్లో పండగ జోష్‌ స్పష్టం గా కన్పిస్తోంది. గత నెలలో ఆటోమొబైల్‌ కంపెనీల టోకు విక్రయాలు భారీగా పెరిగాయి. కొన్ని కంపెనీలు అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను నమోదు చేసుకోగలిగాయి. పండగ సీజన్‌ గిరాకీతో పాటు చిప్‌ల సరఫరా మెరుగుపడటంతో ఉత్పత్తి పుంజుకోవడమూ ఇందుకు తోడ్పడింది. సెప్టెంబరులో ఇండస్ట్రీ మొత్తం విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 91 శాతం ఎగబాకి 3,55,946 యూనిట్లకు పెరిగాయి. 

దాంతో, ఈ ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబరు) ఇండస్ట్రీ అమ్మకాలు తొలిసారిగా 10 లక్షల యూనిట్ల మైలురాయిని దాటాయి. అంతేకాదు, ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (ఏప్రిల్‌-సెప్టెంబరు) అమ్మకాలు 19.37 లక్షల యూనిట్లకు పెరిగాయి. ఇప్పటివరకు ఆరు నెలలకు నమోదైన అత్యధిక విక్రయాలివే. 


కారు.. యమ జోరు: దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ దేశీయ విక్రయాలు గతనెలకు రెట్టింపునకు పైగా పెరిగి 1,48,380కి చేరుకున్నాయి. గడిచిన 42 నెలల్లో ఇది రెండో అత్యుత్తమమని మారుతి సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. గత ఏడాది సెప్టెంబరులో కంపెనీ దేశీయ సేల్స్‌ 63,111 యూనిట్లుగా నమోదయ్యాయి. గత నెలలో మారుతి సుజుకీ మార్కెట్‌ వాటా 42 శాతానికి చేరుకుందని, 2021 సెప్టెంబరుతో పోలిస్తే 7 శాతం పెరిగిందని శ్రీవాస్తవ వెల్లడించారు. రెండో అతిపెద్ద కార్ల కంపెనీ హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా సేల్స్‌ 50 శాతం పెరిగి 49,700 యూనిట్లకు పెరగగా.. టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ విక్రయాలు 47,654 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీకి ఇప్పటివరకివే అత్యుత్తమ నెలవారీ అమ్మకాలు. గత నెలలో కియా ఇండియా సైతం బెస్ట్‌ మంత్లీ సేల్స్‌ (25,857 యూనిట్లు)ను నమోదు చేసుకుంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా  విక్రయాలు 168 శాతం వృద్ధితో 34,508 యూనిట్లకు చేరుకున్నాయి. హోండా కార్స్‌ అమ్మకాలు 29 శాతం పెరగగా.. టయోటా విక్రయాలు 66 శాతం వృద్ధి చెందాయి. ఫోక్స్‌వేగన్‌ సేల్స్‌ 60 శాతం పుంజుకున్నాయి. స్కోడా, ఎంజీ మోటార్స్‌ 17 శాతం చొప్పున పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. నిస్సాన్‌ సేల్స్‌ మాత్రం 16.6 శాతం తగ్గాయి. 


టూవీలర్లూ ఫర్వాలేదు: ద్విచక్ర వాహనాల విభాగంలో అతిపెద్ద కంపెనీ హీరో మోటోకార్ప్‌ దేశీయ అమ్మకాలు 1.5 శాతం పెరిగి 5,07,690 యూనిట్లకు చేరుకున్నాయి. టీవీఎస్‌ మోటార్స్‌ 16 శాతం, సుజుకీ మోటార్‌సైకిల్స్‌ 27.55 శాతం వృద్ధిని కనబర్చాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ విక్రయాలు రెండు రెట్లకు పైగా పెరిగాయి. 

Updated Date - 2022-10-02T08:53:05+05:30 IST