గ్రామీణ ఔత్సాహికులకు ప్రోత్సాహం

ABN , First Publish Date - 2022-09-11T09:42:10+05:30 IST

చిన్న పట్టణాల్లోనూ ఔత్సాహికులు ఉంటా రు. వారికీ వినూత్న వ్యాపార ఆలోచనలు వస్తాయి.

గ్రామీణ ఔత్సాహికులకు ప్రోత్సాహం

మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దుతున్న ‘ఫ్రీడమ్‌’

900 కోర్సులు అందిస్తున్న యాప్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): చిన్న పట్టణాల్లోనూ ఔత్సాహికులు ఉంటా రు. వారికీ వినూత్న వ్యాపార ఆలోచనలు వస్తాయి. వారికి కావాల్సిందల్లా ఆయా వ్యాపారాల్లో శిక్షణ, మార్కెటింగ్‌ అవకాశాలు తదితరాలపై అవగాహన కల్పించడం. ఈ లక్ష్యంతో రైతులు, హోమ్‌ మేకర్లు, చిన్నచిన్న వ్యాపారవేత్తలను మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ‘ఫ్రీడమ్‌’ యాప్‌ తీర్చిదిద్దుతోంది. తేనెటీగల పెంపకం, రెస్టారెంట్‌ వ్యాపారం, ఆయిల్‌మిల్‌ వ్యాపారం, బేకరీ, హోమ్‌ మేడ్‌ చాకోలేట్‌, పచ్చళ్ల తయారీ, యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభం వంటి  వ్యాపారాలను చేపట్టడానికి 900 కోర్సులను అందిస్తున్నామని ఫ్రీడమ్‌ యాప్‌ను నిర్వహిస్తున్న సువిజన్‌ హోల్డింగ్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ సీఎస్‌ సుధీర్‌ తెలిపారు.


రూ.60 కోట్ల పెట్టుబడులు

యాప్‌, సేవల విస్తరణపై ఇప్పటివరకూ రూ.60 కోట్ల వర కూ పెట్టుబడులు పెట్టారు. సైయెంట్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి, హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇండియన్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా గతంలో పని చేసిన శ్రీని కొప్పోలు తదితరులు ఇందులో పెట్టుబడులు పెట్టారు.


వచ్చే రెండేళ్లలో.. 

గత 28 నెలల్లో యాప్‌ ద్వారా శిక్షణ పొంది 1.95 లక్షల మంది వివిధ వ్యాపారాలను ప్రారంభించారని సుధీర్‌ చెప్పారు. ప్రస్తుతం వ్యాపారాలను ప్రారంభించడానికి మాత్రమే శిక్షణ ఇస్తున్నాం. భవిష్యత్తులో యాప్‌ ద్వారా శిక్షణ పొందిన మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు మార్కెట్‌ ప్లేస్‌ ప్లాట్‌ఫామ్‌ను కల్పిస్తాం. వచ్చే రెండేళ్లలో 10 లక్షల మందికి శిక్షణ ఇచ్చి వారు వ్యాపారాలు ప్రారంభించే విధంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. శిక్షణ, ఇతర అన్ని వివరాలను తెలుసుకోవడానికి మూడు నెలలకు రూ.5,000 సబ్‌స్ర్కిప్షన్‌ రుసుమును వసూలు చేస్తున్నామని.. యాప్‌కు 5.6 లక్షల మంది చందాదారులు ఉన్నారని చెప్పారు. 


28 బడ్డింగ్‌ ఔత్సాహికులకు అవార్డులు

‘ఫ్రీడమ్‌ నెస్ట్‌’ కార్యక్రమంలో భాగంగా 28 బడ్డింగ్‌ మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ.. నగరాల్లో ఉన్న వారు, సంపన్నులు మాత్రమే వ్యాపారాలు చేయగలరన్న అభిప్రాయం గతంలో ఉండేదని.. అయితే  గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా తెలివితేటలు, వినూత్న ఆలోచనలు ఉంటాయని అన్నారు. అటువంటి వారికి ఇప్పుడు అనేక అవకాశాలు ఉన్నాయి. ఫ్రీడమ్‌ యాప్‌ వంటివి వారిని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. 5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్‌ అడుగులు వేస్తోందని.. చిన్నచిన్న వ్యాపార సంస్థలను స్థాపించి మరింత మంది మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్‌ వస్తేనే ఇది సాధ్యమవుతుందని బీవీఆర్‌ మోషన్‌ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో వుయ్‌ హబ్‌ సీఈఓ ఆర్‌ దీప్తి తదితరులు పాల్గొన్నారు. 

Read more