vivo మనీలాండరింగ్ ఆరోపణలపై... కొనసాగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ

ABN , First Publish Date - 2022-07-07T23:43:07+05:30 IST

చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు కొనసాగుతోంది.

vivo మనీలాండరింగ్ ఆరోపణలపై...  కొనసాగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ

న్యూఢిల్లీ : చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు కొనసాగుతోంది. ఐదేళ్ళ క్రితం(2017) నుండి... భారతీయ యూనిట్ దాదాపు రూ. 62 వేల కోట్లను చైనాలోని తన మాతృ సంస్థలకు బదిలీ చేసిందని ఈడీ  వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కాలంలో వివో ఇండియా మొత్తం టర్నోవర్ దాదాపు రూ. 1.25 లక్షల కోట్లుగా సూచిస్తోన్న డేటాను ED దర్యాప్తులో కనుగొన్నట్లు సోర్సెస్ వర్గాలు వెల్లడించాయి. వివో ఇండియా తన బ్యాలెన్స్ షీట్‌లో లాభాన్ని ఖర్చుగా ఎందుకు ప్రకటించింది ? చైనాకు గణనీయమైన డబ్బును ఎందుకు బదిలీ చేసింది ? అన్న అంశాలపై ఏజెన్సీ దర్యాప్తు చేస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. జూలై 5న వివో మరియు సంబంధిత సంస్థలపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా దేశవ్యాప్తంగా 44 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 


జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న కంపెనీ పంపిణీదారుపై ఇటీవల ఢిల్లీ పోలీసులు(ఆర్థిక నేరాల విభాగం) ఎఫ్‌ఐఆర్‌ను స్వీకరించిన తర్వాత... ED మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. ఆ కంపెనీలో కొంతమంది చైనా వాటాదారులు డూప్లికేట్ గుర్తింపు పత్రాలను సృష్టించారని ఆరోపణలున్నాయి. షెల్, లేదా... పేపర్ కంపెనీలను ఉపయోగించి నిధులను లాండరింగ్ చేయడానికి ఈ ప్రక్రియ  ఫోర్జరీ జరిగినట్లుగా ED అనుమానిస్తోంది. ఇదిలావుండగా...  చైనా కంపెనీలపై భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల బహుళ విచారణలు దేశంలో పెట్టుబడులు పెట్టే, నిర్వహణలో ఉన్న  విదేశీ సంస్థల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. 


ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ తన విచారణను ముగించి అధికారిక అభియోగాలను దాఖలు చేసినందున, ఈ విషయానికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడవుతాయని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో, విదేశీమారకపు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ ఇండియాకు చెందిన రూ. 5,551 కోట్ల విలువైన డిపాజిట్లను జప్తు చేయాలని ED ఆదేశించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-07-07T23:43:07+05:30 IST