120 డాలర్లకు క్రూడ్‌!?

ABN , First Publish Date - 2022-02-23T08:30:26+05:30 IST

ముడి చమురు కొండెక్కుతోంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం తప్పకపోవచ్చన్న భయాలతో క్రూడ్‌ ధర సెంచరీకి చేరువైంది. ...

120 డాలర్లకు క్రూడ్‌!?

పోటెత్తుతున్న ముడి చమురు

సంచరీకి చేరువైన ధర 

 మున్ముందు మరింత పైకే..  

  మరో 5-20 శాతం పెరగవచ్చని 

   కమోడిటీ విశ్లేషకుల అంచనా


ముడి చమురు కొండెక్కుతోంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం తప్పకపోవచ్చన్న భయాలతో క్రూడ్‌ ధర సెంచరీకి చేరువైంది. బ్రెంట్‌ రకం ముడి చమురు ఒకదశలో 4.11 డాలర్లు (4.30 శాతం) పెరిగి 99.50 డాలర్లు పలికింది. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియేట్‌ (డబ్ల్యూటీఐ) క్రూడాయిల్‌ 3.64 డాలర్లు (4 శాతం) ఎగబాకి 94.16 డాలర్లకు చేరింది. 2014 సెప్టెంబరు తర్వాత ముడి చమురు ధరలకు మళ్లీ ఇదే గరిష్ఠ స్థాయి. గత ఏడాది డిసెంబరు ప్రారంభంలో 70 డాలర్ల స్థాయిలో ట్రేడైన బ్రెంట్‌ క్రూడ్‌.. గడిచిన రెండున్నర నెలల్లో దాదాపు 40 శాతం వరకు పుంజుకుంది. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే ముడి చమురు మరింత పోటెక్కడం ఖాయమని, ధరలు మరో 5-20 శాతం వరకు ఎగబాకవచ్చని ్జ్ఞఅంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే, యుద్ధ పరిణామాలపై ఈ పెరుగుదల ఆధారపడి ఉంటుందని వారు పేర్కొన్నారు. సంక్షోభ తీవ్రత ఆధారంగా బ్రెంట్‌ క్రూడ్‌ 105 డాలర్ల నుంచి 120 డాలర్ల వరకు ఎగబాకవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (బొఫా) గ్లోబల్‌ రీసెర్చ్‌ తాజా నోట్‌లో అంచనా వేసింది. ఉద్రిక్తతలు తగ్గుముఖం పడితే మాత్రం ధర 2-4 డాలర్ల మేర తగ్గవచ్చని అంటోంది.  రెండు దేశాల మధ్య యుద్ధ వాతావారణం 3-4 నెలల పాటు ఇలాగే కొనసాగితే, ముడిచమురు ధరలు 110-115 డాలర్ల స్థాయిని సులువుగా దాటే అవకాశం ఉందని జేపీ మోర్గాన్‌ కమోడిటీస్‌ విభాగ అధిపతి జహంగీర్‌ అజీజ్‌ అంచనా వేశారు. 


9 నెలల గరిష్ఠానికి బంగారం 

దేశీయంగా బంగారం ధరలు 9 నెలల గరిష్ఠాన్ని తాకాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీక్స్‌)లో మంగళవారం గోల్డ్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు ధర ఒక దశలో రూ.382 (0.76 శాతం) ఎగబాకి రూ.50,460కి చేరుకుంది. వెండి ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు రూ.638 (1.02 శాతం) పెరుగుదలతో రూ.65,153 పలికింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లోనూ ఈ విలువైన లోహాల ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం రూ.552 పెరిగి రూ.50,518కు చేరుకోగా.. కిలో వెండి రూ.1,012 ఎగబాకి రూ.64,415 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింత ఎగబాకడంతో పాటు రూపాయి క్షీణత ఇందుకు కారణమైంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య సంక్షోభం మరింత తీవ్రం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్‌కు డిమాండ్‌ పెరిగింది. ఒక దశలో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం 1,910 డాలర్లకు చేరుకోగా.. వెండి 24.12 డాలర్ల వద్ద ట్రేడైంది. 

Read more