ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ఆల్‌టైం రికార్డు

ABN , First Publish Date - 2022-03-18T05:54:20+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 48.41 శాతం వృద్ధి చెంది సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి...

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో  ఆల్‌టైం రికార్డు

ఈ ఆర్థిక సంవత్సరంలో 48% వృద్ధితో రూ.13.63 లక్షల కోట్లుగా నమోదు 

41% పెరిగిన ముందస్తు పన్ను చెల్లింపులు 


న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 48.41 శాతం వృద్ధి చెంది సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముంద స్తు పన్ను చెల్లింపులు దాదాపు 41 శాతం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. కరోనా రెండు, మూడో దశల వ్యాప్తి ప్రభావ నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిర పునరుద్ధరణ కనబర్చిందనడానికి ఈ గణాంకాలు అద్దంపడుతున్నాయి.


2021 ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరంలో 2022 మార్చి 16 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.63 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఇదే కాలానికి వసూలైన రూ.9.18 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులతో పోలిస్తే 48 శాతం అధికమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా సంక్షోభం ప్రారంభానికి ముందు ఆర్థిక సంవత్సరమైన 2019-20లో ఇదే సమయానికి నమోదైన రూ.9.56 లక్షల కోట్ల వసూళ్లతో పోల్చినా 42.5 శాతం అధికమిది. వ్యక్తిగత, కార్పొరేట్‌ ఆదాయ పన్నుతో పాటు స్థిరాస్తి పన్ను, వారసత్వ పన్ను, గిఫ్ట్‌ ట్యాక్స్‌ ఈ ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వస్తాయి. మరిన్ని విషయాలు.. 


ఈనెల 15తో గడువు ముగిసేనాటికి ముందస్తు పన్ను చెల్లింపులు 40.75% వృద్ధితో రూ.6.62లక్షల కోట్లకు పెరిగాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.1.87 లక్షల కోట్ల పన్ను రిఫండ్‌ చేసింది. 

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 53 శాతం వాటా కార్పొరేట్‌ ట్యాక్స్‌దే. వ్యక్తిగత ఆదాయం పన్ను (సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌తో కలిపి) వసూళ్ల వాటా 47 శాతంగా ఉంది. 

ఈసారి ప్రత్యక్ష పన్ను వసూళ్లు బడ్జెట్‌ అంచనాలను మించిపోయాయి. 2021-22కు గాను ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.11.08 లక్షల కోట్లుగా ఉండవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తొలుత బడ్జెట్‌లో అంచనా వేశారు. తర్వాత అంచనాను రూ.12.50 లక్షల కోట్లకు పెంచారు. 


ఆదాయ పన్ను (ఐటీ) శాఖ చరిత్రలో అత్యధిక వార్షిక వసూళ్లివే. గత ఆల్‌టైం రికార్డుతో పోలిస్తే దాదాపు రూ.2.5 లక్షల కోట్లు అధికం. 

- సీబీడీటీ చైర్మన్‌ జెబీ మొహాపాత్ర 





Read more