పండగ పూట ఈఎంఐల మంట

ABN , First Publish Date - 2022-10-01T06:45:58+05:30 IST

సగటు జీవిపై వడ్డీల గుదిబండ పడింది. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలన్నీ మరింత ప్రియం కానున్నాయి.

పండగ పూట ఈఎంఐల మంట

రెపో రేటు 0.5 శాతం పెంచిన రిజర్వు బ్యాంకు

2019 ఏప్రిల్‌ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరిక

గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత ప్రియం

కార్పొరేట్ల రుణ సమీకరణ భారమూ పెరిగే ముప్పు

వరుసగా నాలుగు విడతల్లో 1.9ు పెరిగిన రెపో రేటు

వృద్ధిరేటు అంచనాలో కోత.. ద్రవ్యోల్బణం యథాతథం

ఆఫ్‌లైన్‌ పేమెంట్‌ అగ్రిగేటర్లూ ఇక ఆర్బీఐ పరిధిలోకి 

ఆర్థికవ్యవస్థలో లిక్విడిటీ తగ్గుతుందనే భయాలు వద్దు

5 లక్షల కోట్ల నిధులు ఉన్నాయి: ఆర్బీఐ గవర్నర్‌


పండగ రోజుల్లో సామాన్యుడికి ఆర్బీఐ దుర్వార్త వినిపించింది! సగటు వేతన జీవులను ఇప్పటికే కుంగదీస్తున్న వడ్డీల గుదిబండపై మరింత భారం పడేలా.. రెపో రేటును 0.5 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత ప్రియం కానున్నాయి. దడ పుట్టిస్తున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు గత మూడు విడతలుగా రెపో రేటును పెంచుతూ వస్తున్న ఆర్బీఐ.. వరుసగా నాలుగోసారి కూడా అదే నిర్ణయం తీసుకోవడంతో మొత్తమ్మీద రెపో రేటు 1.9 శాతం మేర పెరిగి 5.9 శాతానికి చేరుకుంది. 2019 ఏప్రిల్‌ తర్వాత రెపో రేటు గరిష్ఠ స్థాయి ఇదే!


అప్పు ‘కాలుతుంది’

పండగ సీజన్‌లో ఈఎంఐల గుదిబండ.. రెపో రేటు 0.5ు పెంచిన ఆర్‌బీఐ

వృద్ధి రేటు అంచనాలో కోత.. ద్రవ్యోల్బణ అంచనా యథాతథం


ముంబై: సగటు జీవిపై వడ్డీల గుదిబండ పడింది. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలన్నీ మరింత ప్రియం కానున్నాయి. అలాగే రెపో రేటు పెంపు కార్పొరేట్ల రుణ సమీకరణ భారాన్ని కూడా పెంచుతుంది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటించిన నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును మరో 0.50 శాతం పెంచింది. దీంతో ఇప్పుడు రెపో రేటు 5.90 శాతానికి చేరింది. రెపో రేటు 2019 ఏప్రిల్‌ తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. అయినప్పటికీ ప్రస్తుత రేటు ఆ నాటి గరిష్ఠ స్థాయి కన్నా ఇంకా దిగువనే ఉంది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశాల్లో దేశంలో ప్రస్తుత ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు, విదేశీ పరిణామాలు సహా ప్రస్తుత ఆర్థిక స్థితిని అన్ని కోణాల్లోనూ సమీక్షించిన అనంతరం ద్రవ్యోల్బణం అదుపునకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. రెపో రేటును అందరూ ఊహిస్తున్నట్టుగానే 0.50 శాతం పెంచేందుకు మెజారిటీ నిర్ణయం తీసుకుంది.


ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. మే నెలలో రెండు ద్రవ్యవిధానాల నడుమ నిర్వహించిన అత్యవసర సమావేశంలో రెపో రేటును పెంచిన తర్వాత ఆ తరహా నిర్ణయం తీసుకోవడం వరుసగా ఇది నాలుగో సారి. దీంతో వరుసగా నాలుగు విడతలుగా రెపో రేటును 1.90 శాతం పెంచినట్టయింది. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిల్లో కొనసాగేందుకు అనుమతించినట్టయితే దిగువకు ప్రసరించే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని ఎంపీసీ నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. అయితే అంతర్జాతీయ మాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు అవసరమైన ‘‘జాగ్రత్త చర్యలు’’ సమయానుకూలంగా తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే విధాన సమీక్షల్లో కూడా ద్రవ్యవిధానంలో సద్దుబాటు ధోరణి ఉపసంహరణ కొనసాగుతుందని తేల్చి చెప్పారు. వివిధ అంశాలపై ఆర్‌బీఐ ప్రకటించిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.


వృద్ధి రేటు 7 శాతమే:


2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు గతంలో ప్రకటించిన అంచనా 7.2 శాతం కాగా 7 శాతానికే పరిమితం కావచ్చు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిణామాలు, వడ్డీ రేట్ల విషయంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల దూకుడు డిమాండ్‌ను ప్రభావితం చేయవచ్చు. అయితే దేశీయంగా డిమాండ్‌ బలంగానే ఉంది. ప్రైవేట్‌ వినియోగం, పెట్టుబడుల డిమాండ్‌ గణనీయంగా పుంజుకున్నాయి. పట్టణాల్లో డిమాండ్‌ బలంగా ఉంది. గ్రామీణ డిమాండ్‌ కూడా క్రమంగా పుంజుకుంటోంది. పండగల సీజన్‌ డిమాండ్‌ను ఉత్తేజితం చేయవచ్చు. రుతుపవన వర్షపాతం కూడా దీర్ఘకాలిక సగటు కన్నా 7 శాతం పైనే ఉంది. ప్రపంచ పరిణామాలను తట్టుకోగల స్థితిలోనే భారత ఆర్థిక వ్యవస్థ ఉంది.


టోకెనైజేషన్‌:

కస్టమర్ల డేటాకు భద్రత కల్పించడం లక్ష్యంగా ప్రకటించిన టోకెనైజేషన్‌ ప్రక్రియ అక్టోబరు 1 నుంచి అమలు పరిచేందుకు వ్యవస్థ సిద్ధంగానే ఉంది. 35 కోట్ల కార్డుల టోకెనైజేషన్‌ ఇప్పటికే పూర్తయింది. సెప్టెంబరు లావాదేవీల్లో 40 శాతం ఈ విధానంలోనే జరిగాయి. ఆ లావాదేవీల విలువ రూ.63 కోట్లుంది. కొందరి అసమ్మతి కారణంగా దాన్ని మరింత వాయిదా వేసే ఆలోచన లేదు. కస్టమర్ల భద్రతే ఆర్‌బీఐ అగ్రప్రాధాన్యత.


నియంత్రణ పరిధిలోకి అగ్రిగేటర్లు:


వ్యాపార సంస్థల స్థాయిలో ముఖాముఖి లావాదేవీలకు వారధిగా నిలిచే ఆఫ్‌లైన్‌ పేమెంట్‌ అగ్రిగేటర్లు కూడా ఇక ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోకి వస్తారు. ఇక నుంచి ఇలాంటి కంపెనీలు కస్టమర్‌ కార్డుల వివరాలు స్టోర్‌ చేయడానికి వీలు లేదు. 

రికవరీ ఏజెంట్ల నియామకానికి వ్యతిరేకం కాదు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణ రికవరీ కార్యకలాపాలను ఔట్‌సోర్స్‌ చేసుకోవడానికి ఆర్‌బీఐ వ్యతిరేకం కాదు. అయితే వారు తీసుకునే చర్యలేవైనా ‘‘చట్టబద్ధంగా మాత్రమే’’ ఉండా లి. ఈ నిర్ణయం ప్రభావం నియంత్రిత సంస్థలపై ఉండదు, వారు నియమించుకునే ఏజెంట్ల పైనే ఉంటుంది. 


ద్రవ్యోల్బణం 6.7%

ద్రవ్యోల్బణం అంచనాను గతంలో ప్రకటించిన 6.7 శాతంగానే కొనసాగించడం జరుగుతోంది. విదేశీ పరిణామాల ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం కాస్త ఎక్కువగానే ఉన్నా జనవరి నుంచి అదుపులోకి రావచ్చు. అయినా ప్రభుత్వం ఆర్‌బీఐకి నిర్దేశించిన పరిధి 2-6 శాతం కన్నా అధికంగానే ఉంటుంది. విదేశాల నుంచి దిగుమతి అయిన ద్రవ్యోల్బణం ఒత్తిడులు అధికంగా ఉన్నాయి. ఆహారం, ఇంధనం ధరలు ఇంకా అధికంగానే ఉండవచ్చు.  


పాలసీ నిర్ణయాలపై కరెన్సీ కదలికల ప్రభావం ఏ మాత్రం లేదు. కరెన్సీ నిర్వహణ ఆర్‌బీఐ పరిధిలోని అంశమే. అందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం. పాలసీలో ఒక పక్క వృద్ధికి సహాయకారి అయ్యే అంశాలపై దృష్టి పెడుతూనే ద్రవ్యోల్బణం అదుపు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చాం. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ తగ్గుతుందనే భయాలు ఏ మాత్రం అవసరం లేదు, వ్యవస్థలో రూ.5 లక్షల కోట్లకు పైబడిన నిధులు అందుబాటులో ఉన్నాయి. 

- ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తి కాంత దాస్‌ 

Read more