వాణిజ్య వాహన విక్రయాల జోరు

ABN , First Publish Date - 2022-09-27T06:55:47+05:30 IST

వాణిజ్య వాహన విక్రయాలు దాదాపు కొవిడ్‌ ముందు స్థాయికి చేరాయి. 2018-19లో అత్యధికంగా 10 లక్షల పైన విక్రయాలు నమోదయ్యాయి.

వాణిజ్య వాహన విక్రయాల జోరు

కొవిడ్‌ ముందు స్థాయికి చేరిక 

ఈ ఏడాది రెండంకెల వృద్ధి: టాటా మోటార్స్‌ ఈడీ గిరీశ్‌ వాఘ్‌

దేశీయ మార్కెట్లోకి కొత్త శ్రేణి పికప్‌ వాహనాలు

ప్రారంభ ధర రూ.8.67 లక్షలు 

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వాణిజ్య వాహన విక్రయాలు దాదాపు కొవిడ్‌ ముందు స్థాయికి చేరాయి. 2018-19లో అత్యధికంగా 10 లక్షల పైన విక్రయాలు నమోదయ్యాయి. ఈ విక్రయాలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహన విక్రయాలు 82-83 శాతం వరకు ఉండనున్నాయని టాటా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (వాణిజ్య వాహనాల విభాగం) గిరీశ్‌ వాఘ్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహన విక్రయాలు ఆశావహంగా ఉన్నాయి. రెండంకెల వృద్ధి నమోదు కావచ్చని చెప్పా రు. వాణిజ్య వాహనాల విక్రయాలు వడ్డీ రేట్లు, అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, మౌలిక సదుపాయాలు మొదలైన అంశాలపై ఆధారపడతాయన్నారు. 


కొత్త పికప్‌ వాహనాల విడుదల

దేశీయ మార్కెట్లోకి పికప్‌ వాహనాలు యోఽధ 2.ఓ, ఇంట్రా వీ20 బయో ఫ్యూయల్‌, ఇంట్రా వీ50 వాహనాలను టాటా మోటార్స్‌ హైదరాబాద్‌లో విడుదల చేసింది. మూడేళ్ల క్రితం ఇంట్రాను విడుదల చేశాం. స్వల్పకాలంలోనే లక్ష యూనిట్లను విక్రయించాం. కొత్త పికప్‌ వాహనాలను విడుదల చేయడంతో సమగ్ర పికప్‌ వాహనాల శ్రేణిని అందించినట్లవుతుందని గిరీశ్‌ తెలిపారు. యోధ 2.ఓ ధర రూ.9.99 లక్షలు, ఇంట్రా బయో ఫ్యూయల్‌ వాహనం రూ.10.74 లక్షలు, ఇంట్రా వీ 50 రూ.8.67 లక్షలకు అందుబాటులో ఉండనున్నాయి. కంపెనీ మొదటిసారిగా ఒక టన్ను సామర్థ్యంలో బయో ఫ్యూయల్‌ వాహనాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. వచ్చే నెల రోజుల కాలం లో అన్ని వాణిజ్య వాహన విభాగాల్లో టాటా మోటర్స్‌ కొత్త మోడళ్లను విడుదల చేయనుందన్నారు. కాగా కంపెనీ ఏటా వాణిజ్య వాహనాల అభివృద్ధిపై రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. చిన్న వాణిజ్య వాహనాల్లో కంపెనీకి 40 శాతం వాటా ఉందని గిరీశ్‌ తెలిపారు. 


వచ్చే నెలలో ఎలక్ట్రిక్‌ ఏస్‌ డెలివరీ..

ఎలక్ట్రిక్‌ ఏస్‌ వాహనాన్ని టాటా మోటార్స్‌ మే నెలలో ప్రవేశపెట్టింది. వచ్చే నెలలో ఈ వాహనాలను డెలివరీ చేయనుంది. సెమీ కండక్టర్ల సమస్య, సరఫరా వ్యవస్థ ఇబ్బందుల నేపథ్యంలో కొంత జాప్యం జరిగిందని గిరీశ్‌ అన్నారు. మే నెలలోనే ఎలక్ట్రిక్‌ ఏస్‌ కోసం 39,000 బుకింగ్‌లు వచ్చాయి. బుకింగ్‌లు కొనసాగుతునే ఉన్నాయి. ప్రామాణిక పరిస్థితుల్లో ఒకసారి చార్జింగ్‌ చేస్తే ఎలక్ట్రిక్‌ ఏస్‌ 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపారు. సీఎన్‌జీ, ప్రత్యామ్నాయ ఇంధనాల విస్తరణ పెరుగుతోంది. ఏపీ, తెలంగాణాలు కంపెనీకి కీలకమైన మార్కెట్లు. అందుకే పికప్‌ వాహనాలను హైదరాబాద్‌లో విడుదల చేశామని చెప్పారు. కాగా తయారీలో వినియోగించే వస్తువుల ధరలు పెరుగుతున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కూడా వాణిజ్య వాహనాల ధరలు పెరగనున్నాయి. ప్రతి త్రైమాసికంలో ఉత్పత్తి వ్యయాన్ని కంపెనీలు సమీక్షిస్తాయని గిరీశ్‌ చెప్పారు. 

Updated Date - 2022-09-27T06:55:47+05:30 IST