దిగిరా బంగారం..!

ABN , First Publish Date - 2022-07-16T08:22:19+05:30 IST

దేశంలో విలువైన లోహాల ధరలు గణనీయంగా తగ్గాయి.

దిగిరా బంగారం..!

ఢిల్లీలో రూ.50,000 దిగువకు పసిడి 

కిలో వెండి రూ.55,000లోపే.. 

మున్ముందు మరింత తగ్గే చాన్స్‌!


న్యూఢిల్లీ: దేశంలో విలువైన లోహాల ధరలు గణనీయంగా తగ్గాయి. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర శుక్రవారం రూ.293 తగ్గి రూ.49,970కి పరిమితమైంది. దాంతో గోల్డ్‌ అర లక్ష స్థాయి నుంచి దిగివచ్చినట్లైంది. బంగారంతో పాటు వెండి కూడా రూ.55,000 దిగువకు చేరింది. కేజీ సిల్వర్‌ ఏకంగా రూ.1,075 తగ్గి రూ.54,326 రేటు పలికింది. ఇక హైదరాబాద్‌, ముంబై మార్కెట్లలోనూ పసిడి ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్‌  మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన (24 క్యారట్స్‌) బంగారం రూ.430 తగ్గుదలతో రూ.50,730కి  చేరుకోగా 22 క్యారట్ల పది గ్రాముల పసిడి రూ.400 తగ్గి రూ.46,500 కు చేరుకుంది. కాగా వెండి కిలో ఏకంగా రూ.1,900 తగ్గి రూ.60,400 వద్ద క్లోజైంది. ఇక ముంబైలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.162 తగ్గుదలతో రూ.50,403 వద్ద స్థిరపడగా 22 క్యారట్ల పసిడి రూ.149 తగ్గి రూ.46,169 వద్ద ముగిసింది. మరోవైపు కేజీ వెండి కూడా రూ.918 తగ్గి రూ.54,767 వద్ద క్లోజైంది. కాగా ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌లోనూ బంగారం బలహీనపడింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో ఆగస్టు డెలివరీ కాంట్రాక్టు ధర రూ.158 తగ్గి రూ.50,070కి జారుకుంది. అంతర్జాతీయంగా ఈ లోహాల ధరలు తగ్గడం ఇందుకు దోహదపడింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒక దశలో 1,703 డాలర్లు, సిల్వర్‌ 18.23 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. అంతర్జాతీయంగా పసిడి ధరలు వరుసగా ఐదు వారాలుగా తగ్గుతూ వస్తున్నాయి. 

గోల్డ్‌కు డాలర్‌ పంచ్‌ 

40 ఏళ్ల సరికొత్త గరిష్ఠ స్థాయికి పెరిగిన ధరలను నియంత్రించేందుకు అమెరికా సెంట్రల్‌ బ్యాంకైన ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లను వేగంగా, అధికంగా పెంచవచ్చన్న భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డాలర్‌ క్రమంగా బలం పుంజుకుంటుండటంతో విలువైన లోహాలకు డిమాండ్‌ తగ్గుతూ వస్తోంది. ఎందుకంటే, డాలర్‌ విలువతో పాటు అమెరికాలో వడ్డీ రేట్లు, బాండ్ల రిటర్నుల రేటు కూడా పెరుగుతూ పోతున్నాయి. దాంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండిలోని పెట్టుబడులను గతంలో కంటే అధిక వడ్డీ ఆదాయం పంచుతున్న ఆర్థిక సాధనాల్లోకి మళ్లిస్తున్నారు. డాలర్‌ మరింత బలం పుంజుకుంటే బులియన్‌ రేట్లు మరింత తగ్గవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో దేశీయంగానూ వీటి రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2022-07-16T08:22:19+05:30 IST