smartphonesusers: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కేంద్రం కీలక అడ్వైజరీ.. ఇకపై అలా చెయొద్దు..

ABN , First Publish Date - 2022-09-19T00:08:26+05:30 IST

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత అప్రమత్తంగా ఉంటున్నా.. సైబర్ నేరాల ఘటనలు ఆగడం లేదు. ఏదోఒక మూలన ఆన్‌లైన్ మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

smartphonesusers: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కేంద్రం కీలక అడ్వైజరీ.. ఇకపై అలా చెయొద్దు..

ఎంత అప్రమత్తంగా ఉంటున్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. సైబర్ నేరాల(cyber crimes) ఘటనలు ఆగడం లేదు. ఏదోఒక మూలన ఆన్‌లైన్ మోసాలు(online frauds) వెలుగుచూస్తూనే ఉన్నాయి. కొత్తకొత్త మార్గాలను ఎంచుకుంటున్న మోసగాళ్లు ఏదో విధంగా అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ రివార్డులు, క్యాష్ ప్రైజులు, బహుమతుల పేరిట జనాలను బోల్తాకొట్టిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల(Smart phones) వినియోగమే ఇందుకు ప్రధాన కారణమవుతోంది. అందుకే స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఇలాంటి నేరాల ఉచ్చులో పడనీయకుండా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీఈఆర్‌టీ-ఇన్ (Indian Computer Emergency Response Team) రంగంలోకి దిగింది. స్మార్ట్‌ఫోన్లలో యాప్స్ డౌన్‌లోడ్ లేదా ఆన్‌లైన్‌లో బ్రౌజింగ్ సమయంలో జాగ్రత్తలుగా చేయాల్సిన, చేయకూడని అంశాలతో కీలకమైన ఒక జాబితాలను విడుదల చేసింది. ఈ జాబితాలో ఏయే అంశాలున్నాయో మీరూ ఓ లుక్కేయండి..


ఈ అంశాలను పాటించండి..

1. వేరిఫై చేయకుండా ఏ యాప్స్(apps) పడితే ఆ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే. గూగుల్ ప్లే స్టోర్(Google Play Store), యాప్ స్టోర్‌(App Store) వంటి అధికారిక యాప్  స్టోర్స్‌ నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం సురక్షితం.

2. యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ముందు యాప్ వివరాలపై రివ్యూలు, అప్పటివరకు ఎన్ని డౌన్‌లోడ్స్ అయ్యాయి, యూజర్ల రివ్యూలు, కామెంట్లతోపాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్‌లోని సమాచారాన్ని కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాతే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

3. యాప్ పర్మిషన్స్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. యాప్‌ దేనికోసమో వాడబోతున్నారో అందుకు సంబంధించిన అంశాలకే అనుమతి ఇవ్వండి. అవసరంలేని పర్మిషన్స్ ఇవ్వడం హానికరం.

4. ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్ల నుంచి అప్‌డేట్స్ లభ్యమైనప్పుడు యాప్స్‌ని అప్‌డేట్ చేసుకోండి.

5. అపరిచిత వ్యక్తులు లేదా కంపెనీల నుంచి వచ్చే ఈ-మెయిల్స్, ఎస్ఎంఎస్‌ల రూపంలో వచ్చిన లింక్స్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్-ట్రస్టెడ్ వెబ్‌సైట్స్‌పై బ్రౌజ్ చేయడం లేదా లింక్స్‌పై క్లిక్ చేయడం హానికరం. సున్నితమైన సమాచారం తస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.

6. అనుమానాస్పద లింక్స్ ఏమైనా వస్తే అవి ఏ నంబర్ నుంచి వచ్చాయో పరిశీలించండి. ఆ నంబర్లు సాధారణ నంబర్లలా కనిపించక.. కొంచెం విభిన్నంగా కనిపిస్తాయి. మోసగాళ్లు తమ అసలు ఫోన్ నంబర్లు బయటపడకుండా మాస్క్ వేసి పైకి వేరే నంబర్లు కనిపించేలా చేస్తారు. ఎక్కువ ఫ్యాన్స్ నంబర్లు కనిపించేలా చేస్తారు. ఈ-మెయిల్స్, మెసేజులకు కూడా మాస్క్ వేసి వారి గుర్తింపు కనబడకుండా జాగ్రత్త పడుతుంటారు. బ్యాంకుల నుంచే వచ్చే మెసేజుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.7. మెసేజుల రూపంలో వచ్చే లింక్స్‌పై క్లిక్ చేసేముందు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఫోన్ నంబర్లు, సంబంధిత సమాచారం ఆధారంగా బ్రౌజ్ చేసేందుకు చాలా వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి. 

8. యాంటీ వైరస్, యాంటీస్పైవేర్ సాఫ్ట్‌వేర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోండి.

9. సేఫ్ బ్రౌజింగ్ టూల్స్, ఫిల్టరింగ్ టూల్స్, ఫైర్‌వాల్, ఫిల్టరింగ్ సర్వీసెస్‌ వినియోగాన్ని పరిశీలించడం ఉత్తమం.

10. కుదించిన(షార్టెన్డ్) యూఆర్ఎల్స్(URL) అంటే.. bit.ly , tinyurl వంటి యూఆర్‌ఎల్స్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాంటి లింక్స్‌పై కర్సర్ ఉంచితే ఫుల్‌ వెబ్‌సైట్ డొమైన్ పేరు చూడొచ్చు. అలా కుదరకపోతే యూఆర్ఎల్ చెకర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇతర మార్గాల్లో కూడా పూర్తి యూఆర్ఎల్‌ను తనిఖీ చేయవచ్చు.

11. వ్యక్తిగత వివరాలు లేదా అకౌంట్ లాగిన్ వివరాలు ఇచ్చే ముందు సంబంధిత వెబ్‌సైట్ బ్రౌజర్ అడ్రస్ బార్‌లో గ్రీన్‌లాక్‌ను చెక్ చేసి వ్యాలిడ్ ఎన్‌స్ర్కిప్షన్‌ను పరిశీలించవచ్చు.

12. అనుమానిత లింక్స్‌పై క్లిక్ చేసిన తర్వాత బ్యాంకు ఖాతాలో ఏమైనా యాక్టివిటీ కనిపిస్తే వెంటనే సంబంధిత బ్యాంక్‌కు ఫిర్యాదు చేయాలి. తగిన చర్యలు తీసుకోవాలంటే బ్యాంకు అధికారులకు సమాచారాన్ని వెల్లడించడం చాలా కీలకం.

Read more