Yvon Chouinard: నువ్వు నిజంగా దేవుడు సామీ.. సమాజం కోసం రూ.23 వేల కోట్లు ఇచ్చేసిన వ్యాపారవేత్త.. అంత డబ్బుతో ఏం చేయబోతున్నారో తెలుసా..

ABN , First Publish Date - 2022-09-20T20:04:51+05:30 IST

కొందరు వ్యక్తుల జీవితం తరతరాలు చెప్పుకునేలా ఉంటుంది. వారి ఆదర్శవంత అడుగులు సమాజ పోకడలపై బలమైన ముద్రవేస్తాయి.

Yvon Chouinard: నువ్వు నిజంగా దేవుడు సామీ.. సమాజం కోసం రూ.23 వేల కోట్లు ఇచ్చేసిన వ్యాపారవేత్త.. అంత డబ్బుతో ఏం చేయబోతున్నారో తెలుసా..

కొందరు వ్యక్తుల జీవితం తరతరాలు చెప్పుకునేలా ఉంటుంది. వారి ఆదర్శవంత అడుగులు సమాజ పోకడలపై బలమైన ముద్రవేస్తాయి. స్వలాభాన్ని మించి సమాజహితాన్ని కోరే వారి నిర్ణయాలు ఎప్పటికీ ప్రేరణగా నిలచిపోతాయి. ఆ కోవకే చెందుతారు ఔట్‌డోర్ ఫ్యాషన్ బ్రాండ్ ‘పటగోనియా’ (Patagonia) వ్యవస్థాపకుడు, సుసంపన్నుడు వైవోన్ చౌనార్డ్(Yvon Chouinard). పర్యావరణహితాన్ని ఆకాంక్షిస్తూ ఏకంగా రూ.23 వేల కోట్ల(3 బిలియన్ డాలర్లు) విలువైన కంపెనీని త్యజించారు. పటగోనియా కంపెనీ యాజమాన్యాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. తన, తన కుటుంబం సభ్యుల పేరిట కంపెనీ యాజమాన్య హక్కులను వాతావరణ మార్పులపై పోరాటానికి ఏర్పాటైన రెండు ట్రస్టులకు బదిలీ చేశారు. 50 ఏళ్ల కష్టార్జితాన్ని వెనుకాముందు ఆలోచించకుండా ప్రపంచ సమాజం మేలు కోరుతూ ధారాదత్తం చేశారు. ఈ భారీ మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా భూపరిరక్షణ కోసం ఉపయోగించనున్నారు. ఈ మేరకు పటగోనియా కంపెనీ యాజమాన్య హక్కుల బదిలీని తన వెబ్‌సైట్‌లో గత బుధవారం వెల్లడించింది.


 కంపెనీ స్టాక్స్ అన్ని ట్రస్టులకే చెందుతాయని తెలిపింది. పటగోనియా కంపెనీకి చెందిన వోటింగ్ స్టాక్ మొత్తం ‘పటగోనియా పర్పస్ ట్రస్ట్’కి దక్కనుంది. ఈ ట్రస్ట్ ఎంతోకాలంగా పర్యావరణహితం కోసం పాటుపడుతోంది. ఇక నాన్-ఓటింగ్ స్టాక్ మొత్తం ‘హోల్డ్‌ఫాస్ట్ కలెక్టివ్’ అని ట్రస్టుకు చెందనుందని వెల్లడించింది. దీంతో భవిష్యత్‌లో కంపెనీకి వచ్చే లాభాలన్ని ట్రస్టుల కార్యకలాపాలకే ఉపయోగించనున్నారు. కాగా ఈ కంపెనీ వార్షిక ఆదాయం 100 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.800 కోట్లుగా ఉంది. కాగా 50 ఏళ్ల చరిత్ర ఉన్న పటగోనియా కంపెనీ ఔట్‌డోర్ క్లాతింగ్‌తోపాటు క్లైంబింగ్, సర్ఫింగ్, స్కీయింగ్ వంటి స్పోర్ట్స్‌కి ప్రత్యేకంగా దుస్తులను రూపొందిస్తుంది. క్లైంబర్ల కోసం తక్కువ ధరలకే ప్రత్యేక దుస్తులను అందుబాటులోకి తీసుకొచ్చి మన్ననలు పొందుతున్నారు. దీంతో అమెరికాలోనే ప్రధాన ఔట్‌డోర్ క్లాతింగ్ బ్రాండ్స్‌లో ఒక టాప్ కంపెనీగా పటగోనియా నిలిచింది.

వ్యాపారవేత్తగా ఉండాలనుకోలేదు: వైవోన్ చౌనార్డ్

వ్యాపారవేత్త అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదని వైవోన్ చౌనార్డ్ చెప్పారు. పెటగోనియా కంపెనీని ఒక హస్తకళాకారుడిగా ఆరంభించానని గుర్తుచేసుకున్నారు. తొలుత తన కోసం, తన మిత్రుల కోసం క్లైంబింగ్ క్లాతింగ్‌ని తయారు చేశానని ఆయన చెప్పారు. ‘‘ పెటగోనియా కంపెనీని విక్రయించి ఆ డబ్బునంతా విరాళంగా నాకు ఒక అవకాశం. కాగా కంపెనీని పబ్లిక్‌గా మార్చడం  రెండవ మార్గమని చెప్పారు. ఇక కొత్త యాజమాన్యం మా విలువలను పాటిస్తుందో లేదో తెలియదు. ఇక పర్యావరణంపై పోరాటానికి ఉత్తమంగా వ్యవహరిస్తున్నా.. ఇది సరిపోదు. మరింత డబ్బు అవసరమవుతుంది’’ అని మనసులో మాట చెప్పారు.


ఆదర్శవంత వ్యక్తులు ఇంకా ఉన్నారు: హర్ష గోయెంకా

వైవోన్ చౌనార్డ్ తన పెద్దమనసును భారతీయ వ్యాపార దిగ్గజం, ఆర్‌పీజీ గ్రూప్ అధినేత హర్ష గోయెంకా కొనియాడారు. ‘‘ బిలియనీర్ వైవోన్ చౌనార్డ్ తన పెటగోనియా కంపెనీ యాజమాన్య హక్కులను ట్రస్టు, స్వచ్ఛంద సేవా సంస్థకి బదిలీ చేశారు. పర్యావరణ సవాళ్లపై పోరాటానికి ఏడాదికి 100 మిలియన్ డాలర్లు అందించబోతున్నారు. ఈ ప్రపంచంలో ఇంకా ఆదర్శవంత వ్యక్తులు ఉన్నారు’’ అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

Read more