అమ్మకానికి అశోకా హోటల్‌

ABN , First Publish Date - 2022-11-25T03:57:21+05:30 IST

నేషనల్‌ మానిటైజేషన్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌ఎంపీ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని అశోకా హోటల్‌ను విక్రయించనుంది...

అమ్మకానికి అశోకా హోటల్‌

విలువ రూ.7,409 కోట్లుగా నిర్ణయించిన కేంద్రం

న్యూఢిల్లీ: నేషనల్‌ మానిటైజేషన్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌ఎంపీ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని అశోకా హోటల్‌ను విక్రయించనుంది. పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షి్‌ప (పీపీపీ) పద్ధతిలో జరగనున్న మానిటైజేషన్‌ ప్రక్రియలో భాగంగా ఈ ఐకానిక్‌ హోటల్‌ విలువను రూ.7,409 కోట్లుగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశ రాజధాని నడిబొడ్డులో ఉన్న ఈ 25 ఎకరాల ప్రాపర్టీ అమ్మకం కోసం ఇన్వెస్టర్లతో సంప్రదింపులు ఇప్పటికే జరుగుతున్నాయని, ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదమే తరువాయని వారన్నారు. గత ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఎన్‌ఎంపీలో భాగంగా ఆశోకా హోటల్‌, దానిపక్కనే ఉన్న హోటల్‌ సామ్రాట్‌ సహా ఇండియా టూరిజం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు చెందిన 8 ఆస్తులను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఎంఎన్‌పీలో భాగంగా ఆయా రంగాల్లోని మౌలిక ఆస్తుల విక్రయం ద్వారా నాలుగేళ్లలో రూ.6 లక్షల కోట్లు సమీకరించనున్నట్లు 2021 ఆగస్టులో సీతారామన్‌ వెల్లడించారు. మౌలిక రంగాలకు పలు మంత్రిత్వ శాఖలతో చర్చించి ఎన్‌ఎంపీలో చేర్చాల్సిన ఆస్తుల జాబితాను నీతి ఆయోగ్‌ రూపొందించింది. ఈ నెల 14న నీతి ఆయోగ్‌ సీఈఓ పరమేశ్వరన్‌ అయ్యర్‌తో భేటీ అయిన ఆర్థిక మంత్రి సీతారామన్‌.. ఎన్‌ఎంపీ ప్రక్రియ అమలు తీరును సమీక్షించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.33,422 కోట్ల విలువైన ఆస్తులను మానిటైజ్‌ చేసింది. అందులో బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆస్తుల విలువ రూ.17,000 కోట్లుగా ఉంది. నౌకాశ్రయాలు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్స రం మానిటైజేషన్‌ (నగదీకరణ) లక్ష్యాలను అధిగమించనుంది. 2021-22లో కేంద్ర ప్రభుత్వం రూ.88,000 కోట్ల లక్ష్యాన్ని మించి రూ.లక్ష కోట్ల ఆస్తులను మానిటైజ్‌ చేయగలిగింది. అయితే, 2022-23లో రూ.1,62,422 కోట్ల విలువైన ఆస్తులను మానిటైజ్‌ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, రూ.1,24,179 కోట్ల వరకు ఆదాయం సమకూరవచ్చని అంచనా.

Updated Date - 2022-11-25T03:57:21+05:30 IST

Read more