దా‘రుణ’ యాప్‌లకు చెక్‌!

ABN , First Publish Date - 2022-09-10T06:30:32+05:30 IST

భారత్‌లో దా‘రుణ’ యాప్‌ల ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. చట్టబద్ధంగా కార్యకలాపాలు

దా‘రుణ’ యాప్‌లకు చెక్‌!

న్యూఢిల్లీ: భారత్‌లో దా‘రుణ’ యాప్‌ల ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. చట్టబద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న రుణ యాప్‌ల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)ని నిర్దేశించారు. అంతేకాదు, ఆర్‌బీఐ రూపొందించనున్న జాబితాలోని రుణ యాప్‌లు మాత్రమే గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ వంటి యాప్‌ స్టోర్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖను కోరారు. ఆర్థిక మంత్రి సీతారామన్‌ నేతృత్వంలో గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అక్రమ రుణ యాప్‌లపై చర్చించి, చేపట్టాల్సిన చర్యలపై  నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ అండ్‌ కార్పొరేట్‌ వ్యవహారాలు, ఆర్థిక సేవల కార్యదర్శులతో పాటు ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఐటీ శాఖ సెక్రెటరీ, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. దేశంలో చాలావరకు డిజిటల్‌ రుణ యాప్‌లు ఆర్‌బీఐ వద్ద రిజిస్టర్‌ చేసుకోకుండా చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ దారుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపులు తాళలేక ఈ మధ్య కాలంలో చాలామంది రుణగ్రహీతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశంలో అక్రమ రుణ యాప్‌ల కార్యకలాపాలు పెరుగుతుండటంపై ఆర్థిక మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ యాప్‌లు పేదలు, అల్పాదాయ వర్గాలకు తక్షణ, సులభ రుణాలంటూ ఆశజూపి భారీగా వడ్డీ, ప్రాసెసింగ్‌ రుసుము, ఇతర చార్జీలు వసూలు చేస్తున్నాయన్నారు. రుణాల రికవరీలో భాగంగా ఈ యాప్‌ల నిర్వహకులు బ్లాక్‌మెయిల్‌, బెదిరింపులకు పాల్పడుతుండటమూ ఆందోళనకరమని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్థిక శాఖ పేర్కొంది. అంతేకాదు, ఈ యాప్‌లు మనీలాండరింగ్‌, పన్ను ఎగవేతలు, సమాచార గోప్యత నిబంధనల ఉల్లంఘన, అనియంత్రిత పేమెంట్‌ అగ్రిగేటర్లు, డొల్ల కంపెనీలు, అచేతనంగా ఉన్న ఎన్‌బీఎ్‌ఫసీల దుర్వినియోగానికి పాల్పడుతుండటం పైనా సమావేశంలో చర్చించారు. 


అక్రమ రుణ యాప్‌లకు సంబంధించి చట్టపరమైన, విధానపరమైన, సాంకేతిక అంశాలపై సమావేశంలో చర్చించిన అనంతరం వాటిని కట్టడి చేసేందుకు ఆర్థిక మంత్రి ఆదేశించిన పలు చర్యల వివరాలు..  

అన్ని అనుమతులు కలిగి ఉండి, చట్టబద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న రుణ యాప్‌ల జాబితా తయారు చేయాల్సిందిగా ఆర్‌బీఐకి నిర్దేశాలు. లిస్ట్‌లోని యాప్‌లు మాత్రమే యాప్‌ స్టోర్లలో ఉండేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ శాఖకు ఆదేశాలు. 

ఈ యాప్‌లు అమాయకుల ఖాతాల ద్వారా మనీలాండరింగ్‌కు ఏమైనా పాల్పడుతున్నాయా అని ఆర్‌బీఐ పర్యవేక్షించనుంది. ఇందుకు అవకాశమున్న అకౌంట్స్‌పై కన్నేసి ఉంచనుంది. అలాగే, యాప్‌ల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు అచేతనంగా ఉన్న ఎన్‌బీఎ్‌ఫసీల రిజిస్ట్రేషన్‌ను సమీక్షించడం లేదా రద్దు చేయనుంది. 

నిర్దేశిత సమయంలోగా పేమెంట్‌ అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేలా ఆర్‌బీఐ జాగ్రత్తపడనుంది. ఆ తర్వాత అన్‌ రిజిస్టర్డ్‌ పేమెంట్‌ అగ్రిగేటర్లు కార్యకలాపాలు సాగించకుండా చర్యలు చేపట్టనుంది.

షెల్‌ కంపెనీల ద్వారా లోన్‌ యాప్‌లు మనీలాండరింగ్‌కు పాల్పడకుండా కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుంది. దుర్వినియోగమవుతున్న షెల్‌ కంపెనీలను గుర్తించి వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనుంది.

కస్టమర్లు, బ్యాంక్‌ సిబ్బంది, చట్ట సంస్థలతో పాటు సంబంధిత వర్గాలందరిలో సైబర్‌ అవగాహన పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టనుంది. 

దా‘రుణ’ యాప్‌ల కార్యకలాపాలను అడ్డుకునేందుకు అన్ని మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు అన్ని మార్గాల్లో చర్యలు తీసుకోనున్నాయి. 

చేపట్టాల్సిన చర్యల ప్రణాళిక అమలును ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షించనుంది. 

Updated Date - 2022-09-10T06:30:32+05:30 IST