మార్కెట్లో రికార్డుల మోత

ABN , First Publish Date - 2022-11-25T04:01:11+05:30 IST

దలాల్‌ స్ట్రీట్‌లో మళ్లీ రికార్డుల మోత మోగింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు గురువారం ట్రేడింగ్‌లో ఐటీ, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లలో కొనుగోళ్లు పెంచారు. దాంతో 62,000 మైలురాయిని దాటిన బీఎ్‌సఈ సెన్సెక్స్‌....

మార్కెట్లో రికార్డుల మోత

  • సరికొత్త శిఖరంపైకి సెన్సెక్స్‌

  • 62,000 ఎగువన ముగింపు

  • 18,500కు చేరువలో నిఫ్టీ

ముంబై: దలాల్‌ స్ట్రీట్‌లో మళ్లీ రికార్డుల మోత మోగింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు గురువారం ట్రేడింగ్‌లో ఐటీ, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లలో కొనుగోళ్లు పెంచారు. దాంతో 62,000 మైలురాయిని దాటిన బీఎ్‌సఈ సెన్సెక్స్‌.. సరికొత్త జీవిత కాల గరిష్ఠానికి చేరుకుంది. ఒక దశలో 902 పాయింట్లు ఎగిసి 62,412.33 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసుకున్న సూచీ.. చివరికి 762.10 పాయింట్ల (1.24 శాతం) లాభంతో 62,272.68 వద్ద స్థిరపడింది. సూచీకి సరికొత్త గరిష్ఠ ముగింపు స్థాయిది. 62 వేల ఎగువన ముగియడం ఇదే తొలిసారి. అంతేకాదు, సెన్సెక్స్‌ సరికొత్త శిఖరాలకు చేరుకోవడం వరుసగా ఇది ఆరో ఏడాది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ సూచీ 216.85 పాయింట్ల(1.19 శాతం) లాభంతో 18,484.10 వద్ద సరికొత్త రికార్డు ముగింపును నమోదు చేసుకుంది. ఇంట్రాడేలో 262.45 పాయింట్ల పెరుగుదలతో 18,529.70 వద్ద సరికొత్త ఏడాది గరిష్ఠాన్ని తాకింది. వరుసగా మూడు రోజుల ర్యాలీలో సెన్సెక్స్‌ 1,167 పాయింట్లు, నిఫ్టీ 324 పాయింట్లు బలపడ్డాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 26 లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌ షేరు 2.93 శాతం ఎగిసి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.

ర్యాలీకి కారణాలు: అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మున్ముందు సమీక్షల్లో వడ్డీ రేట్ల పెంపు తీవ్రతను తగ్గించనున్నట్లు గత సమీక్ష మినిట్స్‌లో సంకేతాలిచ్చింది. ఇది అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు ఊరట కల్పించింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో సానుకూల ట్రేడింగ్‌కు అనుగుణంగా దలాల్‌ స్ట్రీట్‌లోనూ కొనుగోళ్లు పెరిగాయి. అమెరికా బాండ్‌ రేట్లు, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, రూపాయి బలోపేతంతోపాటు దేశీయంగా సానుకూల రుణ వృద్ధి, పటిష్ఠ వృద్ధి పునరుద్ధరణ సంకేతాలు కూడా మన ఈక్విటీ మార్కెట్‌కు కలిసిచ్చాయి. ఈ నెల ఎఫ్‌ అండ్‌ ఓ కాంట్రాక్టుల ముగింపు కావడంతో ట్రేడర్లు భారీగా షార్ట్‌ కవరింగ్‌కు పాల్పడ్డారు.

తొలి ఏడాదిలోనే పేటీఎం షేరు 75 శాతం డౌన్‌

పేటీఎం పేరుతో డిజిటల్‌ చెల్లింపుల సేవలందిస్తున్న వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ షేరు.. స్టాక్‌ మార్కెట్లో లిస్టయినప్పటి నుంచి 75 శాతం క్షీణించింది. గడిచిన దశాబ్ద కాలంలో ఐపీఓ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు సేకరించిన ప్రపంచ కంపెనీల్లో.. తొలి ఏడాదే ఈ స్థాయి పతనాన్ని చవిచూసిన రెండో షేరు ఇది. స్పెయిన్‌ కంపెనీ బంకియా ఎస్‌ఏ షేరు కూడా లిస్టయిన తొలి ఏడాదిలోనే (2012లో) 82 శాతం క్షీణించింది.

సంక్షిప్తంగా..

  • టాటా స్టార్‌బక్స్‌ ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టింది. రాష్ట్రంలో తొలి స్టార్‌బక్స్‌ స్టోర్‌ను విజయవాడలో ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 37 నగరాల్లో 307 స్టోర్స్‌ను టాటా స్టార్‌బక్స్‌ నిర్వహిస్తోంది.

  • ఎథర్‌ ఎనర్జీ.. తమిళనాడులోని హోసూర్‌లో రెండో తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. కొత్త ప్లాంట్‌ ఏర్పాటుతో ఏటా ఉత్పత్తి సామర్థ్యం 1.2 లక్షల యూనిట్ల నుంచి 4.2 లక్షల యూనిట్లకు చేరుకోనుంది. డిమాండ్‌కు తగ్గట్టుగా ఎథర్‌ 450 ఎక్స్‌, 450 ప్లస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను సరఫరా చేసే అవకాశం లభిస్తుందని ఎథర్‌ ఎనర్జీ పేర్కొంది.

  • వచ్చే ఏడాది (2023) చివరి నాటికి దేశవ్యాప్తంగా 100కు పైగా షోరూమ్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎలక్ట్రిక్‌ వెహికల్‌ స్టార్టప్‌ ఈవీయం వెల్లడించింది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ సహా మొత్తం 8 రాష్ట్రాల్లో 25కు పైగా నగరాల్లో కొత్త స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

  • టాటా సంపన్న్‌.. దక్షిణాది మార్కెట్లో వినియోగదారులకు మరింతగా చేరువయ్యేందుకు గాను కారం, పసుపు ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతోపాటు టాలీవుడ్‌ నటి ప్రియమణితో ప్రత్యేకంగా ఒక ప్రకటనను రూపొందించింది.

  • విమానాల తయారీ కంపెనీకి బోయింగ్‌కు నేషనల్‌ ఏరోస్పేస్‌ స్టాండర్డ్‌ ప్రమాణాలు కలిగిన విడి భాగాలను హైదరాబాద్‌కు చెందిన అజాద్‌ ఇంజనీరింగ్‌ సరఫరా చేసింది. బోయింగ్‌కు విడిభాగాలను తయారీ చేయడానికి గతంలో కంపెనీ కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకుంది.

Updated Date - 2022-11-25T04:02:50+05:30 IST