87 ఐపీఓలు-రూ.1460 కోట్లు

ABN , First Publish Date - 2022-10-03T08:28:43+05:30 IST

పెద్ద కంపెనీల కన్నా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి.

87 ఐపీఓలు-రూ.1460 కోట్లు

నిధుల సమీకరణలో ఎస్‌ఎంఈల దూకుడు

ముంబై: పెద్ద కంపెనీల కన్నా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు నెలల మధ్య కాలంలో మొత్తం 87 ఎస్‌ఎంఈ ఐపీఓలు జారీ కాగా రూ.1460 కోట్లు సమీకరించారు. 2021 సంవత్సరం మొత్తం మీద 56 కంపెనీలు ఇష్యూల ద్వారా సేకరించిన రూ.783 కోట్ల కన్నా ఇది రెట్టింపు. మిగతా మూడు నెలల కాలంలోనూ మరిన్ని కంపెనీలు ఇష్యూకి రాబోతున్నాయి. మొత్తం మీద ఈక్విటీ మార్కెట్‌ ద్వారా రుణాలు సమీకరించాలని భావిస్తున్న కంపెనీలకు ఈ ఏడాది చాలా సానుకూలంగా ఉందని ఫెడెక్స్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ నాయర్‌ అన్నారు. మార్కెట్లో ప్రస్తుత బేరిష్‌ ట్రెండ్‌కు ఎస్‌ఎంఈ విభాగం ప్రభావితం కాలేదని, చాలా కంపెనీలు బీఎ్‌సఈ ఎస్‌ఎంఈ, ఎన్‌ఎ్‌సఈ ఎమర్జ్‌ విభాగాల్లో ఇష్యూలు జారీ చేసేందుకు దరఖాస్తు చేసి ఉన్నాయని హెమ్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఇష్యూలు జారీ చేసిన ఎస్‌ఎంఈల్లో ఐటీ, ఆటో విడిభాగాలు, ఫార్మా, మౌలిక వసతులు, ఆతిథ్యం, జువెలరీ విభాగాలకు చెందిన కంపెనీలున్నాయి. ఒక్క సెప్టెంబరు నెలలోనే 29 ఎస్‌ఎంఈ ఇష్యూలు మార్కెట్‌ తలుపు తట్టాయి.


వాటిలో 25 ఇష్యూల గడువు పూర్తి కాగా మరో నాలుగు ఇష్యూలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. ఇన్సొలేషన్‌ ఎనర్జీ ఇష్యూ అయితే ఏకంగా 183 రెట్లు అధిక సబ్‌స్ర్కిప్షన్‌ సాధించింది. బీఎ్‌సఈ ఎస్‌ఎంఈ వేదికపై ఇంత పెద్ద సబ్‌స్ర్కిప్షన్‌ సాధించిన ఏకైక కంపెనీ ఇది. అధిక శాతంలో ఇష్యూలు జారీ అవుతున్న కొద్ది ఆర్థికంగా మంచి  పని తీరు సాధిస్తున్న కంపెనీల కోసం అన్వేషణ పెరిగిందని, ఇది ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగేందుకు దోహదపడుతోందని విశ్లేషకులంటున్నారు. ఈ ఎస్‌ఎంఈలన్నీ వ్యాపార విస్తరణ కార్యకలాపాలు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, రుణాల చెల్లింపు, ఇతర కార్పొరేట్‌ అవసరాలకు నిధులు సమీకరిస్తున్నట్టు ప్రకటించాయి. మరోపక్క పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన పెద్ద కంపెనీల సంఖ్య ఇంతవరకు 20 ఉంది. వాటిలో ప్రభుత్వ రంగంలోని ఎల్‌ఐసీ ఒకటి. ఈ కంపెనీలన్నీ కలిసి సమీకరించిన మొత్తం రూ.43,275 కోట్లు. 2011 సంవత్సరంలో ఇష్యూకి  వచ్చిన పెద్ద కంపెనీలు 63 కాగా అవి సేకరించిన మొత్తం రూ.1.2 లక్షల కోట్లు. 

Updated Date - 2022-10-03T08:28:43+05:30 IST