వచ్చే నెల 1 నుంచి 5జీ సేవలు

ABN , First Publish Date - 2022-09-25T07:09:09+05:30 IST

దేశంలో 5జీ వాణిజ్య సేవలు వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానున్నాయి.

వచ్చే నెల 1 నుంచి 5జీ సేవలు

 ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం


తొలుత ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ సహా 

 7 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి..  

న్యూఢిల్లీ: దేశంలో 5జీ వాణిజ్య సేవలు వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగనున్న ‘ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌’ (ఐంఎసీ) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను ప్రారంభించనున్నారు. కేంద్ర సమాచార శాఖ పరిధిలోని నేషనల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ మిషన్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ‘‘ దేశంలో డిజిటల్‌ పరివర్తనం, అనుసంధానాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు ఐఎంసీ వేదికగా ప్రధాని 5జీ సేవలను ప్రారంభిస్తార’’ని ట్వీట్‌ చేసింది. అనంతరం ఐఎంసీ అధికారిక వెబ్‌సైట్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా (వీ) తొలుత ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ సహా 7 నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే, టెల్కోలు తొలుత 13 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభిస్తాయని టెలికాం డిపార్ట్‌మెంట్‌ గతంలో పేర్కొంది. ఈ విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ 

ఐఎంసీ అక్టోబరు 1-4 తేదీల్లో జరగనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్‌. టెలికాం శాఖ, సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాయ్‌) కలిసి నిర్వహిస్తున్నాయి. ఐఎంసీలో దేశీయ, అంతర్జాతీయ టెలికాం రంగ కంపెనీలు, వెండార్లు పాల్గొనున్నాయి. కంపెనీలు తమ 5జీ టెక్నాలజీలను ప్రదర్శించనున్నాయి. 5జీ సేవల ప్రారంభ కార్యక్రమంలో టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పా టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్‌ అధిపతి సునీల్‌ మిట్టల్‌, వొడాఫోన్‌ ఐడియా ఇండియా హెడ్‌ రవీందర్‌ టక్కర్‌ తదితరులు ప్రధానితో వేదిక పంచుకోనున్నట్లు ప్రభుత్వ అధికారి తెలిపారు. వచ్చే 2-3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి రావచ్చని టెలికాం మంత్రి గతంలో ఓ సదస్సులో తెలిపారు. అంతేకాదు, 5జీ సేవల నెట్‌వర్క్‌ ఏర్పాటు కోసం టెలికాం కంపెనీలు రూ.3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టవచ్చన్న మంత్రి.. ఈ పెట్టుబడులు భారీగా ఉపాధి కల్పనకు దోహదపడగలవన్నారు. అంతేకాదు, మన దేశంలో 4జీ లాగే 5జీ సేవలు కూడా అత్యంత అందుబాటు ధరల్లో లభ్యం కాగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more